Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు కొత్త కష్టం.. నిమజ్జనానికి రారు.. తలంబ్రాలు తీసుకెళ్లరు

వినాయక నిమజ్జనానికి ఎందుకు హాజరు కారు? అని ప్రశ్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 8:39 AM GMT
కేసీఆర్ కు కొత్త కష్టం.. నిమజ్జనానికి రారు.. తలంబ్రాలు తీసుకెళ్లరు
X

అసలే ఎన్నికల కాలం. ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదిలి పెట్టే పరిస్థితి ఉండదు. చిన్నదే కదా అని ఊరుకుంటే.. అది కాస్తా ఎక్కడికో వెళ్లి ఆగుతుంది. హిందూగాళ్లు.. బొందుగాళ్లు అంటూ కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాట.. ఏ సందర్భంలో ఆయన అన్నది.. ఎవరిని ఉద్దేశించిందన్న విషయం పక్కకు వెళ్లిపోయి.. హిందువులను కేసీఆర్ అంత మాట అనేస్తారా? అన్నదే ప్రముఖంగా మారటం.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ మాట ప్రత్యర్థులకు ఒక పెద్ద ప్రచారాస్త్రంగా మారటమే కాదు.. ఫలితాన్ని ప్రభావితం చేసిందని చెబుతారు.

మరో వారం.. పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవుతుందున్న చర్చ జోరుగా సాగుతున్న వేళలో.. సీఎం సారు మీద కొత్త చర్చ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా సాగుతోంది. ఈ రోజు హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న నిమజ్జనాన్ని పురస్కరించుకొని.. ముఖ్యమంత్రి కేసీఆర్ శోభాయాత్రకు ఎందుకు హాజరు కారు? అన్న ప్రశ్నను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా కొందరు లేవనెత్తుతున్న ప్రశ్నలు.. ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి.

ప్రతి ఏడాది రంజాన్.. క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాటు చేసే కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే ముఖ్యమంత్రి కేసీఆర్.. వినాయక నిమజ్జనానికి ఎందుకు హాజరు కారు? అని ప్రశ్నిస్తున్నారు.

దీనికి అదనంగా మరో క్వశ్చన్ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిపే వివాహమహోత్సవానికి నాటి ముఖ్యమంత్రులంతా హాజరు కావటం.. ముత్యాల తలంబ్రాలు నెత్తిన పెట్టుకొని రావటం క్రమం తప్పకుండా సాగేది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మాత్రం రామనవమి రోజు భద్రాచలానికి వెళ్లకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. విడిరోజుల్లో ఇలాంటి చర్చతో జరిగే నష్టంతో పోలిస్తే.. కీలకమైన ఎన్నికల సందర్భంగా జరుగుతున్న చర్చతోనే డ్యామేజ్ ఎక్కువన్న వాదన వినిపిస్తోంది. మరి.. ఇలాంటి వాటి విషయంలో కేసీఆర్ సారు.. నష్టనివారణ చర్యలు ఏ రీతిలో చేపడతారో చూడాలి.