Begin typing your search above and press return to search.

సైకిల్‌పై పది కిలోమీటర్ల ప్రయాణం.. మండుటెండలో మంత్రి నిమ్మల సాహసం!

ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల శుక్రవారం తన కారును పక్కన పెట్టేశారు.

By:  Tupaki Political Desk   |   15 May 2026 6:26 PM IST
సైకిల్‌పై పది కిలోమీటర్ల ప్రయాణం.. మండుటెండలో మంత్రి నిమ్మల సాహసం!
X

ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తీరు విలక్షణంగా ఉంటుంది. ఆయన ఏం చేసినా తనదైన మార్కు కచ్చితంగా వేస్తారు. అధికార దర్పానికి కాస్త దూరంగా ఉండే మంత్రి నిమ్మల.. సోషల్ మీడియాను ఆకర్షించే పనులకు మాత్రం చాలా దగ్గరగా ఉంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తుంటారు. ఏపీ కేబినెట్ మంత్రుల్లో అందరికంటే భిన్నంగా నడుచుకుంటూ సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్న మంత్రి నిమ్మల తాజాగా మరో సాహసం చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టీడీపీ శ్రేణులు కూడా మా మంత్రి కష్టం చూడండి అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు.

చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పొదుపు చర్యలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి బడా నేతలు తమ కాన్వాయ్ ల్లో కార్ల సంఖ్యను సగానికి తగ్గించుకుంటున్నారు. ప్రధాని కేవలం రెండు కార్లలోనే తిరుగుతుండగా, సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ వాహనాలను కూడా పరిమితం చేశారు. ఇక క్యాబినెట్ మంత్రులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా పరిగణించాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతో మంత్రి నిమ్మల శుక్రవారం తన కారును పక్కన పెట్టేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ కి సమీపంలో ఉన్న తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి దాదాపు పది కిలోమీటర్ల దూరం సైకిల్ పై వెళ్లారు. మండుటెండలో మంత్రి నిమ్మల ఒక్కరే చకచక సైకిల్ తొక్కుకుంటూ వెళ్లడం స్థానికులను అబ్బురపరిచింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలే విజయవాడలో ఎండలు మండిపోతుంటాయి. అలాంటి వాతావరణంలో ట్రాఫిక్ ను దాడుకుంటూ మంత్రి సైకిల్ పై ముందుకు సాగిపోవడం వైరల్ అవుతోంది.

ఇక మంత్రి నిమ్మల మాదిరిగా చంద్రబాబు క్యాబినెట్ లో కీలక బాధ్యతలు చూస్తున్న ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా నో వెహికల్ డే పాటించారు. కాకపోతే ఆయన తన సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలో తన నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి సైకిల్ వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలను పాటిస్తానని ప్రకటించారు. ఇలా ఏపీకి చెందిన ఇద్దరు మంత్రుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మెరుస్తుండటంపై ఆసక్తికర కామెంట్లు వస్తున్నాయి. చమురు సంక్షోభం నేపథ్యంలో దేశంలోని పలువురు ప్రజాప్రతినిధులు హంగు ఆర్భాటాలకు దూరంగా ఉంటామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం పొలిటీషియన్స్ అంతా ప్రచారం కోసం ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారా? లేక నిజంగా నా దేశం నా బాధ్యత అన్న సిద్ధాంతానికి కట్టుబడే ఇలా చేస్తున్నారా? అన్నది విస్తృత చర్చగా ఉంది.