Begin typing your search above and press return to search.

నెల్లూరులో లెక్క తప్పుతోందా ?

నిజం చెప్పాలంటే వైసీపీకి ఈ జిల్లా నుంచే తొలి ధిక్కార స్వరాలు వినిపించాయి.

By:  Tupaki Desk   |   20 April 2024 4:30 PM GMT
నెల్లూరులో లెక్క తప్పుతోందా ?
X

నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట. ఇందులో రెండవ మాటకు తావు లేదు. 2014లో మెజారిటీ సీట్లను గెలుచుకున్న వైసీపీ 2019 నాటికి మొత్తానికి మొత్తం పది సీట్లను గెలుచుకుని జిల్లాను స్వీప్ చేసి పారేసింది. అంతటి ఆదరణ వైసీపీకి ఈ జిల్లాలో ఉంది. అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లలో నెల్లూరు రాజకీయం బాగా మారిపోయింది.

నిజం చెప్పాలంటే వైసీపీకి ఈ జిల్లా నుంచే తొలి ధిక్కార స్వరాలు వినిపించాయి. ఏకంగా జగన్ ని దేవుడు అని కొలిచిన వారే ఎదిరించారు. కలలో కూడా ఊహించని విధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ మీద విమర్శలు చేశారు. అదే విధంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు.

ఇక ఎన్నికలు దగ్గర పడిన వేళ బిగ్ షాట్ లాంటి మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి కూడా పార్టీని వీడారు. ఇలా దెబ్బ మీద దెబ్బ పడిపోయింది వైసీపీకి. ఇక నెల్లూరు రాజకీయం గురించి చూసుకుంటే ఈ జిల్లా మొదటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోట. ఆ తరువాత వైసీపీ వైపుగా పూర్తి స్థాయిలో టర్న్ అయింది. వైసీపీతోనే తన రాజకీయ పయనంగా గడచిన దశాబ్దంగా నెల్లూరు జిల్లా ఉంది.

అటువంటి నెల్లూరు జిల్లాలో ఈసారి రాజకీయ లెక్క పక్కాగా తప్పుతోంది అని అంటున్నారు. పదికి పది ఎమ్మెల్యే సీట్లు గెలిచిన చోట ఈసారి వైసీపీ రాజకీయ జాతకం ఎలా ఉంటుంది అన్నది చూస్తే కనుక చాలా ఇబ్బందులే తప్పవని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా నిన్నటిదాకా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి జిల్లాలో అతి పెద్ద ఆర్ధిక వనరుగా ఉంటూ వచ్చారు.

దాంతో ఎలాంటి చీకూ చింతా లేకుండా వైసీపీ రాజకీయం సాఫీగా సాగిపోయింది అని చెప్పాలి. నిజానికి జస్ట్ చిన్న ఇగో సమస్యతోనే ఆయన పార్టీని వీడారు అని అంటారు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని వదులుకోవద్దు అని చాలా మనంది నేతలు వైసీపీ అధినాయకత్వానికి చెప్పి చూశారని కూడా ప్రచారంలో ఉన్న మాట.

అయితే జగన్ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని వేమిరెడ్డి వెళ్ళిపోయినా పట్టించుకోలేదని అసలు ఆ అంశానికే ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రచారంలో ఉన్న మాట. దాంతోనే తన ఇగో హర్ట్ అయి వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు.

ఇక వేమిరెడ్డి వంటి బిగ్ షాట్ టీడీపీలోకి వెళ్లిపోయాక నెల్లూరు జిల్లాలో మొత్తం రాజకీయం రివర్స్ అయింది అని అంటున్నారు. ఆయన టీడీపీ తరఫున ఎంపీగా పోటీలో ఉన్నారు. దాంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లలో టీడీపీకి కచ్చితంగా మూడు సీట్లు ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే మరో మూడింటిలో కూడా హోరా హోరీ పోరు సాగుతోంది అని అంటున్నారు. ఇలా కనుక చూస్తే కేవలం ఒక సీట్లో మాత్రమే వైసీపీకి సాలిడ్ గా విన్నింగ్ చాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

నెల్లూరులో పెద్దా రెడ్లు అంతా ఈసారి టీడీపీకి జై కొడుతున్నారు అని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తే కనుక కంచుకోట లాంటి జిల్లాలో వైసీపీ అధినాయకత్వం సరైన చర్యలు తీసుకోకుండా వదిలేయడం వల్లనే ఈ పరిస్థితి అని అంటున్నారు. ఒక నాయకుడు పోతేనేంటి అని లైట్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం ఒక్కోసారి ఏకమొత్తంగా జిల్లా రాజకీయాన్నే మార్చేస్తుంది అని అంటున్నారు.

అట్టు తిరిగేసినట్లుగా పదికి పది గెలిచిన చోటనే ఇపుడు ఒక్క సీటు మాత్రమే గ్యారంటీ వైసీపీకి అని అంటే దాని వెనక తప్పులు ఎవరివి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. నిజానికి చూస్తే రెండు మూడు నెలల క్రితం వరకూ కూడా వైసీపీకి ఇంత దారుణమైన పరిస్థితి అయితే లేదు అనే అంటున్నారు. బిగ్ షాట్స్ గా ఉన్న వారు ఇటు నుంచి అటు వెళ్లడంతో టీడీపీ సైకిల్ కి ఊపు వచ్చిందని అదే సమయంలో ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోయిందని అంటున్నారు.