Begin typing your search above and press return to search.

ఆ వ్యక్తిని చంపేస్తే సమస్య పోతుంది... నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Jun 2025 4:15 AM
ఆ వ్యక్తిని చంపేస్తే  సమస్య పోతుంది... నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు!
X

తాము చేస్తున్న యుద్ధం ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుకోవడానికి మాత్రమే కాదు.. ప్రపంచానికి పెనుముప్పుగా ఉన్న ఇరాన్ నుంచి అందరినీ రక్షించడానికి అని ఇజ్రయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఇరాన్ ఫస్ట్ శత్రువు ట్రంప్ అని, అందుకే ఆయనను చంపాలని చూస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా యుద్ధం ఎప్పుడు ఆగుతుందో చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. ఇరుదేశాలు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుద్ధం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు.

ఇందులో భాగంగా... ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ పథకం రచించిందని.. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఆ ప్లాన్ ను తిరస్కరించారని.. అలా చేయడం వల్ల ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని.. అందుకే ట్రంప్ అంగీకరించనట్లు కథనాలు వెలువడ్డాయనే విషయంపై స్పందించిన ఆయన.. "అలా చేస్తే సంఘర్షణ మరింత పెరగదు, యుద్ధం ముగుస్తుంది" అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ఇరాన్‌ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని అభివర్ణించిన నెతన్యాహు.. తాము కేవలం తమ శత్రువుతో మాత్రమే యుద్ధం చేయడం లేదని.. వారు ఇజ్రాయెల్‌ తో పాటు అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారని తెలిపారు. దీంతో.. తాము సైతం వారి దారిలోనే నడుస్తున్నామని.. దురాక్రమణను అంతం చేయడం, దుష్ట శక్తులకు ఎదురించి పోరాడడం ద్వారా ఇజ్రాయెల్‌ అణు విపత్తును అడ్డుకుంటోందని నెతన్యాహు అన్నారు.

అదేవిధంగా... ఇరాన్‌ దౌత్య చర్యలను నెతన్యాహు తొసిపుచ్చారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నారని అన్నారు. ఇరాన్‌ ఉద్దేశాలపై ఇజ్రాయెల్‌ కు కచ్చితమైన నిఘా సమాచారం ఉందని.. ఇరాన్‌ అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్‌ కు మాత్రమే ముప్పు కాదని, అరబ్‌ దేశాలు, యూరప్‌, అమెరికాకు సైతం ముప్పే అని నెతన్యాహు పునరుద్ఘాటించారు.

మరోవైపు ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీని అధికారులు ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు కథనాలొస్తున్నాయి. తాజాగా ఖమేనీ నివాసానికి, కార్యాలయానికి సమీపంలో ఇజ్రాయెల్ క్షిపణులు దాడులు చేసిన నేపథ్యంలో.. ఈశాన్య టెహ్రాన్ లోని అండర్ గ్రౌండ్ బంకర్ లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచూకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కాగా... ఆదివారం జరిగిన దాడుల్లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ (ఐ.ఆర్‌.జీ.సీ.) నిఘా అధిపతి, ఉప అధిపతిని మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌.. సోమవారం ఏకంగా ఇరాన్‌ అధికారిక టీవీ (ఐ.ఆర్‌.ఐ.బీ.) భవనంపై మిస్సైల్ ని ప్రయోగించింది. టీవీ స్టూడియోలో మహిళా న్యూస్‌ రీడర్‌ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.