Begin typing your search above and press return to search.

మంత్రిగారికి బాధ్య‌త‌, బ‌రువు ఎక్కువ‌య్యాయా?!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా, క‌ర్నూలు జిల్లాకు ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రి మౌనంగా ఉంటున్నారు.

By:  Garuda Media   |   28 Aug 2026 9:00 PM IST
మంత్రిగారికి బాధ్య‌త‌, బ‌రువు ఎక్కువ‌య్యాయా?!
X

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా, క‌ర్నూలు జిల్లాకు ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మంత్రి మౌనంగా ఉంటున్నారు. అయితే.. ఆయ‌న వివాదర‌హితుడు కావ‌డం మౌనంగా ఉండే పంథాను ఎంచుకోవ‌డం ఇక్క‌డి నేత‌ల‌కు క‌లిసి వ‌స్తోంది. దీనిని ప‌సిగ‌ట్టిన ఇటు కూట‌మి ఎమ్మెల్యేలు, అటు వైసీపీ నేత‌లు కూడా ప‌క్కాగా చేతులు క‌లిపేస్తున్నార‌న్న వాద‌న ఉంది. నిజానికి ఇంచార్జ్ మంత్రి కూడా ఈ జిల్లాపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేదు. త‌న‌కు ఎక్కువ భారం పెరిగిపోయింద‌ని ఆయ‌న చెప్పేస్తున్నారు. నిజానికి ఇది కూడా వాస్త‌వం కావ‌డం గ‌మ‌నార్హం.

జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మ‌ల రామానాయుడుకు తూర్పుగోదావ‌రి జిల్లాతోపాటు క‌ర్నూలు జిల్లా ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. అయితే.. ప్ర‌స్తుతం ఓటు బ్యాంకుకు కీల‌క‌మైన రైతుల కు నీళ్లు ఇచ్చే అంశాలు, ప్రాజెక్టులు పూర్తి చేయ‌డం వంటి అంశాల‌కు నిమ్మ‌ల అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. త‌న ఇమేజ్‌ను మ‌రింత పెంచుకునేందుకు జ‌ల‌వ‌నరుల శాఖ‌పై ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టుల‌పైనే ఎక్కువ‌గా స‌మ‌యం కేటాయిస్తున్నారు.

ఫ‌లితంగా రెండు జిల్లాల బాద్య‌త‌ల‌ను చూస్తున్న ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న టాక్ వినిపి స్తోంది. దీంతో వైసీపీ నాయ‌కులు కొంద‌రు మిలాఖ‌త్ రాజకీయాలు జోరుగా చేస్తున్నార‌ని పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే.. ఇవ‌న్నీ ప్ర‌చారాలేన‌ని నిమ్మ‌ల చెబుతున్నారు. తాము ప‌ట్టు బిగించామ‌ని అంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో వ్యాపారాల‌ను పంచుకుంటున్న‌ట్టు తాజాగా కూడా ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌తో జిల్లాలో ఏం జ‌రుగుతోంద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

క‌ర్నూలు జిల్లాలో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా ఎమ్మెల్యేలు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఇది త‌గ‌ద‌ని.. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా ఉండాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఇక‌, తూర్పులో జ‌రుగుతున్న మిలాఖ‌త్ పాలిటిక్స్ పైనా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి స్థానిక ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపించ‌కుండా ఉంటాయా? అనేది ప్ర‌శ్న‌. అయితే.. స్థానిక ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రి స‌త్తా వారు చూపిస్తార‌ని.. అంటున్నారు. మొత్తంగా తూర్పు, క‌ర్నూలు జిల్లాల్లో మాత్రం రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి.