పుట్టపర్తి మదురో... సత్యసాయి సన్నిధిలో వెనెజులా అధ్యక్షులు
కానీ, సత్యసాయిపై తనకు ఉన్న భక్తిని మాత్రం దాచుకోలేదు. మదురోకే కాదు.. ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కు కూడా పుట్టపర్తి సత్యసాయి బోధనలపై విపరీతమైన నమ్మకం ఉండేదని స్పష్టం అవుతోంది.
By: Tupaki Desk | 6 Jan 2026 10:11 PM ISTనికొలస్ మదురో.. మూడు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయిన పేరు. సహజంగా అయితే దక్షిణ అమెరికా ఖండంలోని దేశాలు ఎమిటో చాలామందికి తెలియదు. ఇక వాటి అధ్యక్షులు ఎవరో కూడా తెలిసి ఉండదు. కానీ, అమెరికా ఆగమేఘాల మీద ఈ వెనెజులా అధ్యక్షుడిని బంధించి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అగ్ర రాజ్యం అసలు ఎందుకింత పని చేసింది..?
ఎవరీ నికొలస్ మదురో? అనే వివారలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మదురోలోని భక్తుడి గురించి తెలిసింది. అదికూడా ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక ప్రాంతం పుట్టపర్తితో ఆయనకు ఉన్న అనుబంధం బయటపడింది. భక్తులు భగవాన్ గా కొలిచే పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే మదురోకు గురి ఉన్నట్లు అర్థమైంది. అయితే, మదురో అధ్యక్షుడు కాకముందు మాత్రమే పుట్టపర్తికి వచ్చారు. 2013లో ఆయన వెనెజులా అధ్యక్షుడు అయ్యాక మాత్రం ఈ క్షేత్రాన్ని సందర్శించలేదు.
కానీ, సత్యసాయిపై తనకు ఉన్న భక్తిని మాత్రం దాచుకోలేదు. మదురోకే కాదు.. ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కు కూడా పుట్టపర్తి సత్యసాయి బోధనలపై విపరీతమైన నమ్మకం ఉండేదని స్పష్టం అవుతోంది. కొన్న కథనాల ప్రకారం మదురోకు సత్యసాయి విశిష్టతను ఆమెనే పరిచయం చేశారని తెలుస్తోంది. టఫ్ టైమ్స్ లో ధైర్యం చెబుతూ మదురోను నడిపించిన మహిళగా సిలియాకు పేరుంది. ఆ సమయంలోనే ఆమె పుట్టపర్తి ప్రాశస్త్యం గురించి చెప్పి ఉండొచ్చని భావిస్తున్నారు.
20 ఏళ్ల కిందటే..
మదురో 2005లో ఉమ్మడి ఏపీ ఉండగా అప్పటి అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందారు. నాడు వెనెజులాకు అధ్యక్షుడిగా అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు, అమెరికాను ధిక్కరించిన యోధుడిగా పేరున్న హ్యూగో చావెజ్ ఉండేవారు. ఆయన ప్రభుత్వంలో మదురో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయితో ఏకాంతంగా భేటీ అయినట్లుగానూ సమాచారం. మదురో ఇదే భక్తి ప్రపత్తులను ఇప్పటికీ కొనసాగిస్తున్నారని తాజా ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.
అధ్యక్ష భవనంలో సత్యసాయి ఫొటో
మదురో మొన్నటివరకు వెనెజులా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కార్యాలయంలో సత్యసాయి ఫొటో ఉంది. ఈ కార్యాలయంలో మదురోకు అత్యంత ఆరాధ్యుడైన చావెజ్ ఫొటోతో పాటు సత్యసాయి ఫొటో కూడా ఉండడం విశేషం. ఇక వెనెజులాలో సత్యసాయి ట్రస్ట్ చాలా పటిష్ఠంగా ఉంది. సత్యసాయి శత జయంతి సందర్భంగా మదురో ప్రత్యేక సందేశం కూడా ఇచ్చారట. అందులో ఆయన విజ్ డమ్, జీవన విధానాన్ని కొనియాడారట. 2011లో సత్యసాయి కాలం చేసిన సమయంలో దేశమంతా సంతాప దినాలు పాటించారని కథనాలు ఉన్నాయి. అయితే, అప్పటికి మదురో కాదు చావెజ్ అధ్యక్షుడుగా ఉన్నారు. కానీ, మదురో ప్రభావంతోనే సంతాప దినాలు పాటించినట్లు తెలుస్తోంది.
తాజా అధ్యక్షురాలికీ...
మదురోను దించేసిన అమెరికా వెనెజులా అధ్యక్షురాలిగా డెన్సీ రోడ్రిగ్స్ ను పదవిల కూర్చోబెట్టింది. ఈమెకు కూడా సత్యసాయ అంటే విపరీతమైన ఆరాధన భావం ఉందట. అంతేకాదు.. గతంలో పలుసార్లు ఆమె పుట్టపర్తి వచ్చిన సంగతి స్పష్టమైంది. అప్పటికి వెనెజులా ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు. డెన్సీ... పుట్టపర్తి సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అవి అందరిని ఆకర్షిస్తున్నాయి.
