Begin typing your search above and press return to search.

ఉద్యోగుల పీఎఫ్‌.. కొత్త నిబంధనల గురించి తెలుసా?

ఉద్యోగుల భవిష్య నిధి (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) చందాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ఈపీఎఫ్‌వో ప్రవేశపెడుతోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 11:30 PM GMT
ఉద్యోగుల పీఎఫ్‌.. కొత్త నిబంధనల గురించి తెలుసా?
X

ఉద్యోగుల భవిష్య నిధి (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) చందాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ఈపీఎఫ్‌వో ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను వేగంగా సరిచేసేందుకు అవకాశం ఉంటుంది.

ఈ మేరకు.. డేటా బేస్‌ లో ఉన్న పీఎఫ్‌ చందాదారుడి వివరాలు, ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఉన్న వివరాలు సరిపోకపోతే పీఎఫ్‌ క్లైయిమ్‌ చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేరు, తండ్రి పేరు, నామినీ వంటి విషయాల్లో ప్రధానంగా సమస్యలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా దరఖాస్తు కేటగిరీ ఆధారంగా చిన్న సవరణల్ని వారం రోజుల్లో పరిష్కరించాలని ఈపీఎఫ్‌వో గడువు విధించింది. అదేవిధంగా పెద్ద సవరణల్ని 15 రోజుల్లోగా పరిష్కరించాలని సూచించింది. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన మార్గదర్శకాలను ఈపీఎఫ్‌వోకు అమలు చేస్తూ ఈ–కేవైసీని అందుబాటులోకి తీసుకువచ్చింది.

అలాగే చందాదారుడు కూడా వ్యక్తిగత వివరాలను ఒకటి కన్నా ఎక్కువసార్లు మార్చడానికి వీల్లేకుండా నిబంధనలు విధించింది. వ్యక్తిగత వివరాల్లో సవరణల పేరిట అక్రమాలను నియంత్రించేందుకు ఈ కొత్త విధానాన్ని ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తెచ్చింది.

ఈపీఎఫ్‌ ఖాతాలో వ్యక్తిగత వివరాల సవరణ కోసం చందాదారులు ప్రతిరోజూ ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మొదటిసారి అప్లై చేసుకునేప్పుడు దరఖాస్తుల్లోని వివరాలు డేటాబేస్‌ లో సరిగా నమోదు చేయకపోవడం, ప్రస్తుతం యూఏఎన్‌ లోని వివరాలు సరిపోలకపోవడంతో పీఎఫ్‌ క్లెయిమ్‌లు తిరస్కారానికి గురవుతున్నాయి.

ఇలా డేటాబేస్‌ లో తప్పులు ఉండటంతో పీఎఫ్‌ ఖాతా నుంచి నగదు తీసుకోవాలన్నా, పదవీ విరమణ తరువాత నగదు డ్రా చేయాలన్నా, చివరకు పింఛను కోసం దరఖాస్తు చేయాలన్నా ఏదో ఒక కారణంతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తమ వ్యక్తిగత వివరాల సవరణ కోసం ఉద్యోగులు సంబంధిత కంపెనీ యజమానితో సంతకం చేయించి.. ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులపై ఈపీఎఫ్‌వో వెంటనే చర్యలు తీసుకోవడం లేదు. దరఖాస్తుల పరిష్కారానికి కచ్చితమైన గడువు లేకపోవడంతో చందాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి కొత్త విధానాన్ని ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త విధానంలో చందాదారుల పేరు, స్త్రీ/పురుషుడు, పుట్టిన తేదీ, తండ్రి/తల్లి పేరు, బంధుత్వం, వివాహ స్థితి, చందాదారులుగా చేరిన తేదీ, ఉద్యోగం వదిలిపెట్టడానికి కారణం, ఉద్యోగం వదిలిపెట్టిన తేదీ, జాతీయత, ఆధార్‌ నంబరు మార్చుకునేందుకు వీలు కల్పించారు. వివాహ స్థితిని మాత్రమే రెండుసార్లు సవరణ చేసుకోవచ్చు. మిగతా అంశాలన్నీ ఒకసారి మాత్రమే సవరిస్తారు.

కాగా చిన్న సవరణల ఆధారాలకు రెండు ధ్రువీకరణ పత్రాలు, పెద్ద సవరణలకు మూడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈపీఎఫ్‌వో యూనిఫైడ్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసినప్పుడు ఆ దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి.

కాగా తాము చేసిన వ్యక్తిగత వివరాల సవరణల్ని అధికారులు సకాలంలో ఆమోదించకుంటే చందాదారులు ఈపీఎఫ్‌ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.