సూది పొడవకుండా రక్త పరీక్ష.. ముఖం స్కాన్ తోనే.. నిలోఫర్ లో అద్భుతం
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ).. వైద్య రంగంలోనూ అద్భుతాలు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. అయితే, దానిని ఏవిధంగా ఉపయోగిస్తారు? అనేదే ఇప్పటివరకు అందరిలోనూ ప్రశ్నగా ఉంది.
By: Tupaki Desk | 20 May 2025 5:14 PM ISTఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ).. వైద్య రంగంలోనూ అద్భుతాలు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. అయితే, దానిని ఏవిధంగా ఉపయోగిస్తారు? అనేదే ఇప్పటివరకు అందరిలోనూ ప్రశ్నగా ఉంది. తాజాగా మన హైదరాబాద్ లోని ప్రముఖ నిలోఫర్ ఆస్పత్రిలో చేపట్టిన ప్రయోగం అద్భుతాల దిశగా ఓ మెట్టు అని చెప్పొచ్చు.
ఇప్పటివరకు రక్త పరీక్ష అంటే సూదితో పొడిచి కొంత రక్తం తీసుకుని పరీక్షించేవారు. సూది అంటే భయం ఉన్న కొందరికి ఇది కూడా ఇబ్బందికరమే అనుకోవాలి. ఇలాంటివారి కోసమే కాక.. అందరికీ పనికొచ్చేలా సూది పొడవకుండా కేవలం ముఖం స్కాన్ చేసి రక్త పరీక్ష చేసే విధానం నిలోఫర్ లో తీసుకొచ్చారు.
అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. నిలోఫర్ ప్రముఖంగా పిల్లల ఆస్పత్రి. దీంతో ఈ విధానం పిల్లలకు బాగా ఉపయోగపడనుంది. అంతేకాదు, ఈ ప్రయోగం విజయవంతం అయితే.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే చాన్స్ ఉందని చెబుతున్నారు.
సూదితో పొడవకుండా రక్త పరీక్ష విధానాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు. ఈ పద్ధతిలో పరీక్ష ఫలితాలు కూడా వెంటనే వస్తుందని చెబుతున్నారు. ఏఐ బేస్డ్ డయాగ్నొస్టిక్ (ఫొటో ప్లెథిస్మోగ్రఫీ-పీపీజీ) సాధనంగా దీనిని రూపొందించారు. అమృత్ స్వస్థ్ భారత్ లో భాగంగా క్విట్ వైటల్స్ సంస్థ.. పీపీజీ పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం వినియోగం కూడా చాలా సులభం అని చెబుతున్నారు.
ట్రై పోడ్ పై పీపీజీ పరికరంతో లింక్ చేసిన ఫోన్ స్క్రీన్ వైపు కేవలం 30-40 సెకన్లు చూస్తే.. స్కాన్ చేసేస్తుంది. ఆపై నిమిషంలోగానే ఆరోగ్య వివరాలు బయటపెడుతుంది.
బీపీ, రక్తంలో ఆక్సిజన్ స్థాయి (ఎస్‌పీవో2), గుండె చప్పుడు, శ్వాస క్రియ రేటు, హెచ్ఆర్‌వీ (హార్ట్ రేట్ వేరియబిలిటీ), ఒత్తిడి స్థాయి, హిమో గ్లోబిన్ శాతం, పల్స్ రెస్పిరేటరీ కోషింయట్, సింపథిటిక్, పారా సింపథిటిక్ నాడీ వ్యవస్థల పనితీరు వంటి పలు కీలక ఆరోగ్య విషయాలను పీపీజీ విశ్లేషిస్తుంది.
