న్యూజిలాండ్ పార్లమెంట్‌లో వింత రూల్.. చట్టాలు చేసేది మనుషులు కాదు.. ఆ డబ్బానే!
ఒక దేశ పార్లమెంట్‌లో ఏ చట్టంపై చర్చ జరపాలో మంత్రులు, ఎంపీలు కూర్చుని నిర్ణయించుకోరు. బదులుగా, ఒక బిస్కెట్ డబ్బాలోంచి తీసిన కాగితం చీటీని బట్టి నిర్ణయిస్తారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ?
By: Tupaki Desk | 24 May 2025 11:00 AM ISTఒక దేశ పార్లమెంట్‌లో ఏ చట్టంపై చర్చ జరపాలో మంత్రులు, ఎంపీలు కూర్చుని నిర్ణయించుకోరు. బదులుగా, ఒక బిస్కెట్ డబ్బాలోంచి తీసిన కాగితం చీటీని బట్టి నిర్ణయిస్తారు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ? కానీ, న్యూజిలాండ్ పార్లమెంట్‌లో దశాబ్దాలుగా ఇదే ఆచారం నడుస్తోంది.
న్యూజిలాండ్ పార్లమెంట్‌లో ఏదైనా బిల్లుపై చర్చ జరపాల్సిన సమయం వచ్చినప్పుడు, ఒక ప్రత్యేకమైన బిస్కెట్ డబ్బాను బయటకు తీస్తారు. దీన్ని అద్దాల కిటికీల లోపల భద్రంగా దాచి ఉంచుతారు. అప్పుడు మంత్రి పదవిలో లేని పార్లమెంట్ సభ్యులు (క్యాబినెట్‌లో లేని ఎంపీలు) తమ ప్రతిపాదనలను చిన్న కాగితం ముక్కలపై రాసి, నంబర్లు వేసి ఆ డబ్బాలో వేస్తారు.
ఆ తర్వాత రాజకీయాల్లో లేని వ్యక్తులు అంటే యూనివర్సిటీ విద్యార్థులు లేదా ఆ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టూరిస్టులు ఆ డబ్బాలోంచి ఒక కాగితం చీటీని తీస్తారు. ఆ చీటీపై ఏ బిల్లు నంబర్ ఉంటే, పార్లమెంట్ ఆ బిల్లుపైనే చర్చిస్తుంది. సరిగ్గా ఒక లక్కీ డిప్ (అదృష్ట లాటరీ) లాగా ఈ ప్రక్రియ జరుగుతుంది.
ఎందుకు ఈ వింత ఆచారం?
ఈ 'బిస్కెట్ డబ్బా' ఆచారం చాలా మంచి ఉద్దేశ్యంతో మొదలైంది. ప్రతి పార్లమెంట్ సభ్యుడికి, వారు ఎంతగానో నమ్మే బిల్లులపై చర్చ జరపడానికి ఒక అవకాశం ఇవ్వాలి అనేది దీని వెనుక ఉన్న ఆలోచన. ప్రభుత్వం ప్రవేశపెట్టే చాలా ముఖ్యమైన చట్టాల బిల్లులు ఈ డబ్బా ద్వారా రావు. అవి నేరుగా ప్రభుత్వ ఎజెండాలో ఉంటాయి. కానీ, ప్రతి 15 రోజులకు ఒకసారి పార్లమెంట్ సమావేశమై ఈ డబ్బాలోంచి తీసిన బిల్లులపై ప్రత్యేకంగా చర్చిస్తుంది.
అత్యంత ముఖ్యమైన చట్టాలు కూడా ఈ వింత పద్ధతి ద్వారానే న్యూజిలాండ్‌లో రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, వివాహ సమానత్వం (Marriage Equality), కారుణ్య మరణాలకు చట్టబద్ధత (Euthanasia Bill) లాంటి బిల్లులు ఒకప్పుడు ఈ 'లక్కీ టిన్'లోంచి తీసినవే!
'బిస్కెట్ డబ్బా' ఎలా పుట్టింది?
గతంలో న్యూజిలాండ్ చట్టసభ సభ్యులు తమ బిల్లులను పార్లమెంట్ క్లర్క్‌కు అందించడానికి చాలా కష్టపడేవారు. చర్చల సమయంలో తమ అజెండాలను ముందుకు తీసుకెళ్లడానికి క్లర్క్ ఆఫీస్‌కు పరిగెత్తుకు వెళ్లి తమ ప్రతిపాదనలను నివేదించేవారు. కొన్నిసార్లు దీని కోసం రాత్రంతా అక్కడే నిలబడాల్సి వచ్చేది.
ఈ పద్ధతితో నాయకులు విసిగిపోయారు. అప్పుడే ఈ 'బిస్కెట్ డబ్బా' విధానం మొదలైంది. 1990లలో వెల్లింగ్టన్‌లోని ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్ నుంచి ఒక సిబ్బంది తెలుపు, నీలం రంగుల్లో ఉన్న ఒక డబ్బాను పార్లమెంట్‌కు తీసుకువచ్చారు. అప్పటి నుంచి ఈ లాటరీ విధానం ప్రారంభమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో అందరికీ సమాన అవకాశం కల్పిస్తూ, ఎంతో వినూత్నంగా సాగుతున్న ఈ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.
