తిరుమల శ్రీవారికి నాలుగు కోట్ల యజ్ఞోపవేతం.. ఈ భక్తుడి గురించి తెలిస్తే షాకే..
బాబూరావు ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి వ్యాపారం కాదు.. భక్తిని చాటుకొని.
By: Tupaki Desk | 18 Nov 2025 3:56 PM ISTహైదరాబాద్ లో చారిత్రక ప్రదేశాలకు ఎంత కీర్తి ఉందో.. ఒక వ్యక్తికి కూడా అంతే ఉంది. ఆయన ఏర్పాటు చేసిన కెఫెలో టీ రూ. 1000 వరకు ఉంటుందంటే ఆశ్చర్యం కలుగకమానదు. అంతటి గొప్ప వ్యక్తికి దైవభక్తి ఎక్కువే. ఆయన ఎవరో కాదు.. ‘నీలోఫర్ కేఫ్ నిర్మాత బాబూరావు.’ హైదరాబాద్ నగరానికి గుర్తుగా చెప్పుకునే చార్మినార్, బుద్ధ విగ్రహం, హైటెక్ సిటీ, రామోజీ ఫిలిం సిటీ వంటి వాటిలో నీలోఫర్ కేఫ్ కూడా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు. బాబూరావు ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి వ్యాపారం కాదు.. భక్తిని చాటుకొని.
సామాన్యుడిగా..
బాబురావు జీవిత కథ సినిమా కథకన్నా తక్కువేమీ కాదు.. సాధారణ కుటుంబంలో పుట్టి బట్టల షాపులో పని చేసిన బాబురావు అక్కడి నుంచి హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టి, క్రమంగా ఎదిగి, చివరకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మార్చేసే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఐటీ కారిడార్‌లో అతిపెద్ద రద్దీ ప్రాంతంలో ఉన్న నిలోఫర్ కేఫ్ ఆయన ఏర్పాటు చేసిందే.. ఇక్కడ ఒక కప్పు టీ కాస్ట్ ₹400 నుంచి ₹1000 వరకు అమ్ముడవుతుందంటే ఆశ్చర్యం. భారీ అద్దె భవనంలో, భారీ లైన్లతో, సోషల్ మీడియా హడావిడితో ఈ కేఫ్ హైదరాబాద్ సంస్కృతిలో విడదీయలేదని భాగమైపోయింది.
కలలో శ్రీవారి ఆజ్ఞ
ఇది వరకు నిలోఫర్ కేఫ్‌తో దేశ వ్యాప్తంగా చర్చకు గురైన బాబురావు.. ఇప్పుడు మరో కారణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. కుటుంబంతో కలిసి తిరుమల దర్శనం చేసిన అనంతరం.. ఆయనకు ఒక కల వచ్చిందట. ఆ కలలో వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, తనకోసం ఒక యజ్ఞోపవీతం చేయించాలని బాబురావు ఆజ్ఙాపించారట. దీంతో ఆయన మెత్తని బంగారంతో, అతి విలువైన వజ్రాలతో యజ్ఞోపవీతం చేయించారు. దీనికి ఖర్చు నాలుగున్నర కోట్లు అయ్యిందట. దీనిని తయారు చేయడానికి ప్రత్యేక నిపుణులు నెలకుపైగా శ్రమించారట. ఇప్పుడు ఆ యజ్ఞోపవీతం తిరుమల శ్రీవారికి సమర్పించారు. భక్తి ఉంటే జీవితంలో అద్భుతం జరుగుతుందని చెప్పేలా బాబురావు నిర్ణయం నిలిచింది.
సేవకుడు కూడా
బాబురావు గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం ప్రత్యేకంగా చెప్పక తప్పదు. ఆయన వ్యాపారంతో పాటు సేవలో కూడా ముందుంటారు. నిలోఫర్ కేఫ్‌లో ఆహారం చాలా భాగం పేద పిల్లలకు ఉచితంగా అందిస్తాడు. ఉద్యోగుల పిల్లల చదువులకు బాబురావే సహాయం చేస్తారు. ఆయన సాయంతో అనేక మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు పొందారు. భవిష్యత్తులో ఒక స్కూలు నిర్మించాలనే సంకల్పం కూడా ఉందని బాబూరావు చెప్తుంటారు. వ్యాపారం, భక్తి, సేవ ఈ మూడు మార్గాల్లోనూ సాగుతున్న బాబురావు, ‘సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, తిరిగి పంచడం’ అని నిరూపిస్తున్నారు.
ఓ సామాన్యుడి నుంచి..
నేటి రోజుల్లో పెద్ద పెద్ద వ్యాపారులు కూడా ఇంత భారీ విరాళాలు ఇవ్వడం అరుదు. కానీ సాధారణ స్థాయి నుంచి ఎదిగిన బాబురావు తన విజయాన్ని భక్తితో కలిపి తిరుమల శ్రీవారికి ఈ విలువైన కానుక అందించడం ఒక ప్రత్యేక సందేశం ఇస్తోంది. ‘సంపన్నత అంటే బంగారం కాదు, బంగారం ఇచ్చే మనసు’ అన్న భావనను బలపరుస్తోంది. బాబురావు కథ నేటి తరానికి మరో పాఠం కూడా చెబుతోంది. విజయాన్ని అందుకోవడం ఒక గమ్యం అయితే, దాన్ని పంచుకోవడం ఒక ధర్మం.
తన వ్యాపారం ద్వారా నగరాన్ని ఆకర్షించిన ఈ వ్యక్తి.. తన భక్తి ద్వారా ఇప్పుడు రాష్ట్రం మొత్తం దృష్టిని ఆకర్షించారు. ‘నీలోఫర్ బాబురావు’ ఇప్పుడు బ్రాండ్ మాత్రమే కాదు ఒక విశ్వాసం.
