Begin typing your search above and press return to search.

కొత్త అద్దె నియమాలు ఇవే.. ఇందులో ఏం చేప్పారంటే?

భారతదేశంలో యజమాని-అద్దెదారుల సంబంధం ఆవేదన, అపోహలతో ఇరువురి మధ్య స్పష్టత లేని బాధ్యతలతో ఉండే వ్యవస్థగానే పరిగణించబడింది.

By:  Tupaki Desk   |   6 Dec 2025 1:28 PM IST
కొత్త అద్దె నియమాలు ఇవే.. ఇందులో ఏం చేప్పారంటే?
X

భారతదేశంలో యజమాని-అద్దెదారుల సంబంధం ఆవేదన, అపోహలతో ఇరువురి మధ్య స్పష్టత లేని బాధ్యతలతో ఉండే వ్యవస్థగానే పరిగణించబడింది. ఎవరి హక్కులు ఎక్కడ ప్రారంభమవుతాయి, ఎక్కడ ముగుస్తాయి అన్నది స్పష్టంగా లేకపోవడం వల్ల చిన్న విషయాలు కూడా వివాదాలుగా మారి కోర్టుల దాకా వెళ్లిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. దేశంలో వేగంగా పెరుగుతున్న అద్దె మార్కెట్‌ 2025లో ప్రవేశపెట్టిన కొత్త అద్దె నియమాలు ఈ భేదాభిప్రాయాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ముందుకొచ్చాయి.

సెక్యూరిటీ డిపాజిట్ పై నియంత్రణ

కొత్త చట్టంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం సెక్యూరిటీ డిపాజిట్‌ను రెండు నెలల అద్దెకు మాత్రమే పరిమితం చేయడం. మెట్రో నగరాల్లో ఉద్యోగాలు, చదువుల కోసం మారే యువతకు ఇది పెద్ద ఉపశమనం. ఇంత వరకు కొన్ని ప్రాంతాల్లో ఐదు నుంచి పది నెలల వరకూ డిపాజిట్‌ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగం మారినప్పుడు లేదంటే కొత్త నగరానికి వెళ్లేటప్పుడు ఈ మొత్తాన్ని సమీకరించడం చాలా మందికి భారంగా మారేది. ఇప్పుడు ఆ ఒత్తిడి తగ్గింది. భూ స్వామి కూడా సరైన అద్దెదారుడిని పొందడంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మార్కెట్‌ మరింత సమతుల్యంగా మారే అవకాశం ఉంది.

డిజిటల్ ఒప్పందాలు

డిజిటల్ స్టాంపింగ్, 60 రోజుల్లోపు ఆన్‌లైన్‌ అద్దె ఒప్పంద రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడం మరో కీలక అడుగు. ఇకపై మౌఖిక ఒప్పందాలు లేదా కాగితంపై రాసిన అస్పష్టమైన అగ్రిమెంట్లు అడ్డుకట్టవుతాయి. ఎప్పుడైనా వివాదం వచ్చినా, రికార్డు స్పష్టంగా ఉండడం వల్ల ఇరువురికి న్యాయం జరిగే మార్గం సులభమవుతుంది. డిజిటల్ ట్రైయల్ ఉండడం వల్ల అక్రమ వసూళ్లు, ఒప్పందం మార్చడం వంటి సమస్యలూ తగ్గుతాయి.

అద్దెదారుల హక్కులకు బలమైన రక్షణ

తొలగింపు విషయంలో భూ స్వాములు చట్టరీత్యా నిర్వచించిన ప్రక్రియను అనుసరించాలన్న నిబంధన అద్దెదారుల్లో భద్రతాభావం పెంచుతుంది. అద్దె పెంపు ముందు 90 రోజుల రాత పూర్వక నోటీసు ఇవ్వడం, మరమ్మతుల కోసం ఇంట్లోకి ప్రవేశించే 24 గంటల ముందు ముందస్తుగా తెలియజేయడం వంటి నిబంధనలు అద్దెదారుడిని గౌరవించే సంస్కృతిని పెంచుతాయి. మరమ్మతులపై 30 రోజులు స్పందించని భూస్వామి బదులుగా అద్దెదారే సమస్యను పరిష్కరించి అద్దె నుంచి ఖర్చును తగ్గించుకోవచ్చన్న నిబంధన, ఇరువురి బాధ్యతలను స్పష్టమైన రేఖల్లో నిర్వచిస్తుంది. ఇది అద్దె గృహాన్ని కేవలం లావాదేవీ స్థలంగా కాకుండా, నివసించే వ్యక్తి హక్కుగా గుర్తించే వేదికగా మారుస్తుంది.

విశ్వాసంతో కూడిన అద్దె సంస్కృతికి దారి

ఈ కొత్త నియమాలు అద్దె అనే వ్యవస్థను శత్రుత్వం నుంచి సహకారానికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి. వాదనలు, అనుమానాలు, మౌఖిక వాగ్దానాలపై ఆధారపడిన పాత వ్యవస్థకు బదులుగా, చట్టపరమైన హక్కులు.., బాధ్యతలు.., పారదర్శకత అనే మూడు స్తంభాలపై నిలిచే అద్దె సంస్కృతి పుట్టుకొస్తోంది. అద్దెదారుడి భద్రతను కాపాడుతూ, భూస్వామి హక్కులను కూడా సమానంగా గౌరవించే ఈ మార్పులు భారత అద్దె మార్కెట్‌ను మరింత న్యాయసమ్మతంగా, ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి.