Begin typing your search above and press return to search.

స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్...డజన్ మంది ఐఏఎస్ లను విచారించాల్సిందే...!

ఇదిలా ఉంటే ఇపుడు బాబు బెయిల్ మీదకు వచ్చారు. దాంతో ఇపుడు స్కిల్ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని న్యాయవాది హోదాలో ప్రసాద్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 4:42 AM GMT
స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్...డజన్ మంది ఐఏఎస్ లను విచారించాల్సిందే...!
X

స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆయన ఏకంగా 52 రోజుల పాటు రాజమండ్రి జైలు గోడల మధ్య మగ్గిపోయారు. ఈ కేసులో నాటి సీఎం చంద్రబాబు ప్రమేయం ఉందని ఆయన పదమూడు చోట్ల సంతకాలు చేశారు కాబట్టి ఆయన ఇందులో ప్రధాన సూత్రధారి అని సీఐడీ అభియోగం మోపింది. దాని మీద అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడితే జ్యూడీషియల్ రిమాండ్ కి బాబును తరలించారు.

మొత్తానికి బాబు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటకు వచ్చారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రస్తుతం కొత్త ట్విస్ట్ ఒకటి చోటు చేసుకుంది. ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విషయంలో అమలు లో ఉన్న అధికారులు ఐఏఎస్ లను మొత్తం పన్నెండు మంది దాకా విచారించాలని కోరుతూ న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

నిజానికి ఈ విషయంలో టీడీపీ ఇప్పటికే ఆరోపణలు చేస్తూ వచ్చింది. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ముందు నాటి అధికారులను అరెస్ట్ చేయాలి కదా అని లోకేష్ సైతం అన్నారు. అందులో కొందరు ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. దాంతోనే వారిని తప్పించారు అని కూడా టీడీపీ ఆరోపణలు చేసింది.

ఇదిలా ఉంటే ఇపుడు బాబు బెయిల్ మీదకు వచ్చారు. దాంతో ఇపుడు స్కిల్ కేసులో కొత్త కోణాన్ని ఆవిష్కరించాలని న్యాయవాది హోదాలో ప్రసాద్ అనే వ్యక్తి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇది జస్ట్ లాంచనం మాత్రమే అని అంటున్నారు. ఎందుకంటే సీఐడీ కనుక దీని మీద యాక్షన్ కి దిగకపోతే అపుడు కోర్టుకు కూడా వెళ్తారు అని అంటున్నారు.

అంటే స్కిల్ కేసును అటు తిప్పు ఇటు తిప్పి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారి మీదకు తేవాలన్నది ఒక ఉద్దేశ్యంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నాడు ఐఏఎస్ లుగా కీలకంగా ఉన్న వారు ఎవరంటే సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు పర్యవేక్షణ కమిటీలలో కీలకంగా వ్యవహరించిన వారు అని న్యాయవాది ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీన్ని బట్టి చూస్తే కనుక అజయ్ కల్లాం రెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతికా శుక్లా, అర్జున్ శ్రీకాంత్, జయలక్ష్మిలని విచారించాలని న్యాయవాది ఫిర్యాదులో కోరారు.

అంతే కాదు ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్న కొండూరు అజయ్ రెడ్డి, అప్పటి సీఎండీ బంగారురాజులతో పాటు, కార్పోరేషన్ లోని సీఎఫ్ఓ, సీఈఓ, ఈడీలను విచారించాలని కూడా ఆయన కోరారు. ఇక వీరే కాదు కాంట్రాక్ట్ చెక్ పవర్ తో సంబంధం ఉన్న వివిధ స్థాయిలలో ఉన్న అధికారులను విచారించాలని కూడా కోరారు. దీనిని బట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసు లో లోతులు చూడాలన్నదే ఈ ఫిర్యాదు సారాంశం అంటున్నారు. మరి సీఐడీ ఎలా దీని మీద రియాక్ట్ అవుతుందో మరి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు కూడా బయటకు వస్తారా అన్నది చూడాల్సి ఉంది.