Begin typing your search above and press return to search.

కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఆ రాష్ట్రంలోనే ఎందుకు?

దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా.. మరే రాష్ట్రంలో లేని రీతిలో నిఫా వైరస్ కేసులు వెలుగు చూస్తున్న వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 4:41 AM GMT
కేరళను వణికిస్తున్న నిఫా వైరస్.. ఆ రాష్ట్రంలోనే ఎందుకు?
X

దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నా.. మరే రాష్ట్రంలో లేని రీతిలో నిఫా వైరస్ కేసులు వెలుగు చూస్తున్న వైనం షాకింగ్ గా మారింది. దేవుని సొంత దేశంగా అభివర్ణించే కేరళలో.. ఆ మాటకు తగ్గట్లే.. చుట్టూ పచ్చదనం.. దక్షిణాది రాష్ట్రాల్లో వైవిధ్యమైన జీవన విధానానికి కేరళ కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ఇప్పటి డిజిటల్ యుగంలోనూ కేరళలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం ఏడు గంటల తర్వాత షాపులు మూసి వేయటం ఆ రాష్ట్రంలోనే కనిపిస్తుంటుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇటీవల ఒక రోగికి నిఫా వైరస్ సోకినట్లుగా గుర్తించారు. ఈ వైరస్ వ్యాప్తి మొదలైందని భావిస్తున్న వేళ.. దాన్ని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే.. మరే రాష్ట్రంలో లేని విధంగా కేరళలోనే నిఫా వైరస్ కేసులు తరచూ ఎలా వెలుగు చూస్తున్నాయి? దీనికి కారణం ఏమిటి? అన్న మాత్రం సమాధానం లేని ప్రశ్నగా మారింది.

ఈ మిస్టరీపై ఐసీఎంఆర్ (భారత వైద్య పరిశోధన మండలి) సైతం ఏం చెప్పలేమంటోంది. కేరళలోనే ఈ వైరస్ ఎందుకు వెలుగు చూస్తుందన్న కారణాల్ని చెప్పలేకపోతున్నట్లుగా పేర్కొన్నారు. కొవిడ్ తో పోలిస్తే.. నిఫా వైరస్ మహా డేంజర్. దీనికి కారణం.. ఈ వైరస్ సోకిన వారిలో ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉండటమే. ప్రపంచాన్ని వణికించిన కొవిడ్ విషయానికి వస్తే.. ఈ వైరస్ సోకిన వారిలో ప్రాణాలు పోయే ప్రమాదం 2-3 శాతం వరకు ఉంటే.. నిఫా వైరస్ విషయంలో మాత్రం 40-70 శాతం మధ్యలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

నిఫా వైరస్ ను కట్టడి చేసే యాంటీబాడీ డోసులు కేవలం పది మందికి మాత్రమే సరిపడా ఉన్న విషయాన్ని చెబుతున్నారు. 2018లో ఆస్ట్రేలియా నుంచి తెప్పించామని.. మళ్లీ ఇప్పుడు ఇంకో 20 డోసుల్ని తెప్పిస్తున్నారు. ఇన్ఫెక్షన్ ప్రారంభదశలో ఉందని.. ఇలాంటి వేళలో మెడిసిన్ ఇవ్వొచ్చని చెబుతున్నారు. అయితే.. ఇప్పటివరకు యాంటీ బాడీ డోసుల్ని ఇవ్వలేదు. యాంటీ బాడీ డోసుల భద్రత విషయంలో ఫేజ్ 1 మాత్రమే పూర్తి అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది కూడా విదేశాల్లోనే దీని సామర్థ్యాన్ని పరీక్షించారే తప్పించి.. భారత్ లో మాత్రం చేపట్టింది లేదు. నిఫా వైరస్ గబ్బిలాల నుంచి వ్యాపిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే.. గబ్బిలాల నుంచి మనుషులకుఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందన్న దానిపై స్పష్టత లేని పరిస్థితి. ఈ మిస్టరీని చేధించటానికి ప్రయత్నాలు జరుగుతున్నా.. ఫలితం మాత్రం ఇంకా దక్కని పరిస్థితి.