Begin typing your search above and press return to search.

రోడ్డు నిర్మాణంలో ఎక్స్‌ప్రెస్‌ వేగం.. రెండు గిన్నిస్ రికార్డులు నమోదు!

ఎక్స్‌ప్రెస్‌వే అంటే.. వేగంగా ప్రయాణించడానికి అనువైన రహదారులుగా భావిస్తాం.. కానీ, ఈ పదానికి అర్థమే మార్చేలా రోడ్డు నిర్మాణం జరిగింది.

By:  Tupaki Desk   |   7 Jan 2026 6:13 PM IST
రోడ్డు నిర్మాణంలో ఎక్స్‌ప్రెస్‌ వేగం.. రెండు గిన్నిస్ రికార్డులు నమోదు!
X

ఎక్స్‌ప్రెస్‌వే అంటే.. వేగంగా ప్రయాణించడానికి అనువైన రహదారులుగా భావిస్తాం.. కానీ, ఈ పదానికి అర్థమే మార్చేలా రోడ్డు నిర్మాణం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌ వేగంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు జరిగాయి. కేవలం 24 గంటల్లో 10,675 మెట్రిక్ టన్నుల బిట్యూమనస్ కాంక్రీట్ ఉపయోగించి 28.95 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం పూర్తయింది. ఇందుకు కాను జాతీయ రహదారుల సంస్థ (NHAI) రెండు గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకుంది. బెంగళూరు - కడప - విజయవాడ మార్గంలో అత్యంత వేగంగా రహదారి నిర్మించి ఎన్‌హెచ్ఏఐ రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

జాతీయ రహదారుల నిర్మాణంలోనూ ఎన్‌హెచ్ఏఐ గతంలోనూ కూడా పలు రికార్డులు నమోదు చేసింది. అయితే తాజాగా బెంగళూరు - కడప - విజయవాడ మార్గంలో కేవలం 24 గంటల వ్యవధిలో 28.95 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించడం ఒక రికార్డుగా చెబుతున్నారు. అదే సమయంలో అత్యధిక మెటీరియలో వినియోగంలో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వినియోగించడం కూడా రికార్డుగా పరిగణించి గిన్నిస్ బుక్ రికార్డ్సులో నమోదు చేశారు.

2023లో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్-అలీగఢ్ ఎక్స్‌ప్రెస్‌వేపై కేవలం 100 గంటల్లో 100 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి ఎన్‌హెచ్ఏఐ చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2022లో మహారాష్ట్రలోని అమరావతి - అకోలా (NH-53) మధ్య 75 కిలోమీటర్ల సింగిల్ లేన్ తారు రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ రికార్డును దక్కించుకున్నారు. అదేవిధంగా విజయపుర - సోలాపూర్ హైవే పనుల్లో భాగంగా 25.54 కిలోమీటర్ల రహదారిని కేవలం 18 గంటల్లో నిర్మించిన రికార్డు కూడా ఉంది.

నిజానికి బెంగళూరు - విజయవాడ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులలో నాలుగు గిన్నస్ రికార్డులు నమోదు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారని చెబుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వానవోలు-వంకరకుంట మధ్య 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ ఉపయోగించి రహదారి నిర్మాణానికి కాంట్రాక్టు సంస్థ రాజ్‌పథ్‌ ఇన్‌ఫ్రాకాన్‌ ప్రణాళిక రచించింది. సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు పనులు ప్రారంభించింది. ఈ నెల 12 వరకు ఏడు రోజుల్లో నిరంతరాయంగా 52 కి.మీ. బిట్యుమినస్ రోడ్డు నిర్మించాలని భావించింది.

అయితే కేవలం 24 గంటల్లోనే 28.95 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డు పూర్తిచేసి ఒక రికార్డును నమోదు చేసింది. ఇక అత్యంత ఎక్కువ మొత్తంలో నిర్మాణ సామగ్రిని వినియోగించడం ద్వారా రెండో రికార్డును అందుకుంది. ఇదే సమయంలో 24 గంటల్లో అత్యంత పొడవైన రోడ్డు, 24 గంటల్లో అత్యంత ఎక్కువ బిట్యుమనస్ కాంక్రీట్ వినియోగంపైనా రికార్డు నమోదు చేయాలని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సుకు దరఖాస్తు చేసిందని చెబుతున్నారు.

బిట్యుమినస్‌ రోడ్డు అంటే..

బిట్యుమినస్‌ రోడ్డునే అస్ఫాల్ట్‌ రోడ్డు అని కూడా పిలుస్తారు. వాహనాలకు అనువైన, మృదువైన రోడ్డుతోపాటు మన్నికైన నిర్మాణానికి బిట్యుమిన్‌ను ఉపయోగిస్తారు. ముడి చమురు నుంచి వచ్చే జిగటగా ఉండే నల్లటి, చిక్కటి పదార్థమే ఈ బిట్యుమిన్‌. రాయిని బాగా క్రష్‌ చేసి దానికి ఇసుక, కంకరతో పాటు తారులా ఉండే బిట్యుమిన్‌కు కలుపుతారు. దీంతో రోడ్డు ఉపరితలం దృఢంగానూ, మృదువుగానూ తయారవుతుంది. వాటర్‌ఫ్రూ్‌ఫగానూ మారుతుంది. ఖర్చు తక్కువ అయ్యే ఈ రోడ్లను వేగంగా నిర్మించవచ్చని అధికారులు చెబుతున్నారు.