Begin typing your search above and press return to search.

ఉచిత రేషన్, ఉచిత విద్యుత్... బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌!

పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం.. సుమారు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ధి పొందారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం.

By:  Tupaki Desk   |   1 Feb 2024 8:31 AM GMT
ఉచిత రేషన్, ఉచిత విద్యుత్...  బడ్జెట్‌  ప్రసంగంలో సీతారామన్‌!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ తాత్కాలిక బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలా సీతారామన్ ఈ ఓట్‌ ఆన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ రూ.47.66 లక్షల కోట్లుగా వెల్లడించారు! సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ఆర్థిక విధానాలు ఉండబోతున్నాయని తెలిపారు.

ఈ బడ్జెట్ ప్రభుత్వానికి కీలక కావడంతో మధ్య తరగతి ప్రజల మనస్సును గెలుచుకోవడానికి కొత్త ట్యాక్స్ విధానంలో భాగంగా... రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే మరిన్ని అంశాలపై కూడా ఆమె కీలక ప్రకటనలు చేశారు. అవి ఏమిటేమిటి అనేది ఆమె మాటల్లోనే...!!

* పేదలకు ఉచిత రేషన్‌ ఇస్తున్నాం.. సుమారు 80 కోట్ల మంది దీని వల్ల లబ్ధి పొందారు. రైతులకు కనీస మద్దతు ధరను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.

* పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన ద్వారా ప్రతీ సంవత్సరం సుమారు 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం. పీఎం ఫసల్‌ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంట బీమా అందుతోంది.

* ఆశావహ జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. భారత వృద్ధి పథంలో తూర్పు భాగంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించేలా కృషి చేస్తాం

* పీఎం స్వానిధి ద్వారా సుమారు 78 లక్షల వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాం. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జన్‌ ధన్‌ ఖాతాలకు రూ.34 లక్షల కోట్లు బదిలీ చేశాం. మరో 2.3 లక్షల మంది వీధి వ్యాపారులకు కొత్త రుణాలు ఇవ్వనున్నాం.

* 2047 నాటికి భారత్‌ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం.

* సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన "పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌" కరోనా సమయలోనూ కొనసాగింది. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నాం. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లలోనూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

* విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌ టాప్‌ సోలారైజేషన్‌ స్కీం ను తీసుకురానున్నాం. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల - రూ.18 వేల వరకు ఆదా అవుతుంది.

* రైలు బోగీలన్నింటినీ వందే భారత్‌ ప్రమాణాలతో మార్పు చేయబోతున్నాం.

* నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం కొత్త పథకం తీసుకురాబోతున్నాం. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సాయంతో పాటు.. రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్‌ గోకుల మిషన్‌ ద్వారా ఆర్థికసాయం అందించనున్నాం.

* అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్‌ భారత్‌ కవరేజ్‌ తో పాటు 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ కేన్సర్‌ పడకుండా చర్యలు తీసుకుంటున్నాం.

* మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలను ఇచ్చాం. స్టార్టప్‌ ఇండియా, స్టార్టప్‌ క్రెడిట్‌ గ్యారంటీ వల్ల యువత ఉద్యోగాలు కల్పిస్తోంది.

* టూరిస్ట్ హబ్‌ గా లక్షద్వీప్. టూరిజం కోసం వడ్డీలేని రుణాలు అందించనున్నాం.

వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు!:

* గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ. 86 వేల కోట్లు

* గ్రామీణాభివృద్ది: రూ. 1.77లక్షల కోట్లు

* వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ. 1.27 లక్షల కోట్లు

* ఆయుష్మాన్‌ భారత్‌: రూ. 7,500 కోట్లు

* పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ. 6,200 కోట్లు

* రక్షణ: రూ 6.2 లక్షల కోట్లు

* రైల్వే: రూ. 2.55 లక్షల కోట్లు

* హోం శాఖకు: రూ. 2.03 లక్షల కోట్లు

* ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు

* ఆహారం, ప్రజా పంపిణీ: రూ. 2.13 లక్షల కోట్లు

* సెమీ కండక్టర్స్‌, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ: రూ. 6,903 కోట్లు

* సోలార్‌ విద్యుత్‌ గ్రిడ్‌: రూ. 8,500 కోట్లు

* గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌: రూ. 600 కోట్లు

* రసాయనాలు, ఎరువులు: రూ. 1.68 లక్షల కోట్లు

* కమ్యూనికేషన్లు: రూ. 1.37 లక్షల కోట్లు