Begin typing your search above and press return to search.

నిఫా వైరస్‌ ఇలా వస్తుంది.. లక్షణాలు ఇవి!

ప్రస్తుతం కేరళలో 706 మంది కాంటాక్ట్‌ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారని సమాచారం.

By:  Tupaki Desk   |   14 Sep 2023 1:46 PM GMT
నిఫా వైరస్‌ ఇలా వస్తుంది.. లక్షణాలు ఇవి!
X

కేరళలో నిఫా వైరస్‌ కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన నిఫా వైరస్‌ ను బంగ్లాదేశ్‌ వేరియంట్‌గా గుర్తించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. వైరస్‌ కారణంగా ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు దాని బారిన పడటంతో నిఫా వైరస్‌ కట్టడి చర్యలకు అధికారులు నడుం బిగించారు.

ప్రస్తుతం కేరళలో 706 మంది కాంటాక్ట్‌ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారని సమాచారం. వీరిలో 153 మంది హెల్త్‌ వర్కర్లే. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో హై రిస్క్‌ జోన్‌లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిఫా వైరస్‌ నియంత్రణకు కేరళలోని కోజికోడ్‌ జిల్లాలోని అటాన్‌ చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, విద్యాసంస్థలను మూసివేశారు.

పొరుగు జిల్లాలైన కన్నూర్, వయనాడ్, మలప్పురం జిల్లాలను కూడా కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. మరణాల రేటు అధికంగా ఉండే ఈ వైరస్‌ నిర్ధారణను వేగవంతంగా చేపట్టేందుకు గాను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నిపుణులు కేరళకు బయలుదేరారు. మరోవైపు నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్‌ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్‌ లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

కోజికోడ్‌ లోని మెడికల్‌ కాలేజీలో మొబైల్‌ క్యాంపును ఏర్పాటు చేసి పరీక్షలు చేయనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 75 ఐసోలేషన్‌ గదులను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ చెప్పారు. చెన్నైలోని ఐసీఎంఆర్‌ ఎపిడమిక్‌ బృందాలు కూడా కోజికోడ్‌ చేరుకొని సర్వే నిర్వహించనున్నాయి. బాధితులకు సన్నిహితంగా మెలిగిన 130 మందిని గుర్తించి పరీక్షించినట్లు తెలుస్తోంది.

కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్‌ జిల్లా కలెక్టర్‌ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్‌మెంట్‌ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మరోవైపు కేరళలో కేసులు బయటపడుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులో చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులు పోలీసులను కోరారు. రాష్ట్రంలోకి ప్రవేశించే గూడ్సు వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని సూచించారు. ముఖ్యంగా కేరళ నుంచి వచ్చే పండ్ల వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు.

కాగా నిఫా వైరస్‌ ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ కలిగించి, మెదడువాపునకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. మెదడువాపు కారణంగా తలనొప్పి వస్తుందని చెబుతున్నారు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

కాగా నిఫా ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్‌ అని చెబుతున్నారు. తాటి జాతికి చెందిన డేట్‌ పామ్‌ (ఖర్జూర తరహా) చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్‌ బ్యాట్స్‌)తో ఈ వైరస్‌ వ్యాపిస్తోందని అంటున్నారు. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రుచిగా ఉంటాయని చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని గబ్బిలాలు కొరికి వదిలేసి ఉండొచ్చని పేర్కొంటున్నారు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్‌ ఎక్కువగా కనిపించిందని.. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.