ఏకంగా అధ్యక్షుడి కిడ్నాపా..? సద్దాం, గడాఫీలానే మదురో కూడానా?
ఒక దేశంపై ఏకంగా దాడికి దిగి.. ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యతో పాటు ఎత్తుకెళ్లడం...! వినేందుకు అంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.. కానీ, వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురో విషయంలో ఇదే చేసింది అమెరికా.
By: Tupaki Desk | 4 Jan 2026 9:00 AM ISTఒక దేశంపై ఏకంగా దాడికి దిగి.. ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యతో పాటు ఎత్తుకెళ్లడం...! వినేందుకు అంతా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.. కానీ, వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురో విషయంలో ఇదే చేసింది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. వెనెజులాలో మదురో ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఇప్పుడు తమ అదుపులో ఉన్న ఆయనను ఏంచేస్తారు? అనేది చర్చనీయాంశం. మదురోను డ్రగ్స్, ఉగ్రవాద ఆరోపణల మీద విచారించనున్నట్లు కథనాలు వస్తున్నాయి. అమెరికా చరిత్ర ప్రకారం చూస్తే.. తాము పగబట్టిన ఏ విదేశీ నాయకుడినీ ఆ దేశం ప్రాణాలతో వదల్లేదు అని తెలుస్తోంది. గతంలో ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా నియంత కల్నల్ గడాఫీలను పదవీచ్యుతులను చేసి హతమార్చింది. 1970ల్లో చిలీ పాలకుడు అలెన్ డీపై సైనిక తిరుగుబాటు వెనుక కూడా అమెరికానే ఉంది అనేది ఓ అభిప్రాయం. మరిప్పుడు ఏకంగా తమ అదుపులోనే ఉన్న మదురోను ఏం చేస్తుంది?
సద్దాంను గద్దె దింపి...
ఇరాక్ ను తిరుగులేని విధంగా పాలిస్తున్న సద్దాం హుస్సేన్ పై అమెరికా పగబట్టింది. తమకు అనుకూలంగా లేకపోవడంతో ఆయనను పదవి నుంచి దించేసింది. అణు, జీవ, రసాయన వంటి సామూహిక విధ్వంస ఆయుధాలు ఉన్నాయని ఆరోపణలు మోపింది. కానీ, ఇరాక్ అంతటా గాలించినా వీటిని నిరూపించలేకపోయింది. చివరకు 2001 సెప్టెంబరు 11న తమ దేశంపై ఆల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడికి సద్దాం మద్దతు ఇచ్చారని నిందలు వేసింది. అవీ నిజం అని చూపలేకపోయింది. 1990ల ప్రారంభంలో కువైట్ పై సద్దాం హుస్సేన్ యుద్ధానికి దిగడం అమెరికాతో శత్రుత్వానికి దారితీసింది. సద్దాం దళాలను అమెరికా సంకీర్ణ దళాలు కువైట్ నుంచి వెళ్లగొట్టాయి. కానీ, శత్రుత్వం మిగిలిపోయింది. ఇక ఇరాక్ లోని భారీ చమురు నిల్వలపై అమెరికా కన్నేసింది. అందుకు తమకు అనుకూలుడైన పాలకుడు కావాలి. చివరకు ఆయుధ తనిఖీలో ఐక్యరాజ్య సమితి నిబంధలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో సద్దాంపై ఆపరేషన్ ఇరాకీ ఫ్రీడమ్ అంటూ అమెరికా దాడులకు దిగింది. ఇది 2003 మార్చిలో జరిగింది. అప్పుడు పారిపోయిన సద్దాం.. కొన్నాళ్లకు ఓ బంకర్ లో దొరికారు. తర్వాత సామూహిక ఊచకోత ఆరోపణలపై ఇరాక్ కోర్టు ఉరిశిక్ష వేసింది. ఇది 2006 డిసెంబరులో జరిగింది.
గడాఫీని వేటాడి వెంటాడి
90 శాతం ఎడారి దేశమైన లిబియాను సంక్షేమ రాజ్యంగా మలిచారు కల్నల్ గడాఫీ. కానీ, ఆయనపై ఉగ్రవాద ఆరోపణలు మోపింది అమెరికా. పశ్చిమాసియాలో ఆయనను వ్యతిరేక శక్తిగా చూపించింది. 1986లో బెర్లిన్ డిస్కోలో జరిగిన బాంబుదాడిలో గడాఫీ పాత్ర ఉందని అమెరికా అనుమానం. ఆ తర్వాత ఆయనను టార్గెట్ చేసింది. 2011లో లిబియాలో తిరుగుబాటు జరగ్గా దానికి అమెరికా నిఘా సంస్థ సీఐఏ మద్దతిచ్చింది. అదే ఏడాది గడాఫీ హత్య జరిగింది. దీనికి సీఐఏ మద్దతు ఉందనేది అందరూ చెప్పే మాట. గడాఫీ కాన్వాయ్ పై జరిగిన దాడిలో అమెరికా ప్రిడేటర్ డ్రోన్ ఉందని అంటారు. అలా గడాఫీ కథ ముగించింది అమెరికా.
చిలీ పాలకుడు అలెండోను కూడా...
1973లో చిలీ పాలకుడు అలెండోను సైనిక తిరుగుబాటు ద్వారా పదవీచ్యుతుడిని చేసింది అమెరికా. నాడు తిరుగుబాటు చేసిన ఆగస్టో పినోచెట్ వెనుక అమెరికా ఉంది అనేది బహిరంగ రహస్యమే. చిలీ సైనికాధికారులతో అమెరికా సీఐఏ సాన్నిహిత్యం పెంచుకుని అలెండోకు వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహించింది. చివరకు ఆయన ఆత్మహత్య చేసుకోగా.. సైనిక ప్రభుత్వం ఏర్పడింది. దీనికి అమెరికా వెంటనే మద్దతు తెలిపింది.
