Begin typing your search above and press return to search.

నిజాయతీకి నిలువెత్తు రూపం: కారును ఢీకొట్టి మనసులు గెలిచిన బస్సు డ్రైవర్.. సాక్ష్యంగా నిలిచిన మరో వ్యక్తి

ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అక్కడి ప్రజల సంస్కారానికి నీరాజనాలు పలుకుతున్నారు.

By:  A.N.Kumar   |   29 Jun 2026 4:22 PM IST
నిజాయతీకి నిలువెత్తు రూపం: కారును ఢీకొట్టి మనసులు గెలిచిన బస్సు డ్రైవర్.. సాక్ష్యంగా నిలిచిన మరో వ్యక్తి
X

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రోడ్డు ప్రమాదాలు జరగడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు బాధ్యతగా వ్యవహరించడం కంటే.. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూసేవారే ఎక్కువ. పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో కళ్లముందే ప్రమాదం జరిగినా సాక్ష్యం చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రాని రోజులివి. అలాంటి ఈ కాలంలో మానవత్వానికి, నిజాయతీకి, సామాజిక విలువలకు అద్దం పట్టే ఒక అద్భుతమైన ఘటన న్యూజిలాండ్‌లో వెలుగుచూసింది. ఈ సంఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అక్కడి ప్రజల సంస్కారానికి నీరాజనాలు పలుకుతున్నారు.

అనుకోని ప్రమాదం.. అద్భుతమైన బాధ్యత

న్యూజిలాండ్‌లో ఒక బస్సు డ్రైవర్ తన వాహనాన్ని పార్కింగ్ ప్రాంతంలో వెనక్కి తీస్తుండగా అక్కడ నిలిపి ఉంచిన ఒక కారును అనుకోకుండా ఢీకొట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో ఎవరూ లేరు. చుట్టుపక్కల కూడా ఎవరూ గమనించని పరిస్థితి. డ్రైవర్ అనుకుంటే ఎవరికీ తెలియకుండా అక్కడి నుంచి చాలా సులువుగా పరారు కావచ్చు. కానీ ఆ బస్సు డ్రైవర్ తన అంతరాత్మను చంపుకోలేదు. తప్పు తన వైపు ఉందనే విషయాన్ని గ్రహించి, బాధ్యతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.

వెంటనే ఒక కాగితంపై.. "మీ కారుకు నా వల్ల నష్టం జరిగింది, నన్ను క్షమించండి. నా వివరాలు ఇవిగో" అని రాస్తూ తన పేరు, ఫోన్ నంబర్‌తో పాటు ఇతర సంప్రదింపు వివరాలను అందులో నమోదు చేశాడు. ఆ లేఖను సదరు కారు విండ్‌షీల్డ్‌పై భద్రంగా ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఊహించని మలుపు.. మరింత గొప్పగా మరో వ్యక్తి

ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ ప్రమాదాన్ని రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తి ప్రత్యక్షంగా చూశాడు. బస్సు డ్రైవర్ చూపిన నిజాయతీ అతడిని ఎంతగానో కదిలించింది. డ్రైవర్‌కు అండగా నిలవాలని భావించిన ఆ అపరిచిత వ్యక్తి, తను కూడా ఒక లేఖ రాసి ఆ కారుపై ఉంచాడు. "ఈ ప్రమాదం ఎలా జరిగిందో నేను కళ్లారా చూశాను. బస్సు డ్రైవర్ ఎంతో నిజాయతీగా తన వివరాలను ఇక్కడ వదిలి వెళ్లారు. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసమో లేదా ఇతర కారణాల చేతనో సాక్ష్యం అవసరమైతే, నేను సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవిగో నా వివరాలు" అని అందులో పేర్కొన్నాడు. తమకు సంబంధం లేకపోయినా ఒక మంచి పనికి మద్దతుగా నిలవాలనే ఆ వ్యక్తి ఆలోచన డ్రైవర్ చేసిన పని కంటే మరింత గొప్పదని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్.. భారతీయుడి పోస్ట్

న్యూజిలాండ్‌లో ఉన్నత చదువులు చదువుకుంటున్న ఒక భారతీయ విద్యార్థి కారుపై ఉన్న ఈ రెండు లేఖలను గమనించాడు. సమాజంలో ఇంకా ఇంతటి మానవత్వం, నిజాయతీ బతికే ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ ఆ లేఖలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ చిన్న ఘటన మనుషులపై, సమాజంపై తనకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని మరింత పెంచిందని ఆ విద్యార్థి ఆనందం వ్యక్తం చేశాడు.

నెటిజన్ల ప్రశంసల జల్లు

ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. బస్సు డ్రైవర్ నిజాయతీని, అతనికి తోడుగా నిలిచిన సాక్ష్యుడి బాధ్యతాయుత ప్రవర్తనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చట్టాలు, శిక్షల కంటే మనుషుల్లో వ్యక్తిగత బాధ్యత, సామాజిక విలువలు బలంగా ఉంటే సమాజం ఎంత అందంగా మారుతుందో చెప్పడానికి ఈ చిన్న ఘటనే ఒక ఉదాహరణ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పు చేయడం మానవ సహజమే అయినా దాన్ని ఒప్పుకునే ధైర్యం, బాధ్యత తీసుకోవడం, అవసరమైనప్పుడు తోటివారికి సాయం చేయడం వంటి గుణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి.