ఆసుపత్రిలో దారుణం..మొబైల్ మాట్లాడుతూ పసికందు వేలు కట్ చేసిన నర్స్
కర్ణాటకలోని వెల్లూరులో ఓ షాకింగ్ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్స్ నిర్లక్ష్యం వల్ల ఒక నవజాత శిశువు వేలు కట్ అయిపోయింది.
By: Tupaki Desk | 2 Jun 2025 5:00 PM ISTకర్ణాటకలోని వెల్లూరులో ఓ షాకింగ్ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్స్ నిర్లక్ష్యం వల్ల ఒక నవజాత శిశువు వేలు కట్ అయిపోయింది. ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ పని చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. టేప్‌ను కత్తిరించాల్సింది పోయి, నర్సు పొరపాటున పసికందు వేలునే కత్తిరించిందని చెబుతున్నారు.. ఈ సంఘటన తర్వాత, శిశువు తండ్రిని దాదాపు గంటన్నర పాటు బిడ్డను కలవడానికి కూడా అనుమతించలేదు.
ఈ దారుణమైన ఘటన మే 24న ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. మల్లిపాళయం నివాసి విమల్ రాజ్ తన భార్య నివేదను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో నివేద ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బిడ్డ కొంచెం బలహీనంగా ఉండటం, శరీరంలో షుగర్ లెవల్ తక్కువగా ఉండడంతో డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కించమని చెప్పారు. ఒక నర్సు ఆ నవజాత శిశువుకు గ్లూకోజ్ ఎక్కిస్తోంది.
గ్లూకోజ్ ఎక్కిస్తున్న సమయంలో, నర్సు నవజాత శిశువు చేతి నుంచి సూదిని తీస్తోంది. ఆ సూదిపై అంటించిన టేప్‌ను తొలగించడానికి నర్సు కత్తెరను ఉపయోగిస్తోంది. సరిగ్గా అదే సమయంలో.. టేప్‌ను కత్తిరించాల్సిన బదులు, పొరపాటున బిడ్డ వేలునే కట్ చేసింది. ఈ సంఘటన జరిగినప్పుడు నర్సు ఫోన్‌లో మాట్లాడుతూ.. ఆమె దృష్టి ఆ ఫోన్‌పైనే ఉందని తండ్రి విమల్ రాజ్ ఆరోపించాడు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే టేప్ బదులు బిడ్డ వేలు కోసిందని ఆయన అంటున్నారు.
బాధిత తండ్రి విమల్ రాజ్ మరో తీవ్రమైన ఆరోపణ చేశారు. బిడ్డకు ప్రమాదం జరిగిన తర్వాత, అతనిని దాదాపు గంటన్నర పాటు బిడ్డను కలవడానికి అనుమతించలేదని, బిడ్డను చూడకుండా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఆ తర్వాత, మెరుగైన చికిత్స కోసం బిడ్డను చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బిడ్డకు చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నారు.
ఈ ఘటన తర్వాత ఆసుపత్రిలో తీవ్ర కలకలం రేగింది. ఈ విషయం వెల్లూర్ జిల్లా కలెక్టర్ సుబ్బులక్ష్మి దృష్టికి వెళ్ళింది. ఆమె ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. నర్సు దోషిగా తేలితే, ఫోన్‌లో మాట్లాడిన విషయం నిజమని రుజువైతే, ఆ నర్సుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అంతేకాకుండా, గ్లూకోజ్ సూదిని తీయడానికి కత్తెర అవసరం లేదని, ఆ పనిని చేతితో కూడా చేయవచ్చని ఆమె స్పష్టం చేశారు.
