పహల్గాం ఉగ్రవాదులకు సంబంధించి ఎన్ఐఏ కీలక విషయాలు..!
ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని కాల్చిచంపిన అనంతరం ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లోకి పారిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 2 May 2025 9:55 AM ISTఏప్రిల్ 22న పహల్గాంలో 26 మందిని కాల్చిచంపిన అనంతరం ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లోకి పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో పాల్గొన్నట్లు చెబుతున్న సుమారు నలుగురు ఉగ్రవాదులు నాటి నుంచీ పరారీలోనే ఉన్నారు. వారి కోసం సైన్యం, స్థానిక పోలీసులు భారీ వేట షురూ చేశారు. ఈ సమయంలో.. వారు ఎక్కడున్నారనే విషయంపై ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును... దక్షిణ కాశ్మీర్ లోని పహల్గాంలో భీకర కాల్పులకు పాల్పడి.. 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరీని హతమార్చిన అనంతరం.. ఆ నలుగురు ఉగ్రవాదులు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. వారికోసం సైన్యం, స్థానిక పోలీసులు కశ్మీర్ ను జల్లెడ పడుతున్నారు. ఈ సమయంలో వారి ఇప్పటికీ ఆ పరిసర ప్రాంతంలోనే ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఆ దాడి జరిగి సుమారు 10 రోజులు కావొస్తున్న నేపథ్యంలో ఆ దట్టమైన అడవుల్లో మనుగడ ఎలా అనే విషయంపైనా ఎన్.ఐ.ఏ. క్లారిటీ ఇస్తోంది! ఇందులో భాగంగా... వారివద్ద సమృద్ధిగా ఆహార పదార్థాలు ఉండి ఉండొచ్చని.. అందువల్లే ఇన్ని రోజులుగా దట్టమైన అడవుల్లో దాక్కొని ఉంటారని అంటున్నారు.
వాస్తవానికి బైసారన్ లోయలో దాడి చేయడానికి కనీసం 48 గంటల ముందు నుంచి వారు ఆ సమీప ప్రాంతంలోనే ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్న ఎన్.ఐ.ఏ వర్గాలు... దాడి తర్వాత ఆ ఉగ్రవాదులు ఇంకా ఆ అడవుల్లోనే నక్కి ఉండటం పలు సందేహాలకు తావిస్తోందని చెబుతున్నారు! ఈ సమయంలో బేతాబ్ లోయ సహా మరో నాలుగు ప్రదేశాలను ఎన్.ఐ.ఏ. స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో... ఉగ్రవాదుల వద్ద అధునాతన కమ్యునికేషన్ పరికరాలు ఉన్నాయని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ప్రధానంగా సిమ్ కార్డులు అవసరం లేని, స్వల్ప శ్రేణి ఎన్ క్రిప్టెడ్ ట్రాన్స్ మిషన్ లను వారు కలిగి ఉన్నారని.. దానిని అడ్డగించడం అసాధ్యం కాకపోయినా కాస్త కష్టతరం మాత్రం అని మాజీ మిలటరీ అధికారులు చెబుతున్నారు.
కాగా... పహల్గాంలోని ఉగ్రదాడిలో 26 మంది మరణించడం భారత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న భారత్.. పాక్ కు దౌత్యపరమైన షాకులు ఇచ్చింది. దాడికి కారకులైన వారిపైనా, దాడికి ప్రణాళిక వేసి సహకరించినవారిపైనా ప్రతీకారం తీర్చుకుంటామని మోడీ ప్రతిజ్ఞ చేశారు.
