కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకే ఎందుకు..!
వాస్తవానికి గతంలో కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే లో ప్రవేశపెట్టేవారు. పైగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ను సమర్పించేవారు.
By: Raja Ch | 1 Feb 2026 10:40 AM ISTఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభకు సమర్పించనున్నారు. రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదోసారి ఆమె కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో.. స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ ను ఆదివారం ప్రవేశపెట్టనుండటం ఇదే తొలిసారి కాగా.. ఫిబ్రవరి 1, ఉదయం 11 గంటలకే ఎందుకు, ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చింది అనేది ఆసక్తిగా మారింది.
అవును... స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్ర బడ్జెట్ ను ఆదివారం నాడు సమర్పించనున్నారు. గతంలో ఓ సారి ప్రధానమంత్రి వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టే రోజు ఆదివారం రాగా.. దాన్ని ఒకరోజు ముందుకు జరిపి శనివారమే ప్రవేశపెట్టారు. అందుకు.. ఆదివారం సెలవు రోజు అనే భావన బలంగా ఉండటంతో పాటు.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. సాధారణంగా ఆదివారాల్లో మూసివేయబడి ఉండటం మరో కారణమని అంటారు!
వాస్తవానికి గతంలో కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డే లో ప్రవేశపెట్టేవారు. పైగా సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ను సమర్పించేవారు. ఈ క్రమంలో 1999లో ఫిబ్రవరి 28 ఆదివారం రావడంతో.. ఒక రోజు ముందుగా ఫిబ్రవరి 27న శనివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. పైగా.. అప్పటి వరకూ కేంద్ర బడ్జెట్ ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంస్కృతి ఉండగా.. యశ్వంత్ సిన్హా ఆ విధానానికి స్వస్తి పలికి.. షెడ్యూల్ ను ఉదయం 11 గంటలకు మార్చారు. అప్పటి నుంచి ఇదే సమయం కంటిన్యూ అవుతుంది.
అలా సాయంత్ర 5 గంటలకు ప్రవేశపెట్టే బడ్జెట్ కాస్తా ఉదయం 11 గంటలకు మర్చబడింది. అయితే.. ఫిబ్రవరి నెల చివరి పని దినం సంస్కృతి మాత్రం మారలేదు. అయితే... 2017 నుంచి ఈ పద్దతి మారి.. అప్పటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు నుంచి షెడ్యూల్ ఫిబ్రవరి 1కి మార్చబడింది. అందుకు బలమైన కారణం ఉంది. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ముందు బడ్జెట్ ప్రతిపాదనలు చర్చించడానికి, ఆమోదించడానికి, అమలుకు పార్లమెంటుకు తగిన సమయం ఇవ్వడమే అని అంటారు.
