Begin typing your search above and press return to search.

అమెరికాకు కొత్త భయాన్ని తెచ్చిన కరోనా కొత్త వేరియంట్

తాజాగా కరోనా కొత్త వేరియంట్ కు చెందిన కేసులు అగ్రరాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి.

By:  Tupaki Desk   |   15 Nov 2023 3:30 PM GMT
అమెరికాకు కొత్త భయాన్ని తెచ్చిన కరోనా కొత్త వేరియంట్
X

ప్రపంచాన్ని ఆగమాగం చేసిన కరోనా మహమ్మారి.. అప్పుడప్పుడు తన ఉనికిని చాటుకునేలా చేస్తున్న ప్రయత్నాలు ఆయా దేశాల్లో కనిపిస్తున్నాయి. భారీ భూకంపం చోటు చేసుకున్న తర్వాత.. చిన్నస్థాయి ప్రకంపనలు జోరుగా చోటు చేసుకోవటం.. పరిస్థితులు స్థిమితపడటానికి కాస్త సమయం తీసుకోవటం తెలిసిందే. కరోనా విషయంలో అలాంటి పరిస్థితులే అక్కడక్కడా కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల మాత్రం పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండి కొత్త భయాందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.

తాజాగా కరోనా కొత్త వేరియంట్ కు చెందిన కేసులు అగ్రరాజ్యం అమెరికాలో పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. హెచ్ వీ.1 వేరియంట్ అమెరికన్లను భయాందోళనలకు గురి చేస్తోంది. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నుంచి అందుతున్న డేటా ప్రకారం చూస్తే.. అక్టోబరు 28తో ముగిసిన రెండు వారాల వ్యవధిలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 25.2 శాతం ఈ కొత్త వేరియంట్ కు చెందిన కేసులేనని చెబుతున్నారు.

గతంలో వేగంగా విస్తరించిన ఈజీ.5 అకా ఎరిస్ వేరియంట్ తో పోలిస్తే.. తాజా వేరియంట్ ప్రభావం ఎక్కువని చెబుతున్నారు. తాజా గణాంకాల్ని చూసినప్పుడు ఈ వేరియంట్ కేసులు జూలైలో 0.5 శాతంగా ఉంటే.. అక్టోబరు నాటికి అవి కాస్తా 12.5 శాతానికి పెరగటం గమనార్హం. ఈ కొత్త వేరియంట్ సోకిన వారికి గొంతు నొప్పి.. జలుబు.. దగ్గు.. తలనొప్పి.. అలసట.. కండరాల నొప్పి.. చలి లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయనిచెబుతున్నారు.

ఈ కొత్త వేరియంట్ బారిన పడిన వారి నోటిలో కోవిడ్ టంగ్ లక్షణాలు కనిపిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొందరు రోగుల నాలుకపై సాధారణం కంటే తెల్లని మందపాటి పొర ఏర్పడుతుందని చెబుతున్నారు. నాలుక బాగా ఎర్రబడటం.. మంట.. రుచి కోల్పోవటం.. కొద్దిగా తిమ్మిరి లాంటి లక్షణాలతో పాటు నాలుకపై పొక్కులు.. అల్సర్లు ఏర్పడినట్లుగా తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి మందులు వాడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.