Begin typing your search above and press return to search.

కొత్త తరహా సైబర్ మోసం.. మిస్ కాకుండా చదవండి!

తాజాగా సైబర్ నేరగాళ్లు మనీ స్వైపింగ్ పేరుతో కొత్త తరహా మోసానికి తెర తీశారు.

By:  Tupaki Desk   |   5 May 2024 4:30 PM GMT
కొత్త తరహా సైబర్ మోసం.. మిస్ కాకుండా చదవండి!
X

ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే టెక్నాలజీకి తగ్గట్లే.. ఆశను ఎరచూపి మోసం చేసే సైబర్ మోసాలు ఎప్పటికప్పుడు ఆప్డేట్ చేస్తూ.. అమాయకుల్ని దోచేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి మోసాలకు ఇప్పుడు మరో కొత్త తరహా మోసం యాడ్ అయ్యింది. తాజాగా బెంగళూరుకు చెందిన యువతి ఒకరు తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను ట్రాప్ చేసినప్పటికీ.. ఒకింత లాజిక్ తో పాటు.. తొందరపాటుతో కాకుండా ఆచితూచి స్పందించే తీరుతో మోసపోకుండా తప్పించుకున్నారు.

తాజాగా సైబర్ నేరగాళ్లు మనీ స్వైపింగ్ పేరుతో కొత్త తరహా మోసానికి తెర తీశారు. ఇదెలా ఆపరేట్ చేస్తారన్న దానికి బెంగళూరుకు చెందిన ఆదితీ చోప్రా తన అనుభవాన్ని వివరించారు. తాను ఆఫీసులో పని చేసుకుంటున్న వేళలో ఒక తెలియని నెంబరు నుంచి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. ‘‘కాల్ లిఫ్టు చేసినంతనే.. ఆదితీ నేను మీ నాన్నకు డబ్బులు పంపాలి. ఆయన అందుబాటులో లేనందున మీకు పంపమన్నారు. ఇది మీ నెంబరే కదా? అంటూ గట్టిగా అడిగారు. నేనున సమాధానం చెప్పే లోపే.. బ్యాంకుఖాతాలో డబ్బు జమ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. మొదట రూ.10వేలు.. తర్వాత రూ.30 వేలు. బ్యాంకు వాళ్లు పంపే ఫార్మాట్ లోనే సదరు మెసేజ్ ఉంది’’ అని చెప్పారు.

ఇక్కడే మరో ట్విస్టు చోటు చేసుకుందన్న ఆమె.. ‘‘అంతలోనే సదరు వ్యక్తి మరోసారి కాల్ చేసి.. నేను మీకు రూ.3వేలు మాత్రమే పంపాలి. పొరపాటున ఎక్కువ డబ్బులు పంపాను. దయచేసి మిగిలిన డబ్బు తిరిగి పంపాలని కోరారు. నేను మరిన్ని వివరాలు అడుగుతుండగా.. తాను డాక్టర్ దగ్గర ఉన్నానని.. తన సొమ్ము త్వరగా ఇవ్వాలని పెద్ద ఎత్తున ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడే ఇదేదో స్కాం అని అర్థమైంది. వెంటనే.. నాకొచ్చిన మెసేజ్ ను చెక్ చేశాను.

బ్యాంక్ నుంచి సదరు మెసేజ్ రాకుండా ఒక నెంబరు నుంచి ఎస్ఎంఎస్ వచ్చినట్లుగా గుర్తించా. వెంటనే బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ చెక్ చేస్తే.. అందులో డబ్బులు క్రెడిట్ కాలేదు. నాకొచ్చిన నెంబరుకు కాల్ చేస్తుంటే కలవలేదు. అప్పటికే ఆ మోసగాడు నా నెంబరును బ్లాక్ చేశాడు. తొందరపడకుండా ఉండటం ద్వారా సైబర్ మోసాగాడి నుంచి తప్పించుకున్నా’’ అంటూ తన సుదీర్ఘ సందేశంతో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. ఎప్పడైనా డబ్బులు క్రెడిట్ కావటం.. లేదంటే డెబిట్ కావటం లాంటివి పరిస్థితి ఎదురైతే.. బ్యాంక్ యాప్ ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవటం ఉత్తమం అని ఆమె సూచిస్తున్నారు.