నాలుగేళ్ల క్రితం బాలికను వేధించాడు.. ఇప్పుడేమో ఆమె తండ్రిని చంపేశాడు
నిడదవోలు పట్టణానికి చెందిన 46 ఏళ్ల షేక్ వల్లీబాషా వంటలు చేస్తుంటాడు. ఆయనకు భార్య.. ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం 2021లో వల్లీబాషా చిన్న కుమార్తె ఇంటర్ చదువుతూ ఉండేది.
By: Tupaki Desk | 5 May 2025 5:30 AMతూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో దారుణ ఉదంతం చోటు చేసుకుంది. ఒక బాలికను వేధింపులకు గురి చేసిన ఉదంతంలో ఫోక్సో కేసు నమోదు కావటం.. తాజాగా ఆ కేసును వెనక్కి తీసుకోమంటే.. ససేమిరా అన్నాడన్న కోపంతో ఆమె తండ్రిని దారుణంగా హతమార్చిన దుర్మార్గం చోటు చేసుకుంది. ఈ తరహా ఘటనలకు పాల్పడే వారిని తేలిగ్గా వదిలిపెట్టకూడదన్న మండిపాటు వ్యక్తమవుతోంది.
నిడదవోలు పట్టణానికి చెందిన 46 ఏళ్ల షేక్ వల్లీబాషా వంటలు చేస్తుంటాడు. ఆయనకు భార్య.. ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల క్రితం 2021లో వల్లీబాషా చిన్న కుమార్తె ఇంటర్ చదువుతూ ఉండేది. అప్పట్లో ఆమెను నిడదవోలు వైఎస్సార్ కాలనీకి చెందిన అనిల్ కుమార్ వెంటపడి వేధింపులకు గురి చేసేవాడు. లారీ డ్రైవర్ అయిన ఇతగాడి తీరుకు ఆమె భయపడిపోయింది. చివరకు తల్లిదండ్రులకు తాను ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పటంతో.. వారు పోలీసుల్ని ఆశ్రయించారు.
వల్లీబాషా ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ మీద పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నిరూపితమైతే శిక్ష పడటం ఖాయమన్న భయంతో పాటు.. ఈ కేసు కారణంగా తనకు పెళ్లి కావటం లేదన్న కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో వల్లీబాషాతో రాజీకి సైతం ప్రయత్నించాడు. అయితే.. తన కుమార్తెను వేధించిన వాడితో రాజీ కుదుర్చుకోవటానికి వల్లీబాసా ససేమిరా అన్నాడు.
ఇదిలా ఉండగా.. ఈ మధ్యన మరోసారి రాజీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున షాపు తెరిచేందుకు బయటకు వచ్చిన బాషా మీద అనిల్ కుమార్ దాడి చేశాడు. గొంతు.. వీపు భాగాలపై కత్తితో పొడిచేయటంతో తీవ్రగాయాలు కావటంతో వల్లీభాషా అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు రాజీ కోసం ప్రయత్నించి.. ఇప్పుడు హత్య కేసు మీదేసుకున్న అనిల్ కుమార్ ను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.