Begin typing your search above and press return to search.

జైలు బాత్రూమ్ రంధ్రం ద్వారా పరారైన 10మంది ఖైదీలు

అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ సిటీ జైలులోసంచలనం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పది మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు.

By:  Tupaki Desk   |   7 Jun 2025 6:00 AM IST
జైలు బాత్రూమ్ రంధ్రం ద్వారా పరారైన 10మంది ఖైదీలు
X

అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ సిటీ జైలులోసంచలనం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పది మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. ఈ ఘటన మే 15న జరిగింది. పారిపోయిన వారిలో కొందరు హంతకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన జైలు భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.

జైలు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, మే 15న రాత్రి వేళ ఈ పది మంది ఖైదీలు జైలులోని మొదటి అంతస్తులో ఉన్న తమ సెల్ తలుపును తెరిచారు. ఇది ఎలా సాధ్యమైంది అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.. కానీ వారు ఏదైనా సాధనంతో తలుపు విరగొట్టి, తెరవడం జరిగిందని భావిస్తున్నారు. అక్కడి నుంచి వారు మరింత ఆశ్చర్యకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. సెల్ లోపల ఉండే మెటల్ బాత్రూమ్ వెనుక భాగంలో ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా బయటకు పరారయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు, అది కూడా జైలులోని అత్యంత చిన్న ప్రాంతం నుంచి ఇలా పారిపోవడం భద్రతా లోపాన్ని సూచిస్తోంది.

పారిపోయిన పది మంది ఖైదీలలో కొందరు తీవ్రమైన నేరాలకు పాల్పడిన హంతకులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ఇది న్యూ ఓర్లీన్స్ నగరంలో ప్రజల భద్రతపై ఆందోళనలను పెంచుతోంది. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న దృశ్యాలున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో జైలు సిబ్బంది నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

జైలు సిబ్బంది ప్రమేయంపై అనుమానాలు

ఇంత పెద్ద ఎత్తున, ఇంత సులభంగా ఖైదీలు పారిపోవడం వెనుక జైలు సిబ్బంది సహకారం ఉండి ఉంటుందని లేదా వారి నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. అంతర్గత భద్రతా వ్యవస్థలు సరిగా లేవా, పర్యవేక్షణ లోపించిందా, లేక సిబ్బందికి నేరగాళ్లతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. న్యూ ఓర్లీన్స్ నగర అధికారులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పారిపోయిన ఖైదీలను త్వరగా పట్టుకోవడానికి స్థానిక పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ ఘటన అమెరికా జైళ్ల భద్రతా ప్రమాణాలపై కూడా చర్చకు దారి తీస్తోంది.