Begin typing your search above and press return to search.

గోస పడితే పడ్డాం.. తెలంగాణ ఇచ్చిందిగా సారూ?

అయితే.. అలాంటి పరిస్థితే ఎల్లకాలం ఉంటుందని అనుకుంటే అత్యాశే అవుతుంది. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ అధికార గులాబీ బ్యాచ్ కు ఎదురవుతోంది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 10:12 AM IST
గోస పడితే పడ్డాం.. తెలంగాణ ఇచ్చిందిగా సారూ?
X

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లుగా.. అన్ని బాగున్న వేళ అంతా బాగా ఉన్నట్లు కనిపించటమే కాదు.. మాట్లాడే ప్రతి మాటకు ప్రజల నుంచి మద్దతు అదే స్థాయిలో లభిస్తూ ఉంటుంది. అయితే.. అలాంటి పరిస్థితే ఎల్లకాలం ఉంటుందని అనుకుంటే అత్యాశే అవుతుంది. తాజాగా అలాంటి పరిస్థితే తెలంగాణ అధికార గులాబీ బ్యాచ్ కు ఎదురవుతోంది. మొన్నటివరకు పార్టీకి బలంగా ఉన్న అంశాలే ఇప్పుడు బలహీనంగా మారటం ఇబ్బందికరంగా మారుతోంది.

గతంలో గులాబీ బాస్ మాటల్లో విరుపు.. మెరుపు.. పదును.. ఇప్పుడు పెద్దగా ఉండట్లేదన్నట్లుగా ఉంది. దీనికి తోడు.. అలవాటైన పాత పాటల్నే పాడటం పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండట్లేదని చెబుతున్నారు. అవసరానికి అనుగుణంగా.. టార్గెట్ చేస్తూ..విపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్ మాటల తీరు తెలంగాణ ప్రజలకు అలవాటుగా మారటం పార్టీకి శాపంగా మారతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రత్యర్థి ఎవరన్న విషయాన్ని తేల్చే విషయంలో అనుసరించిన వైఖరి మొన్నటి వరకు అద్భుతమని పొగిడినోళ్లే.. ఈ రోజున తప్పు పడుతున్నారు. గోడ మీద పిల్లి వాటంగా ప్రజలు అనుకుంటున్నారని.. దీనికి తోడు బీజేపీతో బీఆర్ఎస్ మధ్యనున్న రహస్య సంబంధంపై ప్రశ్నలు ఎదురవుతున్నట్లుగా వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ మీద గులాబీ బాస్ చేస్తున్న విమర్శలు.. ఆరోపణలపైనా గతానికి భిన్నంగా అనూహ్య కౌంటర్లు వస్తున్నట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ తో 58 ఏళ్లు గోసపడ్డామని.. మళ్లీ కాంగ్రెస్ చేతికి అధికారం వస్తే ఆగమాగం కావటం ఖాయమని గులాబీ బాస్ పదే పదే చెప్పటాన్ని తప్పు పడుతున్నారు. గోస పెట్టినట్లుగా చెబుతున్న కాంగ్రెస్సే కదా తెలంగాణ ఇచ్చింది? దశాబ్దాల పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు భిన్నంగా సోనియా చెప్పినట్లే తెలంగాణ ఇచ్చింది కదా? అయినా.. అదే పనిగా టార్గెట్ ఎందుకు చేస్తారు? అన్న తరహా మాటలకు గులాబీ నేతలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదన్న మాట వినిపిస్తోంది.

దీనికి తోడు.. గడిచిన పదేళ్లుగా చెప్పిన మాటల్నే చెబుతూ.. తనను తాను పొగుడుకుంటూ చేస్తున్న కేసీఆర్ మాటలు.. ప్రజలకు చేదుగా మారాయన్న వాదన వినిపిస్తోంది. తాజాగా గుండ్ల పోచంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ''నేను నాడు రాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించినప్పుడు అంతా నవ్వారు. తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇతర నాయకులు నేను పోరాటం చేస్తుంటే కనీసం కలిసిరాకపోగా.. అవహేళన చేశారు. ప్రజల్ని చైతన్యం చేస్తూ పోరాటం చేసి రాష్ట్రం సాధించాం. వచ్చిన తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ పోతున్నామో మీకు తెలుసు' లాంటి మాటలు చప్పగానే కాదు.. పలు ప్రశ్నల్ని లేవనెత్తేలా మారుతున్నాయి.

ఉద్యమంలో పార్టీలు కలిసి రాకుంటే.. ఉద్యమ మలిదశలో పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటు చేస్తే.. అన్ని పార్టీలు వచ్చి చేరాయి కదా? అలాంటప్పుడు విపక్షాల పాత్ర ఏమీ లేనట్లు ఎలా మాట్లాడుతున్నారు? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అంతేకాదు.. ఎంతసేపు 'నేను' అంటున్న కేసీఆర్.. ఉద్యమం వేళ వెయ్యికి పైగా అమరవీరులు ప్రాణాల్ని త్యాగం చేస్తేనే తెలంగాణ వచ్చిన విషయాన్ని కేసీఆర్ కనీసం ప్రస్తావించకపోవటాన్నిప్రశ్నిస్తున్నారు. ఇలా.. గతంలో ఏ సెంటిమెంట్ అయితే గులాబీ బాస్ కు అండగా నిలిచిందో.. అదే ఇప్పుడు గుదిబండగా మారిందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.