Begin typing your search above and press return to search.

విజయ్ సీఎం : తమిళనాడుకు కొత్త గవర్నర్...?

తమిళనాడు రాజకీయం మారింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీవీకే అనే కొత్త పార్టీ అధికారం చేపట్టింది.

By:  Satya P   |   15 May 2026 9:36 AM IST
విజయ్ సీఎం : తమిళనాడుకు కొత్త గవర్నర్...?
X

తమిళనాడు రాజకీయం మారింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీవీకే అనే కొత్త పార్టీ అధికారం చేపట్టింది. సినీ నటుడు విజయ్ ఇంత ప్రభంజనం సృష్టిస్తారు అని ఎవరూ అనుకోలేదు. అతి పెద్ద పార్టీగా వచ్చిన విజయ్ కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక అసెంబ్లీలో బల నిరూపణ కూడా ఆయన పూర్తి చేసుకున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడుకు కొత్త గవర్నర్ వస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది.

లోక్ భవన్ వర్సెస్ సీఎం :

తమిళనాడు గత చరిత్ర చూస్తే లోక్ భవన్ తో సీఎంలకు ఎపుడూ కొంత గ్యాప్ ఉంటూ వచ్చింది తమిళనాడు సీఎం గా జయలలిత ఉన్నపుడు మర్రి చెన్నారెడ్డి గవర్నర్ గా పనిచేశారు. ఆయన 1993 నుండి 1996 వరకూ ఆ పదవిలో ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ రాజకీయ నాయకుడైన ఆయన తమిళనాడులో తన పదవీకాలంలో అప్పటి ముఖ్యమంత్రి జె. జయలలితతో విభేదించేవారు. అలా ఇద్దరి మధ్యన పెద్ద గ్యాప్ ఏర్పడిపోయింది. ఇది తమిళనాడు చరిత్రలో గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక ముఖ్యమైన సంఘర్షణ కాలంగా ఇప్పటికీ చెబుతారు. ఆ తరువాత కాలంలో చూస్తే లేటెస్ట్ గా డీఎంకే అధినేత స్టాలిన్ ప్రభుత్వానికీ తమిళనాడు గత గవర్నర్ రవికి మధ్య కూడా అభిప్రాయ భేదాలు పొడసూపి కొంత గ్యాప్ ఏర్పడింది. ఇది కూడా జాతీయ స్థాయిని ఆకర్షించింది.

ఇంచార్జి గవర్నర్ గా :

ఇక తమిళనాడుకి ఇంచార్జి గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ ఏడాదిమార్చి 12న నియమితులయ్యారు. ఆయన హయాంలోనే విజయ్ కి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం ఆలస్యం అయింది అని టీవీకే వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు మద్దతు సంపాదించి విజయ్ సీఎం అయ్యారు. ఇక రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కేరళకు పూర్తి స్థాయి గవర్నర్. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోతోంది. పైగా ఆయనకు బాధ్యతలు ఆ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి తమిళనాడుకు వేరే గవర్నర్ ని నియమిస్తారు అని అంటున్నారు.

రాజకీయ ఊహాగానాలు :

సాధారణంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన వారిని సానుభూతిపరులను గవర్నర్లుగా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న చోట నియమిస్తారు అన్నది ప్రచారంలో ఉంది. రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విషయం తీసుకున్నా ఆయన పూర్వాశ్రమంలో బీజేపీ నేత. గోవాకు చెందిన వారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన విజయ్ ని పిలవకపోవడం మీద కూడా తప్పు పడుతూ తెర వెనక బీజేపీ ఉందని విమర్శలూ వినిపించాయి. ఆయన ఇంచార్జి గవర్నర్. మరి కొత్తగా పూర్తి స్థాయి గవర్నర్ గా వచ్చే వారు సైతం బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారుగా ఉంటారా అన్నది రాజకీయ ఊహాగానాలు గా వినిపిస్తోంది.

బడ్జెట్ సెషన్ కి ముందే :

ఒక వైపు హిందూత్వకు తాము పూర్తి వ్యతిరేకమని టీవీకే బాహాటంగా చెబుతోంది. మరో వైపు చూస్తే డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నిండు అసెంబ్లీలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే తమిళనాడులో ద్రవిడ వాదం తగ్గి కొత్త వాదంతో టీవీకే పగ్గాలు అందుకున్న వేళ పూర్వాశ్రమంలో బీజేపీ మనిషిగా ఉన్న వారే కొత్త గవర్నర్ గా వస్తారా అన్న చర్చ ఊపందుకుంది. బడ్జెట్ సమావేశాలు విజయ్ ప్రభుత్వం తొందరలో నిర్వహించాల్సి ఉంది. పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ సమావేశాలకు గవర్నర్ హాజరై ప్రసంగం చేయడం ఆనవాయితీ. దాంతో ఆ సమయానికి కొత్త గవర్నర్ నియామకం జరగవచ్చు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇంతకీ కొత్త గవర్నర్ ఎవరూ ఏమిటీ అన్నదే పెద్ద చర్చగా ఉంది.