Begin typing your search above and press return to search.

ఒక్క యువకుడు రగిలించిన మంట.. నేపాల్ మళ్లీ 'అంటుకుంది'

ఒక 25 ఏళ్ల యువకుడు వ్యవస్థలోని లోపాలపై నిరసనగా ఆత్మాహుతికి పాల్పడటమే ఈ దావాగ్నికి కారణమైంది.

By:  A.N.Kumar   |   14 July 2026 1:05 PM IST
ఒక్క యువకుడు రగిలించిన మంట.. నేపాల్  మళ్లీ అంటుకుంది
X

నేపాల్‌లో యువత మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమ బాట పట్టింది. సోషల్ మీడియా వేదికగా మొదలైన డిజిటల్ ఆగ్రహం.. ఇప్పుడు రాజధాని ఖాట్మండు వీధులను కుదిపేస్తోంది. వేలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే ఈ ఘటనకు బాధ్యత వహించాలని.. ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక 25 ఏళ్ల యువకుడు వ్యవస్థలోని లోపాలపై నిరసనగా ఆత్మాహుతికి పాల్పడటమే ఈ దావాగ్నికి కారణమైంది.

అసలేం జరిగింది?

జూలై 9న ఖాట్మండుకు చెందిన 25 ఏళ్ల గణేష్ నేపాలి అనే యువకుడు స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయం బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో తన బైక్‌ను పార్క్ చేశాడు. అయితే అది 'నో-పార్కింగ్ జోన్' అని పేర్కొంటూ ఖాట్మండు మెట్రోపాలిటన్ పోలీసులు అతని బైక్‌కు లాక్ వేసి.. 1,000 నేపాలీ రూపాయల జరిమానా విధించారు.

ఈ చిన్న జరిమానా విషయంపై గణేష్‌కు, అక్కడి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారుల వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేష్.. అక్కడే అందరూ చూస్తుండగానే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మరణించాడు.

సోషల్ మీడియా వేదికగా ఒక్కటైన జెన్ జెడ్

గణేష్ మృతికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో దావానంలా వైరల్ అయ్యాయి. దీంతో దేశంలోని జెన్ జెడ్ యువత ఒక్కసారిగా స్పందించింది. యువత అంతా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వేదికగా నిరసనలను సమన్వయం చేసుకుంటూ రోడ్లపైకి వచ్చారు. "గణేష్‌కు న్యాయం చేయాలి", "అధికారుల నిర్లక్ష్యం నశించాలి".. "ప్రధాని రాజీనామా చేయాలి" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీలు తీస్తున్నారు. కేవలం ఖాట్మండులోనే కాకుండా నేపాల్‌లోని పలు ప్రధాన నగరాలకు ఈ నిరసనలు వేగంగా పాకాయి.

గతంలో కూడా నేపాల్‌లో యువత ఏకంగా జెన్ జెడ్ ఉద్యమంతో గత ప్రభుత్వాన్ని నేలకూల్చారు. ప్రధానిని పారిపోయేలా చేశారు. సోషల్ మీడియా ద్వారా పలు ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టి విజయం సాధించారు.. ఇప్పుడు గణేష్ నేపాలి ఘటన మరోసారి వ్యవస్థపై యువత తిరుగుబాటు చేసేలా చేసింది.

ఉత్కంఠలో నేపాల్ రాజకీయాలు

పరిస్థితి తీవ్రతను గమనించిన నేపాల్ ప్రభుత్వం, పోలీసులు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అయితే నిరసనకారులు మాత్రం కేవలం విచారణలతో సరిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు.. ప్రభుత్వ పాలనలో సమూల మార్పులు రావాలని పట్టుబడుతున్నారు.

శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించినప్పటికీ యువత వెనక్కి తగ్గడం లేదు. ఈ పరిణామం నేపాల్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సామాన్య యువకుడి మరణం నేపాల్ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.