Begin typing your search above and press return to search.

వారానికి 4 రోజులే ఉద్యోగం.. జర్మన్ కంపెనీల కొత్త ప్రయోగం షురూ!

యూరప్ లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజులే ఉద్యోగమన్న కాన్సెప్టుకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది

By:  Tupaki Desk   |   30 Jan 2024 10:30 AM GMT
వారానికి 4 రోజులే ఉద్యోగం.. జర్మన్ కంపెనీల కొత్త ప్రయోగం షురూ!
X

ఏం చేసినా సరే చివరకు.. తాము పని చేయించుకుంటున్న ఉద్యోగుల నుంచి మరింత మెరుగైన ఫలితాన్ని పిండటానికి అవసరమైన మార్గాల్ని వెతికే కంపెనీలు ఇప్పుడు వారానికి నాలుగు రోజుల పని అనే అంశం మీద ఫోకస్ చేస్తున్నారు. వారానికి 4 రోజులకు ఉద్యోగాన్ని తగ్గించటం ద్వారా ఉద్యోగుల పని తీరు మెరుగైందని.. వారి మీద ఒత్తిడి శాతం తగ్గిందని.. ఉత్పాదకతలో మార్పు వస్తుందన్న వాదనలో పస తేల్చేందుకు కొన్ని జర్మన్ కంపెనీలు ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ప్రయోగానికి తెర తీయటం ఆసక్తికరంగా మారింది.

యూరప్ లోని కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజులే ఉద్యోగమన్న కాన్సెప్టుకు ఇప్పుడు ఆదరణ పెరుగుతోంది. తాజాగా దీని బాటలో నడిచేందుకు కొన్ని జర్మన్ కంపెనీలు రెఢీ అయ్యాయి. వారానికి నాలుగు రోజులు అంటే.. నెలలో పదహారు రోజులే పని చేసినా.. మొత్తం జీతాన్ని ఇచ్చేస్తారు. కాకుంటే.. వారి పని తీరు మెరుగ్గా ఉండటంతో పాటు.. ఉత్పాదకతలోనూ మార్పు రావాల్సి ఉంటుంది. పని ఫలితం గతంలో మాదిరి కానీ అంతకు మించినట్లుగా ఉండాలి.

ఇలాంటి పని తీరుతో ఒత్తిడి.. అనారోగ్య సమస్యలు తగ్గటం.. సెలవులు తీసుకునే తీరులోనూ మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. తాజాగా మొదలయ్యే ఈ అధ్యయనాన్ని నాలుగు నెలలు పాటు సాగిస్తారు. జర్మనీలోని 45 కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. న్యూజిలాండ్ కు చెందిన 4 డే వీక్ గ్లోబల్ అనే ఎన్జీవో ఈ పైలెట్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుంది. ఈ తరహా ప్రయోగాన్ని గతంలో అమెరికా.. కెనడా.. బ్రిటన్.. పోర్చుగల్ దేశాల్లో నిర్వహించారు. వారానికి నాలుగు రోజులు పని చేసే ప్రయోగంలో భాగస్వామ్యులైన వారి మానసిక.. శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగైనట్లుగా గుర్తించారు. జర్మనీలోనూ ఇలాంటి ఫలితాలే రావొచ్చన్న వాదన వినిపిస్తోంది.

వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ అన్న ప్రయోగాన్ని బెల్జియం కూడా చేపట్టింది. జపాన్ కంపెనీలు కూడా ఇదే విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ విధానం వల్ల పార్టుటైం జాబ్ చేసే వారిపై తీవ్ర ప్రభావం పడుతుందని.. జర్మనీలో ఇలాంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే.. వారానికి నాలుగు రోజులే ఉద్యోగమన్న కాన్సెప్టును జర్మనీ ఆర్థిక శాఖ సైతం వ్యతిరేకిస్తోంది. ఇది తమ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే..కార్మిక సంఘాలు మాత్రం వారానికి నాలుగు రోజుల పని విధానానికి ఆసక్తి చూపుతున్నారు. మరి.. ప్రయోగ ఫలితం ఎలా ఉండనుందన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.