Begin typing your search above and press return to search.

ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు : నిజం నిలకడ మీద బయటపడింది.. భారత్ మాటే నెగ్గింది..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికపై భారత్, కెనడాల మధ్య తీవ్ర దౌత్య యుద్ధానికి కారణమైంది.

By:  A.N.Kumar   |   8 July 2026 10:51 PM IST
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు : నిజం నిలకడ మీద బయటపడింది.. భారత్ మాటే నెగ్గింది..
X
ఖలిస్థానీ ఉగ్రవాది హర్డీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికపై భారత్, కెనడాల మధ్య తీవ్ర దౌత్య యుద్ధానికి కారణమైంది. అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎటువంటి పక్కా ఆధారాలు లేకుండా పార్లమెంటు సాక్షిగా భారత్‌పై చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య దశాబ్దాల సత్సంబంధాలను ఒక్కసారిగా అగాధంలోకి నెట్టేశాయి. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తాజాగా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ చేసిన ప్రకటన.. అమెరికా న్యాయశాఖ దాఖలు చేసిన చార్జ్‌షీట్.. ఈ వివాదంలో భారత్‌ది తప్పులేదని తేల్చిచెబుతూ ఒక కీలక మలుపు తిప్పాయి.

రాజకీయ ఆరోపణలు.. వాస్తవాల నిరూపణలు

2023లో బ్రిటిష్ కొలంబియాలో నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి, అంతర్గత రాజకీయ ప్రయోజనాల కోసం కెనడా ప్రభుత్వం భారత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చింది. దౌత్యవేత్తలను బహిష్కరించడం, వీసా సేవలను నిలిపివేయడం వంటి చర్యలతో ఉద్రిక్తతలు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. కానీ నేడు కెనడా పోలీసు అధికార యంత్రాంగమే స్వయంగా రంగంలోకి దిగి "నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు" అని స్పష్టం చేయడం గమనార్హం.

నిజ్జర్ ఎవరు?

హర్డీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరుడు కాగా ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సంస్థకు నాయకుడిగా వ్యవహరించాడు. 2020లో భారత ప్రభుత్వం అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్‌లో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజ్జర్ 2023 జూన్‌లో కెనడాలోని సర్రేలో ఉన్న గురుద్వారా పార్కింగ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించాడు.

ఈ ప్రకటన ద్వారా తేలిందేమిటంటే

జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవే తప్ప, వాటి వెనుక ఎలాంటి నిఘా లేదా న్యాయపరమైన ఆధారాలు లేవు. దర్యాప్తుకు భారత్ పూర్తి స్థాయిలో సహకరిస్తోందని కెనడా పోలీస్ డిప్యూటీ కమిషనర్ లిసా మోర్లాండ్ పేర్కొనడం.. బాధ్యతాయుతమైన దేశంగా భారత్ వైఖరిని చాటిచెప్పింది.

అంతర్జాతీయ దర్యాప్తులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లింక్

మరోవైపు అమెరికా న్యాయశాఖ "ఆపరేషన్ హార్డ్ బాల్" పేరుతో దాఖలు చేసిన తాజా చార్జ్‌షీట్ ఈ కేసులో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. నిజ్జర్ హత్యకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్ ముఠానే కారణమని అమెరికా స్పష్టం చేసింది. విశేషమేమిటంటే ఈ అంతర్జాతీయ చార్జ్‌షీట్‌లో ఎక్కడా భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయాన్ని ప్రస్తావించలేదు. ఇది అంతర్గత గ్యాంగ్ వార్ లేదా నేరపూరిత ముఠాల మధ్య ఉన్న శత్రుత్వం వల్ల జరిగిన హత్యే తప్ప దీనికి దేశాల సార్వభౌమత్వానికి ముడిపెట్టడం హాస్యాస్పదమని తేలిపోయింది.

మారిన నాయకత్వం.. మారుతున్న సమీకరణాలు

గతాన్ని వదిలి, ఉమ్మడి ప్రయోజనాల వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. కెనడాలో రాజకీయ సమీకరణాలు మారి మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌తో సత్సంబంధాల పునరుద్ధరణకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన వ్యూహాత్మక తప్పిదాలను సరిదిద్దుకుంటూ వాణిజ్య, సాంకేతిక, విద్యారంగాల్లో భారత్‌తో కలిసి నడవాల్సిన అవసరాన్ని ప్రస్తుత కెనడా నాయకత్వం గుర్తించింది.

ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ వారిని 'పౌరులు'గా చిత్రీకరించే ప్రయత్నంలో కెనడా గతంలో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇప్పటికైనా కెనడా పోలీసులు నిజాలను నిర్ధారించడం, అమెరికా దర్యాప్తు సంస్థలు క్లీన్ చిట్ ఇవ్వడం భారత్ దౌత్యపరమైన విజయంగా భావించవచ్చు. ఈ పరిణామాలు భారత్-కెనడా బంధంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకడమే కాకుండా అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాటంలో ఇరు దేశాలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి దోహదపడతాయని ఆశిద్దాం.