రాజరికం.. మావోయిజం.. ప్రజాస్వామ్యం.. నేపాల్ గురించి మీకివి తెలుసా?
ఏ దేశంలోనైనా రాజరికం.. ప్రజాస్వామ్యం ఉంటాయి... కానీ, నేపాల్‌లో రాజరికం.. మావోయిజం.. ప్రజాస్వామ్యం.. మూడూ ఉన్నాయి.
By: Tupaki Desk | 10 Sept 2025 2:00 AM ISTఏ దేశంలోనైనా రాజరికం.. ప్రజాస్వామ్యం ఉంటాయి... కానీ, నేపాల్‌లో రాజరికం.. మావోయిజం.. ప్రజాస్వామ్యం.. మూడూ ఉన్నాయి. మొన్నమొన్నటి వరకు నేపాల్‌కు రాజు ఉండేవారు. ఆయనను వ్యతిరేకిస్తూ.. మావోయిస్టులు ఉండేవారు. కాలక్రమంలో మావోయిస్టులు ప్రజాస్వామ్యంలోకి వచ్చి రాజును దించేశారు. ప్రభుత్వంలోనూ భాగమయ్యారు. ఇప్పుడు వారిలో వారే గొడవ పడుతూ దేశాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టారు. గత ఏడాది జూలై వరకు ప్రధానిగా మాజీ మావోయిస్టు ప్రచండ (పుష్ప కుమార్ దహల్) ఉండగా.. ఆయనను తప్పించి కేపీ శర్మ ఓలీ పదవిలోకి వచ్చారు. 14 నెలల్లోనే ఆయన ప్రజాగ్రహానికి గురయ్యారు.
రాజు నుంచి ప్రజల్లోకి నే‘పాలన’
నేపాల్‌ను హిమాలయ రాజ్యం అంటారు. 2006 వరకు ఈ దేశంలో రాజరికం కొనసాగింది. మావోయిస్టుల పోరాటంతో రాజరికం అంతమైంది. అప్పటికి రాజు జ్ఞానేంద్ర ఉండేవారు. మావోయిస్టులూ ప్రజాస్వామ్యంలోకి వచ్చేశారు. ఇది ప్రపంచాన్నే ఆకర్షించిన సంఘటన. ఇక అప్పటినుంచి అంటే దాదాపు 20 ఏళ్లుగా నేపాల్‌లో ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. కానీ, తరచూ ప్రభుత్వాలు, ప్రధానులు మారిపోతున్నారు.
భారత్‌తో బలమైన బంధం
నేపాల్ ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం. భారతదేశంలో విలీనం అవుతామని 1950ల్లో ప్రతిపాదన రాగా అప్పటి మన ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని చరిత్రకారులు చెబుతుంటారు. విశాల దృక్పథం ఉన్న నెహ్రూ నేపాల్‌ను ఒక గణతంత్ర దేశంగానే చూశారని పేర్కొంటుంటారు. కాగా, భారతీయులకు పాస్ పోర్టు అవసరం లేని దేశం నేపాల్. సిక్కిం నుంచి ఉత్తరాఖండ్ వరకు ఉన్న 1,751 కిలోమీటర్ల సుదీర‍్ఘ సరిహద్దుల్లో స్వేచ్ఛగా రాకపోకలు సాగుతుంటాయి. బెంగాల్, సిక్కిం, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో నేపాల్ సరిహద్దులు కలిగి ఉంది. భారత్ లో గూర్ఖాలుగా చాలామంది నేపాలీలు పనిచేస్తుంటారు.
-2001లో నేపాల్ రాజుగా బీరేంద్ర ఉండేవారు. ఈయన సోదరుడు జ్ఞానేంద్ర. కాగా, బీరేంద్రను ఆయన భార్యను వారి కుమారుడు దీపేంద్ర కాల్చి చంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆస్పత్రిలో చనిపోయాడు. కాగా, ఇతర కుటుంబ సభ్యులు ముందుకురాకపోవడంతో చివరకు జ్ఞానేంద్ర రాజు అయ్యారు. మావోయిస్టుల ఉద్యమంతో ఆయన 2006లో దిగిపోయారు. 2007 జనవరితో రాజరికం అంతమైంది. 2008 మే 28న రాజ్యాన్ని రద్దు చేసి, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్‌గా ప్రకచుకున్నారు.
ఆ స్టార్ హీరోయిన్ నేపాలీనే..
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న మనీషా కొయిరాలా నేపాలీనే. ఈమె తాత బీపీ కొయిరాలా నేపాల్ ప్రధానిగా పనిచేశారు. మాజీ రాజు బీరేంద్ర భారతదేశంలోనే చదువుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారత్‌తో అనేక దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. వాటితో వేటితోనూ నేపాల్‌తో ఉన్నంత సాంసృ‍్కతిక అనుబంధం లేదు. ఇప్పుడు ఆ దేశంలో పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
