నీతా అంబానీ దాతృత్వం: బల్కంపేట ఎల్లమ్మ గుడికి కోటి రూపాయల విరాళం
ఈ విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకున్న నీతా అంబానీ ఆలయ అభివృద్ధికి ఈ విరాళాన్ని అందించినట్టు సమాచారం.
By: Tupaki Desk | 20 Jun 2025 3:20 PM ISTహైదరాబాద్‌లో ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటైన బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యా, క్రీడా రంగాల్లో సేవలందిస్తున్న నీతా అంబానీ భారీ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత సౌకర్యాల కల్పన, అన్నదానం కార్యక్రమాల నిర్వహణ కోసం ఆమె రూ.1 కోటి విరాళాన్ని ఆలయ అధికారిక ఖాతాలో జమ చేసినట్లు దేవస్థానం ఈవో మహేందర్ గౌడ్ వెల్లడించారు.
ఈ మొత్తం మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉంచి, దాని వడ్డీతో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ విధంగా భక్తులకు ప్రతి రోజూ ఉచిత అన్నదానం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
గత ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి వచ్చారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ విశిష్టతను నాటి ఈవో కృష్ణ వారికి వివరించారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపుదల కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకున్న నీతా అంబానీ ఆలయ అభివృద్ధికి ఈ విరాళాన్ని అందించినట్టు సమాచారం. ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని దేవస్థానం యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నీతా అంబానీ కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా భక్తులు కూడా నీతా అంబానీ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. దాతృత్వం చూపి ఇతర ప్రముఖులకు ఆదర్శంగా నిలిచారంటూ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.
