కొత్త పార్టీలతో ఓట్ల చిక్కులు.. తెలంగాణలో మారనున్న సీన్!
రాజకీయాల్లో కొత్త పార్టీలు పుట్టుకురావడం సహజమే. అయితే... వాటి వల్ల ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమేరకు ఓటు బ్యాంకుకు గండి పడుతుందన్నది కూడా అంతే ముఖ్యం.
By: Tupaki Desk | 28 Sept 2026 2:00 PM ISTరాజకీయాల్లో కొత్త పార్టీలు పుట్టుకురావడం సహజమే. అయితే... వాటి వల్ల ప్రధాన రాజకీయ పార్టీలకు ఏమేరకు ఓటు బ్యాంకుకు గండి పడుతుందన్నది కూడా అంతే ముఖ్యం. ఏపీలో ఈ తరహా పరిస్థితి లేదు. సామాజిక వర్గాల వారీగా .. ప్రజలు పార్టీలను ఆదర్శిస్తున్నారు. కానీ, తెలంగాణలో సెంటిమెంటు రాజకీయాలు పెరుగుతున్నాయి. దీంతో కొత్త పార్టీలు పుట్టుకువస్తున్న ప్రతిసారీ ప్రధాన రాజకీయ పార్టీలు ఇరకాటంలో పడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ పార్టీల హవా మరింత పెరగనుంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. సంస్థాగతంగా 32-38 శాతం మధ్యే ఓటు బ్యాంకు ఉంది. సుమారు 40% పైచిలుకు ఓటు శాతం పుంజుకుంటే తప్ప.. పటిష్టమైన అధికారం నిలుపుకొనే అవకాశం లేదన్న లెక్కలు వున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంస్థాగత ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. అయితే సంక్షేమ హామీలు, ఉద్యోగాలపై అంచనాలు అందుకోకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. వీటినే కొత్తగా ఏర్పడుతున్న పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుముఖం పట్టింది. పార్లమెంట్, స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ల శాతం పడిపోయింది. అయితే.. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్, నిర్దిష్ట రాజకీయ గుర్తింపు ఉన్నాయని భావిస్తున్నా.. కొత్తగా వస్తున్న పార్టీలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీకి ప్రధాన ప్రయోజనం.. బీఆర్ ఎస్ ఓటు బ్యాంకే. గతం నుంచి ప్రస్తుతానికి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇది స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగిన విధంగా సాయం లేకపోవడం, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. ప్రయోజనం కనిపించకపోవడంతో బీజేపీ ఓటు బ్యాంకు కూడా తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. దీంతో కొత్తగా ఏర్పడుతున్న ఇతర పార్టీలు బీసీ, ఎస్సీ, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నాయి. ప్రత్యేక ఓటు బ్యాంకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓటర్లు అభివృద్ధి, ఉపాధి, పాలన తీరును బేరీజు వేసుకుని ఓటు వేస్తున్నారు.
ఇవీ కొత్త పార్టీలు..
తెలంగాణ రక్షణ సేన: కల్వకుంట్ల కవిత వ్యక్తిగత రాజకీయ ప్రయాణంలో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ లక్ష్యం.. మెజారిటీ బీఆర్ ఎస్ ఓటు బ్యాంకును, మహిళా ఓటు బ్యాంకును సొంతం చేసుకోవడమే.
జన తెలంగాణ: కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఏర్పడిన పార్టీని ప్రజాసంఘాల నాయకులు నడిపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో ఈ పార్టీ ఉంది.
ప్రజా పాలన పార్టీ: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏర్పాటు చేసిన ఈ పార్టీ కూడా పలు జిల్లాల్లో ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
భారతీయ యువజన పార్టీ, మజ్దూర్ జనతా పార్టీ, జన గళం పార్టీ, 'తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ వంటివి కూడా ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ.. వారి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే.. ఇవి ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయం కాకపోయినా.. బలమైన ఓటు బ్యాంకును తమవైపు కొంతలో కొంత లాగేస్తే.. అది ఆయా ప్రధాన పార్టీలపై ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
