Begin typing your search above and press return to search.

యూకేలో జులై 15 నుంచి అమలు.. ఏమిటీ సరికొత్త వీసా?

అవును... యునైటెడ్ కింగ్‌ డమ్‌ (యూకే)లో జూలై 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమలు కానున్నాయి.

By:  Tupaki Desk   |   13 July 2025 11:00 PM IST
యూకేలో జులై 15 నుంచి అమలు.. ఏమిటీ సరికొత్త వీసా?
X

ఇటీవల కాలంలో పలు దేశాలు వీసాల్లో విస్తృత మార్పుల ఆలోచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలో యునైటెడ్ కింగ్‌ డమ్‌ లో కొత్త వీసాలు అమల్లోకి రానున్నాయి. ఇందులో భాగంగా... జులై 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమలు కానున్నాయి. ఇమిగ్రేషన్‌ వ్యవస్థలో చేపట్టిన విస్తృత మార్పుల్లో భాగంగా వీటిని వాడుకలోకి తీసుకొస్తున్నారు.

అవును... యునైటెడ్ కింగ్‌ డమ్‌ (యూకే)లో జూలై 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమలు కానున్నాయి. ఈ క్రమంలో.. జులై 15 నుంచి జారీ చేసే అన్ని వీసాలు వాటిని పొందేవారి పాస్‌ పోర్టులతో లింకై.. డిజిటల్‌ రూపంలో ఉండనున్నాయని చెబుతున్నారు. ఈ కొత్త వీసాలు అన్ని రకాల వాటికి వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

వాస్తవానికి యూకేలో విద్యాభ్యాసం చేసే వారిలో మిగిలిన అంతర్జాతీయ విద్యార్థులతో పోలిస్తే... భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది! ఈ నేపథ్యంలో... విద్యార్థులు అంతా కచ్చితంగా తమ డిజిటల్‌, ప్రొసీజరల్‌ అంశాలను ప్రయాణానికి ముందే సరిచూసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కచ్చితంగా యూకేవీఐ ఖాతాను క్రియేట్‌ చేసుకొని వారి ఈవీసాను మేనేజ్‌ చేసుకోవాలి.

ఇది... వీసా వివరాలు, అప్‌ డేట్‌ ఇన్ఫర్మేషన్‌, ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ సమాచారం ఆయా విద్యాసంస్థలకు, యజమానులకు, కంపెనీలకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే సమయంలో... విద్యార్థులు లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ సరిగ్గా గుర్తుంచుకోవాలి. యూకేలో బస చేసేందుకు, కోర్సుల్లో రిజిస్టర్‌ చేసుకునే సమయాల్లో.. యూకేవీఐ ఖాతాను తనిఖీ చేస్తారు!

అయితే... ఈ ఈ-వీసా జారీ అయినప్పటికీ విద్యార్థులు మాత్రం తమ పాస్‌ పోర్టును, ప్రింటెడ్‌ లేదా డిజిటల్‌ వీసా కాపీలను తమతో ఉంచుకోవాలి. బోర్డర్‌ ఆఫీసర్లు పాస్‌ పోర్టును స్కాన్‌ చేసి ఈ-వీసాను తనిఖీ చేస్తారు. ఇక వీసా జారీ అయ్యాక.. పాస్‌ పోర్టును రెన్యూవల్‌ చేస్తే.. ఆ వివరాలను తమ ప్రయాణానికి ముందే తమ యుకేవీఐ ఖాతాలో అప్‌ డేట్‌ చేయాలి.