Begin typing your search above and press return to search.

డచ్ గడ్డపై చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ పర్యటనతో దేశానికి అమూల్య సంపద

మధ్యయుగాల నాటి దక్షిణ భారతదేశ చరిత్రకు, ముఖ్యంగా చోళ సామ్రాజ్య వైభవానికి ఇవి సజీవ సాక్ష్యాలుగా చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   16 May 2026 11:20 PM IST
డచ్ గడ్డపై చారిత్రాత్మక విజయం.. ప్రధాని మోదీ పర్యటనతో దేశానికి అమూల్య సంపద
X

భారత సాంస్కృతిక దౌత్యంలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ చేరుకున్న వేళ.. డచ్ ప్రభుత్వం ఒక సంచలన, చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. దాదాపు శతాబ్దానికి పైగా నెదర్లాండ్స్‌లోని 'లైడెన్ యూనివర్సిటీ'లో భద్రపరిచిన అత్యంత ప్రతిష్టాత్మక 'ఆనైమంగళం చోళ రాగి రేకులను' నెదర్లాండ్స్ ప్రభుత్వం అధికారికంగా భారత్‌కు అప్పగించింది. వలస ప్రభుత్వాల కాలంలో మన దేశం నుంచి తరలించిన ఈ అమూల్యమైన సంపదను తిరిగి స్వదేశానికి తీసుకురావడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఏమిటీ ఆనైమంగళం రాగి రేకుల ప్రత్యేకత?

మధ్యయుగాల నాటి దక్షిణ భారతదేశ చరిత్రకు, ముఖ్యంగా చోళ సామ్రాజ్య వైభవానికి ఇవి సజీవ సాక్ష్యాలుగా చెబుతున్నారు. ఈ చారిత్రాత్మక పత్రాల మొత్తం బరువు దాదాపు 30 కిలోలు ఉంటుందని అంటున్నారు. ఇందులో 21 పెద్ద రాగి రేకులు, 3 చిన్న రేకులు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుతూ ఒక పెద్ద రాగి వలయం, దానికి రాజేంద్ర చోళుడి అధికారిక 'చోళ రాజముద్ర' ఉన్నాయని అంటున్నారు. ఈ రేకులపై సంస్కృతం, తమిళ భాషలలో శాసనాలు రాశారని, విష్ణుమూర్తి నుంచి ప్రారంభమయ్యే చోళ వంశ వృక్షాన్ని వివరిస్తుందని సమాచారం.

ఇక ప్రపంచ ప్రసిద్ధ తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళ-I పరిపాలనా కాలంలో తమిళనాడులోని రేవు పట్టణమైన నాగపట్నంలో నిర్మించిన 'చూడామణి విహారం' అనే బౌద్ధ మఠానికి ఒక గ్రామ రెవెన్యూను, పన్నులను దానంగా ఇచ్చినట్లు ఈ పత్రాల్లో ఉందని అంటున్నారు. బౌద్ధ విహారాన్ని నాటి ఆగ్నేయాసియా ప్రస్తుతం ఇండోనేషియాలోని సుమత్రా ప్రాంతం శ్రీవిజయ సామ్రాజ్య పాలకుడు, శ్రీమార విజయోతుంగ వర్మన్ నిర్మించారు. హిందూ రాజులైన చోళులు బౌద్ధ మఠానికి దానాలు చేయడం ద్వారా నాటి భారతదేశంలోని మత సామరస్యాన్ని, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను ఇవి స్పష్టం చేస్తున్నాయి.

నెదర్లాండ్స్‌కు ఎలా?

18వ శతాబ్దంలో కోరమాండల్ తీరంలో (నాగపట్నం) డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సాగుతున్న సమయంలో.. ఫ్లోరెంటియస్ కాంపెర్ అనే డచ్ అధికారి ఒక క్రైస్తవ మిషనరీ సహాయంతో వీటిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత 1862లో డచ్ ప్రొఫెసర్ హెండ్రిక్ అరెంట్ హామకర్ వారసత్వ సంపద ద్వారా ఇవి నెదర్లాండ్స్‌లోని 'లైడెన్ విశ్వవిద్యాలయం' ఆసియా ఆర్కైవ్స్‌కు చేరాయి. గత వందేళ్లకు పైగా ఇవి అక్కడి భద్రతా లాకర్లలో పరిశోధకులకు మాత్రమే పరిమితమయ్యాయని అంటున్నారు.

వెలుగులోకి తెచ్చిన మోదీ దౌత్య నీతి

భారత ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఈ రాగి రేకులను తిరిగి రప్పించడానికి తీవ్రంగా దౌత్య ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా 2022లో నెదర్లాండ్స్ ప్రభుత్వం వలస రాజ్యాల కాలం నాటి కళాఖండాలను తిరిగి ఇచ్చేందుకు సరికొత్త 'పునరుద్ధరణ విధానాన్ని' తీసుకువచ్చింది. ఆ తర్వాత యునెస్కో కమిటీ కూడా భారత్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో మార్గం సుగమమైందని అంటున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రాత్మక అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ సందర్భంగా డచ్ ప్రభుత్వానికి, లైడెన్ విశ్వవిద్యాలయానికి భారత ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.