అమెరికా కొత్త రూల్స్.. అక్కడికి వెళ్లే ముందు ఫోన్ పాస్ వర్డ్ చెప్పాల్సిందే ?
అమెరికా వెళ్లాలని కలలు కంటున్నారా ? అయితే మీ చేతిలోని ఫోన్, ల్యాప్‌టాప్‌లను జాగ్రత్తగా చూసుకోండి.. ఎందుకంటే అమెరికాలో చెకింగుల పద్ధతి పూర్తిగా మారిపోయింది.
By: Tupaki Desk | 18 April 2025 10:56 AMఅమెరికా వెళ్లాలని కలలు కంటున్నారా ? అయితే మీ చేతిలోని ఫోన్, ల్యాప్‌టాప్‌లను జాగ్రత్తగా చూసుకోండి.. ఎందుకంటే అమెరికాలో చెకింగుల పద్ధతి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు మీ బ్యాగులను మాత్రమే కాకుండా మీ దగ్గరున్న మీ ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ అండ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కొన్ని ముఖ్యమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్లతో ఓ గైడ్ లైన్ రిలీజ్ చేసింది. వీసాదారులే కాదు, గ్రీన్‌కార్డు హోల్డర్స్, అమెరికా పౌరులు కూడా ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
మీ ఎలక్ట్రానిక్స్‌పై సీబీపీకి అధికారం ఉందా?
అవును కచ్చితంగా ఉంటుంది. అమెరికాలోకి ప్రవేశించే ఎవరైనా సరే తమ వెంట తెచ్చే ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేసే పూర్తి అధికారం సీబీపీ సిబ్బందికి ఉంది. దేశంలోకి ప్రవేశించే అన్ని ప్రదేశాల్లో, ఎయిర్ పోర్టుల్లో, నౌకాశ్రయాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తారు. దీని కోసం వారికి ఎలాంటి వారెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ చెకింగ్స్ రెండు రకాలుగా ఉంటాయి. మొదట మీ ఫోన్ లేదా ఇతర పరికరాలను అన్‌లాక్ చేసి లేదా పాస్‌వర్డ్ చెప్పి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. వారు అక్కడికక్కడే వాటిని పరిశీలిస్తారు. మరింత లోతుగా తనిఖీ చేయాలంటే ప్రత్యేకమైన పరికరాలను ఉపయోగించి వాటిలోని సమాచారాన్ని కాపీ చేయడం లేదా విశ్లేషించడం కూడా చేయవచ్చు. మీ పరికరాల్లో జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తే అడ్వాన్స్‌డ్ సెర్చ్ నిర్వహిస్తారు.దీనికి వారు సీనియర్ మేనేజన్ పర్మీషన్ తీసుకోవాల్సి ఉంటుంది.
కొన్ని సార్లు మీరు ఎయిర్ పోర్టు నుంచి బయటకు వెళ్లే వరకు మీ ఫోన్లు, ల్యాప్ టాప్ లను తిరిగి ఇవ్వకపోవచ్చు. అదనపు తనిఖీల కోసం వాటిని ఐదు రోజుల వరకు తమ వద్ద ఉంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీబీపీ అధికారి పేరు, బ్యాడ్జి నెంబర్‌ను తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. వారు అడిగిన ప్రశ్నలను జాగ్రత్తగా రాసుకోవాలి.
మీ పాస్‌వర్డ్ చెప్పాల్సిందేనా?
ఈ విషయంలో పౌరులు కాని వారికి తక్కువ హక్కులు ఉంటాయి. మీ డివైజ్‌లను అన్‌లాక్ చేయడానికి మీరు నిరాకరిస్తే మిమ్మల్ని అమెరికాలోకి అడుగు పెట్టనివ్వకపోవచ్చు. ఇక గ్రీన్‌కార్డు హోల్డర్లకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట తమ వాదనలు వినిపించే హక్కు ఉంటుంది. అయితే అమెరికా పౌరులను దేశంలోకి రాకుండా అడ్డుకునే అవకాశం లేదు. వీసాదారులు తమ పాస్‌వర్డ్‌ను నేరుగా అధికారులకు చెప్పేందుకు బదులు తామే స్వయంగా డివైజ్‌ను ఓపెన్ చేసిన వారి ఇవ్వొచ్చు కూడా.
మీ పరికరాన్ని స్వాధీనం చేసుకుంటే ఏం చేయాలి?
ఒకవేళ మీ ఎలక్ట్రానిక్ పరికరాన్ని సీజ్ చేస్తే ఫామ్ 6051-డి రశీదును తప్పనిసరిగా తీసుకోవాలి. ఆ రశీదులో మీ పరికరం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు దాని గురించి తర్వాత ఎక్కడ సంప్రదించాలో కూడా తెలియజేస్తారు. పరీక్షలు పూర్తయిన తర్వాత మీ పరికరాన్ని మీకు తిరిగి పంపుతారు. మీ పరికరంలో ఎటువంటి నేరాలకు సంబంధించిన ఆధారాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత, దాని నుండి కాపీ చేసిన సమాచారాన్ని అధికారులు 21 రోజుల్లోపు డిలీట్ చేస్తారు. అందుకే అమెరికాకు వెళ్లే సమయంలో ప్రయాణాల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన పరికరాలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.వాటిలో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.