Begin typing your search above and press return to search.

ప్రత్యేక రోజు ఏదైనా.. నిర్మలమ్మ చీరలపై చర్చ జరగాల్సిందే

ప్రత్యేక సందర్భాల్లో ఆమె పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని చీరల్ని ఎంపిక చేసుకోవటం కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 9:18 AM GMT
ప్రత్యేక రోజు ఏదైనా.. నిర్మలమ్మ చీరలపై చర్చ జరగాల్సిందే
X

కేంద్ర మంత్రుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీరు కాస్త భిన్నమని చెప్పాలి. విషయం ఏదైనా సూటిగా.. కొట్టినట్లుగా చెప్పే తీరు ఆమెలో కనిపిస్తుంది. సాదాసీదాగా ఉంటూ.. పక్కింటామె తరహాలో ఉండే ఆమె తీరు పలుమార్లు చర్చకు వస్తుంటుంది. ప్రత్యేక దినాల్లో ఆమె ధరించే చీరలు తరచూ చర్చనీయాంశాలుగా మారుతుంటాయి. దీనికి కారణం లేదు. ప్రత్యేక సందర్భాల్లో ఆమె పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని చీరల్ని ఎంపిక చేసుకోవటం కనిపిస్తుంది. ఈ రోజు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆమె నీలం వర్ణం చీరను ధరించారు. బడ్జెట్ ప్రసంగం వేళ ఆమె ధరించిన చీరపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బడ్జెట్ ట్యాబ్ పట్టుకొని.. టస్సర్ పట్టు చేనేత చీర నీలమేఘ శ్యాముడి వర్ణంలో ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గోధుమ రంగులోనూ ఉన్న ఈ చీర బెంగాల్ కల్చర్ ను ప్రతిబింబించే ఎంబ్రాయిడరీతో మెరిసిపోయింది. ఈ నీలివర్ణాన్ని తమిళనాడులో రామాబ్లూగా పిలుస్తుంటారు. ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు సంకేతంగా ఆమె ఈ చీరను ధరించారు.

తాజాగా ఆమె ధరించిన చీరలో అటు బెంగాల్.. ఇటు తమిళనాడు సంప్రదాయాలను కలగలిపిన చీరతో ఆమె మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతి ఏడాది బడ్జెజ్ ప్రవేశ పెట్టే సందర్భంలో ఆమె ఒక థీమ్ తో చీరల్ని ధరించటం కనిపిస్తుంది. 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్ లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరను ధరించారు. ఇల్ కల్ చేనేత చీరను ధరించారు. 2022లో మెరూన్ కలర్ చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకరు చెందిన చేనేత చీరే. నిరాడంబరంగా కనిపించేందుకు వీలుగా ఈ చీరను ఎంపిక చేసుకున్నారన్న మాట వినిపించింది.

2021లో ఎరుపు గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించిన ఆమె.. 2020లో నీలం రంగు అంచు ఉన్న పసుపుపచ్చ - బంగారు వర్ణంలో ఉన్న చీరకట్టులో కనిపంచారు. ఆస్పిరేషనల్ ఇండియా థీమ్ కు అనుగుణంగా ఆమె ఈ చీరను ధరించారని చెప్పారు. 2019లో మంగళగిరి గులాబీ రంగు చీరలో కనిపించిన ఆమె.. బడ్జెట్ వేళ ఆర్థిక మంత్రులు తీసుకొచ్చే సూట్ కేస్ కు స్థానంలో బహీ ఖాతాలో మీడియా ముందుకు రావటం అప్పట్లో అందరి చూపు దాని మీద పడింది.

బడ్జెట్ ప్రవేశ పెట్టే వేళలోనే కాదు.. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ధరించే చీరలు చర్చగా మారుతూ ఉంటాయి. అమరవీరుల దినోత్సవం సందర్భంలో రూ.10 నోటుతో సరిపోయే మణిపురి చీరను ధరించగా.. పశ్చిమబెంగాల్ లో జరిగిన ఒక ప్రోగ్రాంలో రూ.20 నోటు రంగులో పచ్చని మంగళగిరిచీరను.. రూ.2వేల నోటుతో సూట్ అయ్యే సౌత్ సిల్క్ చీరలో.. రూ.100నోటులో లలక్ సంబల్ పురి చీరను ధరించారు. అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో రూ.500 నోటు రంగున్న చీరను ధరించారు. గతంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ ను కలిసే సందర్భంలో రూ.200 నోటు రంగుతో కూడిన చీరను ఎంపిక చేసుకున్నారు. ఇలా ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ తన ప్రత్యేకను ప్రదర్శించేలా ఆమె తన చీరల్ని ఎంపిక చేసుకుంటారని చెప్పాలి.