Begin typing your search above and press return to search.

మా బాబు మరణానికి పేర్ని నాని వ్యాఖ్యలే కారణం.. పవన్ అభిమాని నిరంజన్ తండ్రి సంచలన ఆరోపణలు

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఈ నెల 7న మరణించిన హన్మకొండకు చెందిన నిరంజన్ తండ్రి రామగోపాల్ సంచలన ఆరోపణలు చేశారు.

By:  Tupaki Political Desk   |   13 July 2026 3:36 PM IST
మా బాబు మరణానికి పేర్ని నాని వ్యాఖ్యలే కారణం.. పవన్ అభిమాని నిరంజన్ తండ్రి సంచలన ఆరోపణలు
X

జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఈ నెల 7న మరణించిన హన్మకొండకు చెందిన నిరంజన్ తండ్రి రామగోపాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ బాబు మరణానికి వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభం శుభం తెలియని పిల్లాడ్ని కించపరిచేలా పేర్ని నాని మాట్లాడారని, ఆయన మాటలను ఫోన్ లో చూసి బాధపడిన నిరంజన్ మనస్తాపంతో మరణించాడని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలంగాణలోని హన్మకొండకు చెందిన పొనుగోటి నిరంజన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. చిన్నతనం నుంచి జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన నిరంజన్ ను గత నెల పవన్ స్వయంగా వచ్చి పరామర్శించారు. పవన్ చూడాలనేది తన చివరి కోరిక అంటూ నిరంజన్ చెప్పడంతో డిప్యూటీ సీఎం చలించిపోయారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హన్మకొండకు వచ్చి నిరంజన్ ను పరామర్శించారు. ఇది జరిగిన మూడు వారాలకు నిరంజన్ ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అయితే తమ బాబు మరణానికి వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలే కారణమని నిరంజన్ తండ్రి రామగోపాల్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ కు చెందిన ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి పేర్ని విమర్శలతో నిరంజన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని రామగోపాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘వాడు ఎవడో పిలిస్తే, వీడెవడో వెళ్లాడంటూ’’ మాజీ మంత్రి పేర్ని వ్యాఖ్యలను తమ బాబు సుమారు 200 సార్లు చూసి తీవ్రంగా మదనపడినట్లు నిరంజన్ తండ్రి రామగోపాల్ తెలిపాడు. వాడు వీడు అంటే తమ బాబుకు నచ్చదని నిరంజన్ తల్లి చెప్పగా, తనను అన్నా పర్వాలేదు కానీ, తమ దేవుడిని అన్నాడనే బాధ కూడా నిరంజన్ వ్యక్తం చేశాడని తండ్రి తెలియజేశాడు. పేర్ని నాని వ్యాఖ్యలతో రెండు రోజులు భోజనం కూడా చేయలేదని చెప్పాడు. పవన్ రాజకీయం కోసం తమ బాబును పరామర్శించేదుకు రాలేదన్నారు. పవన్ తో సహా వచ్చిన ఏ ఒక్కరి మెడలో జనసేన కండువా కనిపించిందా? అంటూ ప్రశ్నించాడు.

కాగా, నిరంజన్ మృతికి మాజీ మంత్రి పేర్ని వ్యాఖ్యలే కారణమంటూ రామగోపాల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి. ఈ వ్యవహారంగా రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మానవత్వాన్ని మరణి ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమేనా అంటూ నిరంజన్ తండ్రి వేసిన ప్రశ్న ఆలోచనలకు గురిచేస్తోంది. గత నెల నిరంజన్ ను పరామర్శించిన సమయంలో మాజీ మంత్రి పేర్ని ఘాటు విమర్శలు చేశారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై స్పందించిన పవన్, తెలంగాణలో అభిమానిని పరామర్శించడంపై పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలే తమ పిల్లాడిని మనస్తాపానికి గురిచేశాయని, చివరికి మరణానికి కారణమయ్యాయని నిరంజన్ తండ్రి రామగోపాల్ ఆరోపిస్తున్నాడు. దీనిపై మాజీ మంత్రి పేర్ని ఎలా స్పందిస్తారో చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.