లైవ్ చేయాలంటే పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి! ఇన్స్టాగ్రామ్‌లో కొత్త రూల్స్ !
16 ఏళ్ల లోపు ఇన్ స్టాగ్రామ్ యూజర్ల కోసం మెటా 'టీన్ అకౌంట్స్' అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
By: Tupaki Desk | 9 April 2025 4:16 PM IST16 ఏళ్ల లోపు ఇన్ స్టాగ్రామ్ యూజర్ల కోసం మెటా 'టీన్ అకౌంట్స్' అనే ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టీనేజర్ల కోసం రూపొందించిన తమ నూతన భద్రతా విధానంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా ప్లాట్‌ఫామ్‌ను మరింత సురక్షితంగా ఉంచాలని మెటా లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా డైరెక్ట్ మెసేజ్‌లలో అసభ్యకరమైన కంటెంట్‌ను బ్లర్ చేయకుండా లైవ్‌స్ట్రీమ్ చేసే సామర్థ్యాన్ని కూడా మెటా నిరోధించింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో టీన్ అకౌంట్ ప్రోగ్రామ్‌ను తల్లిదండ్రులకు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీని ద్వారా వారు తమ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించవచ్చు. ఇప్పుడు దానికి అప్‌గ్రేడ్‌గా, 16 ఏళ్ల లోపు యూజర్లు ఇన్ స్టాగ్రామ్ లైవ్ ఫీచర్‌ను ఉపయోగించకుండా మెటా చర్యలు తీసుకుంది. లైవ్ స్ట్రీమ్ చేయాలంటే ముందుగా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా టీనేజర్ల కోసం మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. టీన్ అకౌంట్లు డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా సెట్ చేయబడతాయి.. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ప్రైవేట్ మెసేజ్‌లు బ్లాక్ చేస్తారు. హింసాత్మక వీడియోల వంటి సున్నితమైన కంటెంట్‌పై కఠినమైన పరిమితులు ఉంటాయి. 60 నిమిషాల తర్వాత యాప్ నుండి విరామం తీసుకోవాలని రిమైండర్‌లు వస్తాయి. నిద్రపోయే సమయంలో నోటిఫికేషన్‌లు పాజ్ అవుతాయి. ఈ తాజా భద్రతా ఫీచర్ మొదట యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలోని యూజర్లకు అందుబాటులోకి రానుంది. రాబోయే నెలల్లో ప్రపంచవ్యాప్తంగా మిగిలిన యూజర్లకు కూడా ఇది అందుబాటులోకి వస్తుంది.
