Begin typing your search above and press return to search.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త సౌకర్యం.. పార్కింగ్ లోనే లగేజ్ చెక్ ఇన్

కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యంలో భాగంగా.. కారు పార్కింగ్ ప్లేస్ లోనే బ్యాగేజ్ డ్రాప్.. బోర్డింగ్ పాస్ పొందేలా సౌకర్యాల్ని తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   2 Jan 2024 4:48 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కొత్త సౌకర్యం.. పార్కింగ్ లోనే లగేజ్ చెక్ ఇన్
X

పెరిగిన రద్దీ వేళల్లో.. లగేజ్ చెక్ ఇన్ చేసుకోవటానికి గంటల కొద్దీ క్యూలో వెయిట్ చేయాల్సి రావటం.. ముందుగా వెళ్లాల్సిన పరిస్థితి. నిజానికి చాలా సందర్భాల్లో ఫ్లైట్ ట్రావెల్ టైం కంటే కూడా ఎయిర్ పోర్టులో వెయిట్ చేసే టైం ఎక్కువగా ఉంటుందన్నది తెలిసిందే. అందునా ప్రయాణికుల రద్దీ పెరిగిన వేళ.. లగేజ్ ఎక్కువగా ఉండే వారు టెన్షన్.. టెన్షన్ గా ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా శంషాబాద్ ఎయిర్ పోర్టులో సరికొత్త సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త సంవత్సరం తొలి రోజు నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యంలో భాగంగా.. కారు పార్కింగ్ ప్లేస్ లోనే బ్యాగేజ్ డ్రాప్.. బోర్డింగ్ పాస్ పొందేలా సౌకర్యాల్ని తీసుకొచ్చారు.

ఫ్లైట్ జర్నీ అంటే.. బ్యాగేజ్ చెక్ ఇన్.. సెక్యూరిటీ చెకింగ్ లకు పట్టే సమయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి వాటికి చెక్ పెట్టేలా శంషాబాద్ ఎయిర్ పోర్టు కారు పార్కింగ్ ప్లేస్ లోనే ‘సిటీ సైడ్ సెల్ఫ్ చెక్ ఇన్’ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సౌకర్యంతో ప్రయాణికులు తాము వెళ్లాల్సిన టెర్మినల్ కు వేగంగా వెళ్లే అవకాశం ఇస్తుందని చెబుతున్నారు.

ప్రయాణికులు తమ వాహనాల్ని పార్కింగ్ చేసే చోటే.. సెల్ప్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. బ్యాగేజీ తనిఖీని పూర్తి చేసుకోవచ్చు. అక్కడే బోర్డింగ్ పాసుల్ని తీసుకునే వీలుంది. దీంతో బ్యాగేజీతో వెళ్లే ప్రయాణికుల సమయం చాలా వరకు ఆదా అవుతుంది. ఫ్లైట్ బయలుదేరటానికి ఆరు గంటల ముందు నుంచి ఒక విమాన షెడ్యూల్ సమయానికి గంటముందు వరకు ఈ సౌకర్యాన్ని అందుకునే వీలుంది.

బ్యాగేజీ చెక్ ఇన్ కోసం ఆయా విమానయాన సంస్థల లగేజ్ డ్రాప్ కౌంటర్లను ఏరపాటు చేస్తున్నారు. ఈ వసతి ద్వారా ఎయిర్ పోర్టు లోపల కౌంటర్లలో రద్దీ తగ్గుతుందని ఆశిస్తున్నారు. సెల్ఫ్ చెక్ ఇన్ ద్వారా ట్యాగులు పొందే వీలుంది. వాటితో లగేజ్ ను పంపే వీలుంది. కొత్తగా ఏర్పాటు చేసిన కియోస్క్ ల ద్వారా సెల్ఫ్ చెక్ ఇన్ కు వీలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. సో.. లగేజ్ చెక్ ఇన్ కోసంగతంలో మాదిరి హైరానా పడాల్సిన అవసరం ఉండదనే చెప్పాలి.