Begin typing your search above and press return to search.

కొత్త ప్రచారం షురూ.. పోటీకి సిట్టింగ్ఎంపీలు నో?

సీట్ల కేటాయింపు పక్కాగా పని తీరు ఆధారమే తప్పించి.. మొహమాటాల కోసం కాదన్న విషయంపై జగన్ ఇప్పటికే పలు మార్లు తేల్చేయటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Nov 2023 3:30 AM GMT
కొత్త ప్రచారం షురూ.. పోటీకి సిట్టింగ్ఎంపీలు నో?
X

ఎప్పటికప్పుడు కొత్త ప్రచారాన్ని తెర మీదకు తీసుకురావటం.. ఆసక్తికర చర్చకు తెర తీయటం.. నెగిటివిటీని స్ప్రెడ్ చేసే విషయంలో సరికొత్త దారుల్ని తెరుస్తున్న వైనం ఏపీలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీ అధికార పక్షంపై తాజాగా మరో ప్రచారం మొదలైంది. మరో ఐదారునెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీస్థానాల్లోని అధికార పార్టీ ఎంపీలు పోటీకి సిద్దంగా లేరని.. తాము పోటీ చేయలేమని చెప్పుస్తున్నారన్నది సారాంశం.

దీంతో.. కొత్త వారిని వెతుక్కునే విషయంలో ఏపీ అధికార పక్షం బిజీగా ఉందన్న ప్రచారం మొదలైంది. అయితే.. కొత్త వారికి అవకాశం ఇస్తామని చెప్పినా.. తమకు వద్దంటే వద్దన్న రీతిలో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఈ వాదనను వైసీపీ వర్గీయులు కొట్టేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగనే సిట్టింగుల్లో పలువురికి సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఎంపీ స్థానాలే కాదు అసెంబ్లీ స్థానాల్లోనూ మార్పు దిశగా ఆయన కసరత్తు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సీట్ల కేటాయింపు పక్కాగా పని తీరు ఆధారమే తప్పించి.. మొహమాటాల కోసం కాదన్న విషయంపై జగన్ ఇప్పటికే పలు మార్లు తేల్చేయటం తెలిసిందే. అలాంటప్పుడు కొత్త ముఖాలు తెర మీదకు రావటం అనివార్యమన్న విషయాన్ని చెబుతున్నారు.

తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని చూస్తే.. వైసీపీ ప్రాధాన్యం ఇస్తున్న విశాఖలో 2019లో పార్టీ తరఫున గెలిచిన ఎంవీవీ సత్యనారాయణ వచ్చేఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పట్టుబట్టినట్లుగా చెబుతున్నారు. విశాఖ ఎంపీగా ఆయనకు బదులుగా విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అలాంటప్పుడు సిట్టింగ్ ఎంపీకి బదులుగా మరొకరు తెర మీదకు వచ్చారంటే.. టికెట్ల కోసం పోటీ ఉన్నట్లే కదా? అలాంటప్పుడు అభ్యర్ధులే లేరన్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదనటానికి ఇదో ఉదాహరణగా ప్రస్తావిస్తున్నారు.

శ్రీకాకుళంలో 2019లో ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను ఎంపీగా పోటీ చేయించటం తెలిసిందే. ఆ స్థానాన్ని చేజార్చుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించే ప్రయత్నం చేస్తోంది. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తాను అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. అందులో నిజం లేదని ఆయన మరోసారి ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. నెల్లూరుఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఫైనల్ చేసింది. దీంతో.. ఈ స్థానంలోనూ అభ్యర్థి పంచాయితీ లేదు.

రాజమహేంద్రవరం ఎంపీ రాజమహేంద్రవరం గ్రామీణ అసెంబ్లీ స్థానం నుంచి.. అనంతపురం ఎంపీని ఉరవకొండలో బరిలోకి దించేందుకు పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన సర్వేల్ని సైతం నిర్వహిస్తోంది. అభ్యర్థులే లేరన్న ప్రచారమే నిజమైతే.. ఇప్పుడున్న పరిస్థితి ఉండదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. నరసాపురం ఎంపీగా రఘురామ రెబల్ గా మారినంతనే.. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా గోకరాజు రంగరాజు (పెద్ద బుజ్జి)ని నియమించింది. ఆయనే వచ్చే ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ కు బదులుగా వేరే వారిని తీసుకురావాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. విజయవాడలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పి.వరప్రసాద్ కు బదులుగా బీసీ మంత్రిని నియమించేందుకు సిద్ధమవుతోంది.

ఒంగోలు ఎంపీస్థానానికి సిట్టింగ్ మాగుంటకు బదులుగా ఆయన కుమారుడు బరిలో నిలవనున్నారు.అయితే.. ఈ సీటును తను సొంతం చేసుకోవటానికి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు. మచిలీపట్నం.. కడప.. రాజంపేటకు సంబంధించి చూస్తే.. సిట్టింగ్ ఎంపీలే బరిలోకి దిగనున్నారు. నంద్యాలలో సిట్టింగ్ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డే పోటీ చేయనున్నారు.

ఇలా అత్యధిక నియోజకవర్గాల్లో సిట్టింగులే ఉన్న నేపథ్యంలో..ఇప్పుడు మొదలైన ప్రచారం కేవలం మైండ్ గేమ్ గా అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంగా అరకు.. అనకాపల్లి.. కాకినాడ.. అమలాపురం.. బాపట్ల.. చిత్తూరు ఎంపీ స్థానాల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి పార్టీ ఇస్తున్న సమాధానం చూస్తే.. మంత్రుల్నే రెండున్నరేళ్ల తర్వాత నిర్మోహమాటంగా మార్చేసినప్పుడు.. ఎంపీ అభ్యర్థుల్ని ఎందుకు మార్చకూడదు? అని రివర్సులో ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల గోదాలో గెలుపే కీలకం. అలాంటప్పుడు ఎవరిని ఎప్పుడు.. ఎలా వినియోగించుకోవాలో పార్టీ అధినాయకత్వానికి క్లారిటీ ఉందని.. కావాలనే ఈ తరహా ప్రచారాన్ని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.