Begin typing your search above and press return to search.

మరో వందే భారత్ తెలుగోళ్లకు.. షెడ్యూల్ ఇదే!

బయలుదేరేది తెలంగాణ లో అయినా.. ఏపీ లో నుంచి వెళ్లే ఈ రైలు కర్ణాటక రాజధాని బెంగళూరు లోని యశ్వంత్ పురా స్టేషన్ కు చేరుకుంటుంది.

By:  Tupaki Desk   |   2 Aug 2023 5:49 AM GMT
మరో వందే భారత్ తెలుగోళ్లకు.. షెడ్యూల్ ఇదే!
X

తెలుగోళ్లకు మరో స్వీట్ న్యూస్. మరో వందేభారత్ రైలు తెలుగు రాష్ట్రాల కు అందుబాటు లోకి రానుంది. బయలుదేరేది తెలంగాణ లో అయినా.. ఏపీ లో నుంచి వెళ్లే ఈ రైలు కర్ణాటక రాజధాని బెంగళూరు లోని యశ్వంత్ పురా స్టేషన్ కు చేరుకుంటుంది. వందే భారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాల కు కేటాయించే విషయం లో కాస్త ఆలస్యమైనప్పటికీ, ఒకటి తర్వాత ఒకటి చొప్పున తెలుగు రాష్ట్రాల కు వస్తున్నాయి.

ఇప్పటికే సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ - విశాఖపట్నంకు రెండు సర్వీసులు విజయవంతంగా నడుస్తుండగా.. ముచ్చటగా మూడోది కాచిగూడ - బెంగళూరు మధ్యన నడవనుంది. త్వరలో ఈ రైలు ను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తారని చెబుతున్నారు. హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిచే రైళ్లు మొత్తం విపరీతమైన రద్దీ నెలకొన్న నేపథ్యంలో.. ఈ వందే భారత్ ట్రైన్ కు విశేష ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి ఈ రైల్ సర్వీసును అందుబాటు లోకి తేనున్నట్లు తెలుస్తోంది. బుధవారం మినహా వారం లో మిగిలిన అన్నీ రోజుల్లోనూ ఈ ట్రైన్ ను నడుపుతారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రైలు లో మొత్తం 8 బోగీలు ఉంటాయని.. ఏసీ ఛైర్ కార్ బోగీలు ఏడు.. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ లు ఒకటి ఉండనుంది. ఏసీ ఛైర్ కార్ బోగీ లో 78 సీట్లు ఉండనున్నాయి. కాచిగూడ నుంచి బయలుదేరే ఈ ట్రైన్ గమ్యస్థానం యశ్వంత్ పూర్ అయినప్పటికీ.. ఆగే స్టాపులు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కావటం ఒక విశేషం. కర్ణాటకలో యశ్వంత్ పూర్ మినహా మరో స్టేషన్ లో ఈ రైలు ఆగదు.

ఈ వందే భారత్ రైలు రాకపోకల కు సంబంధించిన షెడ్యూల్ ను చూస్తే.. ఈ వందే భారత్ రైలు యశ్వంత్ పూర్ నుంచి ప్రతి రోజు తెల్లవారుజామున 5.30 గంటల కు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటల కు కాచిగూడకు చేరుకుంటుంది. ఇక్కడ 45 నిమిషాల పాటు ఆగి.. ఆ వెంటనే మళ్లీ ప్రయాణమవుతుంది. 2.45 గంటల కు కాచిగూడ నుంచి బయలుదేరే ఈ రైలు యశ్వంత్ పూర్ కు రాత్రి 11 గంటల కు చేరుకుంటుంది.

ఇక.. ఈ ట్రైన్ ఆగే స్టేషన్ల విషయానికి వస్తే..

- యశ్వంత్ పుర్

- ధర్మవరం

- అనంతపూర్

- డోన్

- కర్నూలు సిటీ

- మహబూబ్ నగర్

- కాచిగూడ

యశ్వంత్ పూర్ నుంచి కాచిగూడకు 609 కి.మీ. దూరం ఉండగా, మొత్తం ప్రయాణ సమయం 8.30 గంటలు. తిరుగు ప్రయాణం లో మాత్రం 15 నిమిషాల సమయం తగ్గనుంది. ఈ ట్రైన్ సరాసరి వేగం గంట కు 71.74కి.మీ మాత్రమే. టికెట్ ధరల్ని ఇంకా నిర్ణయించలేదు.