Begin typing your search above and press return to search.

అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్.. ప్రాణం పోసిన 108 సిబ్బంది

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలో నివసించే 23 ఏళ్ల సయ్యద్ జరీనాబేగం ఏడు నెలల గర్భిణి

By:  Tupaki Desk   |   3 Dec 2023 4:06 AM GMT
అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్.. ప్రాణం పోసిన 108 సిబ్బంది
X

కంటికి కనిపించని దేవుళ్లు ఎక్కడ ఉంటారో కానీ.. కళ్ల ముందే ఉండి.. అపాయంలో ఉన్న వేళ పోయే ప్రాణాల్ని పోకుండా ఆపే దైవ ప్రతిరూపాల మాదిరి వ్యవహరిస్తుంటారు 108 సిబ్బంది. అత్యవసర సేవల కోసం అంబులెన్సు సర్వీసు నిర్వహించే వీరి.. ప్రాథమిక వైద్యాన్ని చేస్తుంటారు. అత్యవసర సమయాల్లో వీరు చేసే సాయం పోయే ప్రాణాల్ని పోకుండా నిలపుతుంది. తాజాగా అలాంటి పనే చేసి.. అప్పుడే పుట్టిన శిశువుకు ప్రాణాలు పోశారు. నెలలు నిండకుండా నొప్పులు వచ్చిన గర్భిణికి పురుడు పోయటమే కాదు.. అప్పుడే పుట్టిన శిశువుకు సీపీఆర్ చేసి ప్రాణాల్ని నిలబెట్టారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలో నివసించే 23 ఏళ్ల సయ్యద్ జరీనాబేగం ఏడు నెలల గర్భిణి. శనివారం ఆమె ఇంట్లో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జరి కిందపడ్డారు. దీంతో.. పొట్టకు మెట్లు బలంగా తగలటంతో తీవ్రంగా నొప్పి వచ్చింది. వెంటనే.. ఆమె కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. వెంటనే.. ఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. బాధితురాలిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు నొప్పులు ఎక్కువ అయ్యాయి.

దీంతో.. పరిస్థితిని ఆసుపత్రిలో ఉన్న వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ కు వివరించగా.. ఆయన సూచనలతో 108 సిబ్బంది ఆమెకు అత్యవసర చికిత్సను అందించారు. అతి కష్టం మీద ఆమెకు నార్మల్ డెలివరీఅయ్యేలా చేయటంతో పాటు.. తల్లీ బిడ్డ ప్రాణాల్ని కాపాడారు. అయితే.. నెలలు పూర్తిగా నిండకుండానే పుట్టిన శిశువుకు వెంటనే సీపీఆర్ చేసి.. శ్వాస పీల్చుకునేలా చేశారు. అయితే.. ఆ శిశువు శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటంతో ఆక్సిజన్ ను పెట్టి.. ఇద్దరినీ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం వారిద్దరు ఆరోగ్యంగానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో 108 అంబులెన్స్ ఈఎంటీ రవి.. పైలెట్ ఆంజేయులు సమయానికి అనుగుణంగా వ్యవహరించి.. తల్లీబిడ్డ ప్రాణాల్ని కాపాడారని మాత్రం చెప్పక తప్పదు.