Begin typing your search above and press return to search.

కనిమొళి నోట 'ద్రౌపది' మాట.. కడిగేసిన నిర్మలమ్మ

కనిమొళి వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

By:  Tupaki Desk   |   11 Aug 2023 4:12 AM GMT
కనిమొళి నోట ద్రౌపది మాట.. కడిగేసిన నిర్మలమ్మ
X

చేసిన తప్పునకు దశాబ్దాల తర్వాతైనా మూల్యం చెల్లించాల్సిందే. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. అప్పటివరకు నడిస్తే నడవొచ్చు. కానీ.. ఆ తర్వాత మాత్రం అందుకు తగ్గ తిప్పలు తప్పవు. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు డీఎంకే ఎంపీ కనిమొళి. తన తండ్రి హయాంలో జరిగిన దారుణానికి ఆమె ఇప్పుడు బాధ్యత వహించాల్సి వచ్చింది. తాజాగా విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వేళ.. మోడీ సర్కారును ఏకిపారేసేందుకు విపక్షాలు చేసిన ప్రయత్నాలను అధికార బీజేపీ ధీటుగా ఎదుర్కొంది. వారి నోటి నుంచి వచ్చిన ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చింది.

మణిపూర్ లో మహిళలు ఎదుర్కొన్న దారుణాలపై విరుచుకుపడిన డీఎంకే ఎంపీ కనిమొళి (స్వర్గీయ డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె) మాట్లాడుతూ.. మణిపూర్ మహిళలకు జరిగిన అవమానాన్ని ద్రౌపదికి జరిగిన అవమానంతో పోల్చారు.

కనిమొళి వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మహిళల్ని అవమానించటం.. వారిని అప్రతిష్టపాలు చేయటం లాంటి ఘటనలు మణిపూర్ లోనే కాదు.. ఢిల్లీ.. రాజస్థాన్ ఎక్కడ జరిగినా తీవ్రంగానే పరిణగించాలన్నారు.

ఈ వ్యాఖ్యల ద్వారా.. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ మహిళలపై దారుణాలు జరుగుతున్నాయన్న సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కనిమొళి తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడు అసెంబ్లీలో చోటు చేసుకున్న దారుణాన్ని ప్రస్తావించటం ద్వారా ఆమె నోటికి తాళం వేయటమే కాదు.. తమను విమర్శించే నైతికత లేదన్న విషయాన్ని సూటిగా చెప్పేవారు.

1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ.. "ఆ రోజు నిండు సభలో విపక్ష నేత జయలలిత చీరను డీఎంకే సభ్యులు లాగేశారు. ఆమెను ఎగతాళి చేవారు. రెండేళ్ల తర్వాత ఆదే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా అదే సభలోకి అడుగు పెట్టారు.

ఆ రోజు నిండు సభలో విపక్ష నేత చీర లాగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇవాళ ద్రౌపది గురించి మాట్లాడుతోంది' అంటూ నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. అందుకే అంటారు.. తప్పు నిప్పులా వెంటాడుతుందని. ఏదో రోజు అది కాలక మానదు. చేసిన తప్పునకు మూల్యం చెల్లించక తప్పదు. అదెంత నిజమో తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.