స్టార్ ఫుట్ బాలర్ కు 10 వేల కోట్ల ఆస్తి రాసిచ్చేసిన అజ్ఞాత అభిమాని
మనకు క్రికెటర్లకు ఎలాగైతే దేవుళ్లో బ్రెజిలియన్లకు ఫుట్ బాలర్లు దేవుళ్లు. అందుకేనేమో.. ఓ బిలియనీర్ ఏకంగా తన యావదాస్తిని స్టార్ ఫుట్ బాలర్ కు రాసిచ్చేశాడు.
By: Tupaki Desk | 6 Sept 2025 3:52 PM ISTమన దేశంలో ఏ తిరుమల వేంకటేశ్వరుడి ఆలయానికో... మరేదైనా యూనివర్సిటీకో.. పరిశోధనా సంస్థకో... రూ.కోట్ల విలువైన ఆస్తులను దానం చేయడం చూశాం... తమ మొత్తం ఆస్తిని అనాథ శరణాలయాలకు రాసిచ్చిన వారూ కొందరు ఉన్నారు. కానీ, భారత్ లాంటి దేశమే అయిన బ్రెజిల్ ఏ బిలియనీర్ చేసిన పనిచూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. మనం క్రికెట్ ను ఎలాగైతే ఆరాధిస్తామో బ్రెజిల్ లో ఫుట్ బాల్ ను అంతగా ప్రేమిస్తారు. మనకు క్రికెటర్లకు ఎలాగైతే దేవుళ్లో బ్రెజిలియన్లకు ఫుట్ బాలర్లు దేవుళ్లు. అందుకేనేమో.. ఓ బిలియనీర్ ఏకంగా తన యావదాస్తిని స్టార్ ఫుట్ బాలర్ కు రాసిచ్చేశాడు.
ఒకప్పుడు పీలే, రొనాల్డో.. ఇప్పుడు నెయ్ మార్
బ్రెజిల్ కు ప్రపంచ కప్ లు అందించిన హీరోలు పీలే, రొనాల్డో. వీరి సరసన చేరతాడని భావించారు నెయ్ మార్. 2014 ప్రపంచ కప్ లో 22 ఏళ్ల నెయ్ మార్ పేరు మార్మోగింది. ప్రపంచ కప్ లో అతడికి గాయమైతే బ్రెజిల్ విలవిల్లాడింది. అయితే, ప్రతిభకు, తనకు వచ్చిన స్టార్ డమ్ కు తగిన న్యాయం చేయడంలో నెయ్ మార్ విఫలమయ్యాడనే చెప్పాలి. వచ్చే ఏడాది ప్రపంచ కప్ లో అయినా బ్రెజిల్ తరఫున నెయ్ మార్ మెరుస్తాడనే ఆశలు ఉన్నాయి.
31 ఏళ్లకే మరణించిన వ్యాపారి...
బ్రెజిల్ లోని ప్రముఖ నగరమైన పోర్ట్ అలెగ్రోకు చెందిన 31 ఏళ్ల వ్యాపారి 61.1 బిలియన్ బ్రెజిల్ రియాల్స్ (రూ.10 వేల కోట్లు)ను నెయ్ మార్ పేరిట వీలునామా రాశాడు. ఈ అజ్క్షాత వ్యాపారి ఇటీవల చనిపోయాడు. దీంతో నెయ్ మార్ కు అతడి ఆస్తి మొత్తం దక్కనుంది. పైగా ఆ వ్యాపారికి భార్యాపిల్లలు కూడా లేరు. జూన్ 12న వీలునామాను రిజిస్టర్ చేశాడు. నెయ్ మార్ అంటే విపరీతమైన ఆరాధన ఉన్న అతడు ఇటీవల మరణించాడు.
కనీసం చూడకుండానే..
నెయ్ మార్ ను కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఆ వ్యాపారి తన యావదాస్తిని రాసివ్వడం చర్చనీయం అవుతోంది. నెయ్ మార్ లో తనను తాను చూసుకున్నానని... నెయ్ మార్ కు అతడి తండ్రికి మధ్య ఉన్న అనుబంధం తనకు చాలా స్ఫూర్తినిచ్చిందని, నెయ్ మార్ కేవలం అథ్లెట్ కాదని, కుటుంబ విలువలు తెలిసిన గొప్ప వ్యక్తి అని అజ్క్షాత బిజినెస్ మ్యాన్ వీలునామాలో పేర్కొన్నాడు.
300 మిలియన్ డాలర్లకు తోడు..
నెయ్ మార్ ఇప్పటికే 330 మిలియన్ డాలర్ల ఆస్తిపరుడు. ఇప్పుడు రూ.10 వేల కోట్ల ఆస్తి కూడా కలిస్తే అతడు ప్రపంచంలో అత్యంత సంపన్న క్రీడాకారుడు అవుతాడు. కానీ, అతడికి దానంగా వచ్చిన ఆస్తిపై కోర్టులో పిటిషన్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. మరోవైపు దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని నెయ్ మార్ టీమ్ తెలిపింది.
