తెలంగాణలో కొత్త పార్టీలు.. ఆసక్తి రేపుతున్న ఈటల, కవిత, తీన్మార్ మల్లన్న కదలికలు
తెలంగాణ పొలిటికల్ పిచ్ పై కొత్త పార్టీలు ఎంట్రీ ఇస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముక్కోణ పోటీ నెలకొన్న తెలంగాణలో మరో మూడు కొత్త పార్టీలు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయంటూ పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
By: Tupaki Desk | 26 July 2025 5:00 PM ISTతెలంగాణ పొలిటికల్ పిచ్ పై కొత్త పార్టీలు ఎంట్రీ ఇస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ముక్కోణ పోటీ నెలకొన్న తెలంగాణలో మరో మూడు కొత్త పార్టీలు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయంటూ పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలపైన అసమ్మతి, అసంతృప్తితో ఉన్న ఆయా నేతలు కొత్త దుకాణం తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయం కొద్దిరోజుల్లో రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనుండటంతో కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియను ఆయా నేతలు వేగవంతం చేసినట్లు చర్చించుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి.. మూడున్నరేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తామేంటో నిరూపించుకోవాలని ముగ్గురు నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త నెమ్మదించింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకు చురుగ్గా కదులుతోంది. ఇదే సమయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తెలంగాణలో జెండా ఎగరేసే ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీలో కేవలం ఇద్దరు సభ్యులతో నెట్టుకొచ్చిన బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, పార్లమెంటు ఎన్నికల నాటికి బలపడి రాష్ట్రంలోని సగం స్థానాలను కైవసం చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి క్రమపద్ధతిలో వ్యూహాలు రచిస్తోంది.
అదేసమయంలో కాంగ్రెస్ కూడా తన అధికారాన్ని నిలబెట్టుకునేలా పావులు కదుపుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలన తర్వాత గేరు మార్చినట్లు కనిపిస్తున్నారు. ప్రభుత్వం, పార్టీపై పట్టు కోసం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి ముందుగా స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి అందరినీ తన దారికి తెచ్చుకోవాలని సన్నాహాలు చేస్తున్నారు. అయితే సీఎం ప్రయత్నాలకు కాంగ్రెస్ లోనే కొందరు నాయకులు అడ్డు తగులుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ అజెండాతో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన తీన్మార్ మల్లన్న బీసీల ప్రతినిధిగా తెలంగాణలో సత్తాచాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ గర్జన సభలో రాష్ట్రంలోని రెండు అగ్ర వర్ణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పటికే ఆయన మూడు పార్టీల్లో పనిచేయడం, వివాదాస్పద వైఖరి మూలంగా ప్రతిపక్షాలు ఆయనకు రాజకీయ ఆశ్రయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో కొత్తపార్టీ తెరవాలని భావిస్తున్నారని అంటున్నారు. అదేసమయంలో బీసీ నినాదంతోనే బీఆర్ఎస్ నాయకురాలు కవిత, బీజేపీ నేత ఈటల రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు కూడా సొంత పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాల పట్టి కవిత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరతారని కొద్దిరోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంపై స్పందించని కవిత.. బీఆర్ఎస్ లో తన పాత్ర ఏంటో చెప్పాలని పార్టీ నేతలను డిమాండ్ చేస్తున్నారు. తన అన్న కేటీఆర్ పెత్తనాన్ని సహించలేనని, తనకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని ఆమె పట్టుబడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ తెచ్చిన బీసీ రిజర్వేషన్లను సమర్థించిన కవిత.. సొంత పార్టీ ఆలోచనల్లో ఉన్నారని కూడా చెబుతున్నారు. పార్టీ ప్రకటన కోసం తగిన సమయం కోసం ఆమె వేచిచూస్తన్నట్లు చెబుతున్నారు.
మరోవైపు బీజేపీలో తనకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదని ఎంపీ ఈటల రాజేందర్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ టార్గెట్ గా ఈటల చేసిన కామెంట్లు రాజకీయంగా కాకరేపాయి. బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరిన ఈటలకు తొలి నుంచి పార్టీలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి పార్టీ సీఎం అభ్యర్థి అవ్వాలనే లక్ష్యంతో ఈటల పనిచేస్తుండగా, ఆయన ఆశలకు పార్టీలో ప్రత్యర్థులు గండికొడుతున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీలో ఉంటే తన ఆశలు నెరవేరే పరిస్థితి లేదన్న భావనతో ఈటల సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ నేతగా ఈటలకు రాష్ట్రంలో మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ నేపథ్యం కూడా తనకు కలిసివస్తుందని ఆయన ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా ముగ్గురు నేతలు సొంత పార్టీ పెట్టాలనే ప్రయత్నాల్లో ఉండటం రాజకీయంగా వేడిపుట్టిస్తోంది.
