Begin typing your search above and press return to search.

నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర... కెనడాకు షాకిచ్చిన కివీస్!

ఈ సమయంలో.. ట్రూడోకు ఈసారి మిత్రదేశం నుంచి షాక్ తగిలింది. నిజ్జర్ హత్య వ్యవహారంలో ట్రూడో చేస్తున్న ఆరోపణలపై కెనడా మిత్రదేశం న్యూజిలాండ్ స్పందించింది.

By:  Tupaki Desk   |   13 March 2024 1:30 PM GMT
నిజ్జర్  హత్యలో భారత్  పాత్ర... కెనడాకు షాకిచ్చిన కివీస్!
X

ఖలీస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టీన్ ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా భారత్ దూకుడు ప్రదర్శించింది.. నిజం నిలకడ మీద తెలుస్తుందని కొన్ని విషయల్లో ఓపికగా ఉంటూనే మరికొన్ని విషయాల్లో కెనడాకు షాకిచ్చే చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలో నిజ్జర్ హత్యలో భారత్ పాత్రపై ఒకటికి రెండు సార్లు ట్రూడో స్పందించారు. ఇదే క్రమంలో... కెనడాలోని ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్ పేరును కూడా కెనడా చేర్చింది. అయితే ఇలాంటి పనులకు కెనడా పాల్పడుతున్న వేళ... నిజ్జర్ హత్యకేసు విచారణలో భారత్ నుంచి పూర్తి సహకారం అందుతోందని ఆ దేశ తాజా మాజీ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ జోడీ థామస్‌ వెల్లడించారు.

ఈ సమయంలో.. ట్రూడోకు ఈసారి మిత్రదేశం నుంచి షాక్ తగిలింది. నిజ్జర్ హత్య వ్యవహారంలో ట్రూడో చేస్తున్న ఆరోపణలపై కెనడా మిత్రదేశం న్యూజిలాండ్ స్పందించింది. ఇందులో భాగంగా ట్రూడోను నిలదీసినంతపని చేసింది. నిజ్జర్ హత్య వ్యవహారంలో భారత్ ఏజెంట్ల పాత్రకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే చూపించాలని కివీస్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి విన్ స్టన్ పీటర్స్ డిమాండ్ చేశారు. సాక్ష్యాలు చూపకుండానే ఆరోపణలు చేస్తుందని తెలిపారు.

నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన విన్ స్టన్ పీటర్స్... నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉన్నట్లు కెనడా చేసిన ఆరోపణలకు సంబంధించి ఖచ్చితమైన సాక్ష్యాలు ఒక్కటి కూడా కనిపించలేదని స్పష్టం చేశారు. ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ అలియన్స్ లో భాగమైనప్పటికీ... ట్రూడో ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి సాక్ష్యాలనూ పంచుకోలేదని స్పష్టం చేశారు.

కాగా... నిఘా సమాచార మార్పిడి కోసం ఫైవ్ ఐస్ అలయన్స్ లో కెనడా, న్యూజిలాండ్ దేశాలతోపాటు అగ్రరాజ్యం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లు సభ్యదేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో కెనడా ఆరోపణల నేపథ్యంలో... వియన్నా ఒప్పంద సూత్రాల పేరుచెప్పి అమెరికా, బ్రిటన్ ను కెనడాకు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ఫైవ్ ఐస్ కూటమిలోని ఒక దేశం ఈ విషయంలో కెనడాను ప్రశ్నించడం ఇదే తొలిసారి.