భారత విద్యతో నేపాల్ గద్దెపైకి.. ర్యాపర్ నుంచి ప్రధానిగా బాలెన్ షా అద్భుత ప్రస్థానం!
నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ఆశ్చర్యకర విజయాన్ని సాధించింది.
By: A.N.Kumar | 8 March 2026 1:10 PM ISTనేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జెన్ జీ ఉద్యమానికి ప్రతీకగా ఎదిగిన యువ నాయకుడు బాలెన్ షా ఇప్పుడు ఆ దేశ ప్రధాని పీఠానికి చేరువ కావడం విశేషం. సంప్రదాయ రాజకీయ శైలికి భిన్నంగా యువత ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఆయన చేసిన రాజకీయ ప్రయాణం ప్రస్తుతం నేపాల్‌లో పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఆయన ఉన్నత విద్య భారత్‌లో పూర్తి చేయడం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.
నేపాల్ పార్లమెంటు ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ఆశ్చర్యకర విజయాన్ని సాధించింది. మొత్తం 165 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఆర్‌ఎస్‌పీ 104 స్థానాలు గెలుచుకోగా.. మరో 21 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు దిశగా పార్టీ బలంగా అడుగులు వేస్తోంది. బ్యాలెట్ పేపర్ విధానంలో పోలింగ్ జరగడం వల్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొంత ఆలస్యంగా సాగుతున్నప్పటికీ, ఆదివారం సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బాలెన్ షా వ్యక్తిగత ప్రయాణం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. 1990 ఏప్రిల్‌లో కాఠ్మాండులో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ చూపాడు. సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన తరువాత ఉన్నత విద్య కోసం భారత్‌ను ఎంచుకున్నాడు. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీలో 2016 నుండి 2018 వరకు స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశాడు. భారత విద్యా వ్యవస్థలో పొందిన సాంకేతిక పరిజ్ఞానం, విశాల దృక్పథం ఆయన ఆలోచనా విధానాన్ని మరింత పదును పెట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యతో పాటు బాలెన్ షా కళారంగంలో కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. రాప్ సంగీతం ద్వారా యువతలో అవగాహన కల్పిస్తూ అవినీతి వ్యతిరేక సందేశాలను ప్రసారం చేశాడు. సమాజంలోని అన్యాయాలపై ఆయన రాసిన పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనకు లక్షలాది మంది యువత మద్దతు లభించింది.
రాజకీయాల్లోకి ఆయన ప్రవేశం 2022లో జరిగింది. ఆ సంవత్సరం కాఠ్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ నిర్మాణాలు తొలగించడం, రహదారుల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఇదే ఆయనను జాతీయ రాజకీయాల్లో ముందుకు నడిపింది.
తాజా పార్లమెంటు ఎన్నికల్లో జాపా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలెన్ షా 68,348 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించాడు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిపై 49,614 ఓట్ల తేడాతో గెలవడం ఆయన రాజకీయ బలాన్ని చూపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో గ్రేటర్ నేపాల్ మ్యాప్‌ను ప్రస్తావిస్తూ కాలాపానీ, లిపులేఖ్ వంటి భూవివాదాలపై దృష్టి సారించాడు.
అయితే విదేశాంగ విధానంలో ఆయన సమతుల్యతను పాటించనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. భారత్‌తో ఓపెన్ బోర్డర్ వాణిజ్యం, జలవిద్యుత్ ప్రాజెక్టులు, అగ్నివీర్ వంటి అంశాలపై పరస్పర సహకారం కొనసాగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యువత మద్దతుతో ఎదిగిన బాలెన్ షా నిజంగా నేపాల్ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలుకుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
