Begin typing your search above and press return to search.

విభ‌జ‌న చ‌ట్టానికి ముగింపుకాలం... హామీలేమిటో గుర్తుందా?

ఇదే సమయంలో ఈ విభజన చ‌ట్టం ప్రకారం.. ప‌దేళ్ల వ‌ర‌కు హైద‌రాబాద్ ఉమ్మడి రాజ‌ధాని గా ఉందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   18 July 2023 12:19 PM GMT
విభ‌జ‌న చ‌ట్టానికి ముగింపుకాలం... హామీలేమిటో గుర్తుందా?
X

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదం పొంది తొమ్మిదేళ్లు దాటింది. ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలు 12, 13వ ప్రణాళికా కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రణాళికలు రద్దుఅయినప్పటికీ... నీతి అయోగ్ అమలులోకి వచ్చింది. ఈ లెక్కన చూసుకున్నా 10 ఏళ్లలో అంటే 2024 నాటికి వాటిని పూర్తి చేయాల్సి ఉంది. ఆ సమయం రానే వస్తోంది!

అవును... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం గడువు వచ్చే ఏడాది మే నాటికి పూర్తవ్వబోతోంది! నిర్ణయించిన గడువుకి ఇంకా ఏడాది లోపు మాత్రమే సమయం ఉంది. దీంతో వాట్ నెక్స్ట్ అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కీలక నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి.. కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తేవాలి.. మరో ఆప్షన్ ఏమైనా ఉందా అనే విషయాలపై స్పందిస్తున్నారట పరిశీలకులు.

ఈ నేపథ్యంలో కాసేపు మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రాన్ని కాసేపు ప‌క్కన పెడితే.. ఏపీ అంశం ఇప్పుడు చ‌ర్చకు వ‌స్తోందని తెలుస్తుంది. ఈ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మెజారిటీ అంశాల‌ను ఇప్పటికీ మోడీ స‌ర్కారు నెర‌వేర్చలేద‌నే విమర్శలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హోదా - ప్యాకేజీ మాటున ఎన్నో కీలక హామీలు తెరవెనుకకు వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఈ విభజన చ‌ట్టం ప్రకారం.. ప‌దేళ్ల వ‌ర‌కు హైద‌రాబాద్ ఉమ్మడి రాజ‌ధాని గా ఉందనేది తెలిసిన విషయమే. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాలన అమరావతికి షిప్ట్ చేశారు. అందుకు కారణం ఓటుకు నోటు కేసనే ఒక వాదన వినిపించిన సంగతి తెలిసిందే. అనంతరం ఎవరి రాష్ట్రలో వారు రాజధాని కార్యక్రమాలు చేసుకుంటున్నారు.

మరి గత ఐదేళ్లూ పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు - మోడీ కలిసి విభజన హామీలపై ఏపీకి అన్యాయం చేశారని కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఇప్పుడు సమయం దగ్గరపడుతున్న వేళ జగన్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో సర్కార్... కేంద్రాన్ని తొందరపెడుతుందా.. లేక, చట్టకాల పరిమితిని పెంచే దిశగా అడుగులు వేస్తుందా అనేది వేచి చూడాలి.

కాగా ఈ చట్టంలో 13 షెడ్యూళ్లు ఉన్నాయి. వీటిలో 1వ షెడ్యూల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు రాజ్యసభలో ఉన్న 18 స్థానాల్లో ఏడు స్థానాలను తెలంగాణకు కేటాయించే విధానాన్ని వివరిస్తుంది. 2వ షెడ్యూల్ ప్రకారం 42 లోక్‌ సభ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణకు 17 స్థానాలు కేటాయించారు. ఇదే సమయంలో 294 అసెంబ్లీ స్థానాల్లో ఏపీకి 175, తెలంగాణకు 119 స్థానాలు కేటాయించారు.

రెండు రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ, శాసనమండలి, పార్లమెంటరీ నియోజక వర్గాల గురించి 3వ షెడ్యూల్‌ లో వివరించారు. ఇక ఇరు రాష్ట్రాల్లోని శాసనమండలి స్థానాలు 90 ఉండగా.. వీటిని ఏపీకి 50, తెలంగాణకు 40గా కేటాయించిన ప్రక్రియ 4వ షెడ్యూల్ లోకి వస్తుంది.

ఇదే సమయంలో ఇందులోని 5వ షెడ్యూల్ తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల గురించి వివరిస్తుండగా.. 6వ షెడ్యూల్ తెలంగాణలోని షెడ్యూల్డ్ తెగల గురించి వివరిస్తుంది. అదేవిధంగా... ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, బీ మా ఫండ్, సింకింగ్ ఫండ్, రిజర్వ్ ఫండ్ లాంటి నిధుల గురించి 7వ షెడ్యూల్ వివరిస్తుంది.

ఇక పింఛన్ చెల్లింపులు, జీతభత్యాల గురించి 8వ షెడ్యూల్ తెలియజేస్తుంది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్‌ ల జాబితాలను గురించి 9వ షెడ్యూల్ లో వివరించారు. 10వ షెడ్యూల్ లో కొన్ని రాష్ట్ర సంస్థల జాబితా, ఆయా సంస్థల్లో కొనసాగింపు లాంటి అంశాలను ప్రస్తావించారు.

అదేవిధంగా... నదీ జలాల నిర్వహణ బోర్డుల పని విధానాన్ని నిర్దారించే సూత్రాలను 11వ షెడ్యూల్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీ-నీవా, తెలుగు గంగ, గాలేరు-నగరి, వెలిగొండ, ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలని సూచించారు.

ఇక 12వ షెడ్యూల్... బొగ్గు, చమురు, సహజ వాయువు, విద్యుత్ లాంటి రంగాల గురించిన వివరణలు పేర్కొన్నారు. 13వ షెడ్యూల్ లో విద్యారంగం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలను గురించిన వివరణలు పొందుపరిచారు.

జాతీయ ప్రాధాన్యం ఉన్న ఐఐటీ, ఎన్.ఐ.టి., ఐ.ఐ.ఎం., పెట్రోలియం, వ్యవసాయ గిరిజన విశ్వవిద్యాలయాల స్థాపనకు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ కు సహకరిస్తుంది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం, ఉద్యానవన విశ్వవిద్యాలయాలను కేంద్రమే ఏర్పాటు చేస్తుంది.

వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు.. దుగ్గరాజపట్నంలో భారీ ఓడరేవు ఏర్పాటు.. ఖమ్మం, కడప జిల్లాల్లో సమగ్ర ఉక్కు కర్మాగారాలు నెలకొల్పడం.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలను ఆధునికీకరించడం.. విశాఖ, విజయవాడ, గుంటూరు మెట్రో రైలు సౌకర్యాల కల్పన.. పనులన్నింటినీ కేంద్రమే చేపడుతుందని ఈ షెడ్యూల్‌ లో వివరించారు.

వీటిలో ఎన్ని హామీలు అమలుచేశారు.. ఏమేరకు ఏపీకి సహకరించారనేది బీజేపీ పెద్దలకే తెలియాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు!