నేపాల్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని చేసిన రచ్చేంది?
మన పొరున ఉండే చిట్టి దేశం నేపాల్. ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా అలియాస్ బాలెన్ షా బాధ్యతలు చేపట్టిన వైనం తెలిసిందే.
By: Garuda Media | 1 Jun 2026 2:59 PM ISTమన పొరున ఉండే చిట్టి దేశం నేపాల్. ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా అలియాస్ బాలెన్ షా బాధ్యతలు చేపట్టిన వైనం తెలిసిందే. అనతి కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు.. అనుసరిస్తున్న రాజకీయ విధానాలు.. పాలనా ఇప్పుడు చిట్టి వీడియోలతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. బెంగళూరులో కొన్నేళ్ల పాటు ఉండి చదువుకున్న అతగాడు..భారత్ మీద కోపాన్ని.. ఆగ్రహాన్ని ప్రదర్శించటం ద్వారా రోటీన్ కు భిన్నమైన నేపాల్ అధినేతగా మారారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆదివారం నేపాల్ పార్లమెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచనలంగా మారటమే కాదు.. ఇప్పుడో కొత్త వివాదానికి తెర తీసిన పరిస్థితి. ఆయన మాటల మంటలు సొంత దేశంలోనే ఇప్పుడు రచ్చగా మారాయి.
ఇంతకూ ఆయన ఏం మాట్లాడారు? ఏ సందర్భంలో మాట్లాడారు? ఆయన మాటల వెనుక లెక్కేంది? లాంటి ఎన్నో సందేహాలు ఇప్పుడు చుట్టిముట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందన్నది వరుస క్రమంలో తెలుసుకుంటే.. అసలు వివాదానికి కారణం అర్థమయ్యే అవకాశం ఉంది. ఆదివారం నేపాల్ పార్లమెంట్ లో కాలాపానీ.. లిపులేఖ్.. లింపియాధురా లాంటి వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలపై సభ్యులు ప్రశ్నలు వేశారు. వీటికి సమాధానం చెప్పే ప్రయత్నంలో నేపాల్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం రచ్చకు అసలు కారణంగా చెప్పాలి.
ఇంతకూ నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఏం చెప్పారన్న విషయంలోకి వెళితే.. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలను ఆక్రమించుకోలేదని.. నేపాల్ కూడా భారతదేశానికి చెందిన భూభాగాలను పలుచోట్ల అక్రమించిందంటూ సంచలనానికి.. కొత్త వివాదానికి తెర తీశారు. ‘మీకు వింతగా అనిపించొచ్చు. కానీ నేను ప్రధానమంత్రి అయ్యాకే ఈ నిజాన్ని తెలుసుకున్నా. కేవలం భారత్ మాత్రమే మన భూమిని ఆక్రమించలేదు. నేపాల్ కూడా చాలాచోట్ల భారత భూభాగాలను ఆక్రమించింది.ఈ సరిహద్దు వివాదంపై భారత్.. చైనాతో మాత్రమే కాదు బ్రిటన్ ప్రభుత్వంతోనూ మాట్లాడాం. బ్రిటీష్ వారు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిన నాటి నుంచి ఈ సమస్య ఉంది. అందుకే బ్రిటన్ కూడా ఇందులో జోక్యం చేసుకొని ఆసక్తి చూపాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.
ఆయన వ్యాఖ్యలపై నేపాల్ లో ఎలాంటి స్పందన ఉందన్న విషయంలోకి వెళితే.. నేపాలీ కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాని వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు నేపాల్ జాతీయ ప్రయోజనాల్ని.. అధికారిక సరిహద్దు విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా వారు ఆక్షేపణ వ్యక్తం చేశారు. భారత భూభాగాలను నేపాల్ అక్రమించిందని చెప్పటానికి ప్రధాని బాలేంద్రషా ఆధారాలు చూపించాలని.. లేదంటే ఆ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. పార్లమెంట్ లో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే నేపాల్ కు చెందిన పలువురు సరిహద్దు నిపుణులు సైతం ప్రధాని బాలేంద్ర షా వ్యాఖ్యల్ని తప్పు పడుతూ ఒక ప్రకటన విడుదల చేయటం గమనార్హం. బాలేంద్ర షా చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన రచ్చతో నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ‘నదుల ప్రవాహాలు మారటంతో సరిహద్దు దాటి స్థానిక ప్రజలు సాగు చేసుకోవటం లాంటి సాంకేతిక అంశాల్ని ఉద్దేశించి ప్రధాని అలా మాట్లాడారు. అంతేకానీ.. నేపాల్ అధికారిక సరిహద్దు స్థానంలో ఎలాంటి మార్పు లేదు’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేయాల్సి వచ్చింది.
బాలేంద్రషా తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత పిన్నవయసులో దేశ ప్రధాని కావటం ఒక ఎత్తు అయితే.. తనకు తెలిసిన విషయాల్ని తెలిసినట్లుగా చెప్పటమే తప్పించి.. ఎలాంటి ముసుగులు ధరించని ఒక కొత్త రాజకీయ ఒరవడికి ఆయన తెర తీసినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాల్ని పార్లమెంటులో పారదర్శకంగా అంగీకరించారన్న మాటను పలువురు చెబుతున్నారు. దౌత్యపరమైన ముసుగులు ఎందుకు? అన్నట్లుగా ఆయన తీరుఉందంటున్నారు. ఒక ఇంజనీర్.. మాజీ ర్యాపర్ కం ఖాట్మండు మాజీ మేయర్.. జెన్ జీ తరానికి ప్రతినిధిగా ఉంటే ప్రధాని మాటల్లో ముసుగుల్లేవ్.. తనకు తెలిసిన విషయాన్ని తెలిసినట్లు చెప్పారంతే అంటూ ఆయన్ను సమర్థించేవారి తమ వాదనను వినిపిస్తున్నారు.
గడిచిన కొన్నేళ్లుగా భారత్ - నేపాల్ దేశాలు సరిహద్దు అంశంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వేళ.. ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేవలం ఒకరినే తప్పు పట్టకుండా.. ఇరువైపులా సమస్యలు ఉన్నాయని చెప్పటం.. ఇద్దరు సమానంగా కూర్చొని చరిత్రకారులు.. సర్వేయర్ల సాయంతో సమస్యను శాశ్వితంగా పరిష్కరించుకోవాలన్నదే బాలేంద్రషా వ్యూహంగా చెబుతున్నారు.
ఈ కారణంగానే బ్రిటన్ కూడా ఈ చర్చల్లో భాగస్వామి కావాలని కోరటం కనిపిస్తుందంటున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే దేశ ప్రధానిగా తన మొదటి పార్లమెంట్ ప్రసంగంలోనే చేసిన వ్యాఖ్యలు కొత్త రచ్చకు తెర తీశాయని చెబుతుంటే.. అలాంటిదేమీ లేదని సుదీర్ఘ వివాదానికి తెర దించాలన్న ఉద్దేశమే నేపాల్ ప్రధాని మాటల్లో కనిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. తాజా వ్యాఖ్యల అనంతరం మాత్రం భారత విదేశాంగ శాఖ ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు. అదే సమయంలో తాను లేవనెత్తిన అంశానికి సంబంధించి పార్లమెంట్ లో నేపాల్ ప్రధాని మాట్లాడిన మాటల్లో ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.
తాను లేవనెత్తిన అంశంపై భారత ప్రభుత్వం తమ దౌత్య లేఖను ఇప్పటికే అధికారికంగా సమాధానం ఇచ్చిందని చెప్పటం ద్వారా.. ఈ ఇష్యూ మీద భారత్ పని చేస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. మరోవైపు నేపాల్ ప్రధాని తాజా వ్యాఖ్యల నేపథ్యంలో నేపాల్ అధికార పక్ష రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత.. డిప్యూటీ ప్రధానమంత్రి రబీ లామిచ్చాన్ ఈ రోజు ఐదు రోజుల పర్యటనకు ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో.. నేపాల్ ప్రధాని వ్యాఖ్యల అంశంపై ఢిల్లీ వేదికగా ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.
